తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చెర్రీతో సినిమా చేయాలనేది నా కోరిక!'

'ఉప్పెన' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది హీరోయిన్​ కృతిశెట్టి. 'రంగస్థలం' సినిమా చూసి రామ్​చరణ్​కు వీరాభిమానిగా మారినట్లు ఆమె చెబుతోంది. డాక్టర్​ అవ్వాలని అనుకున్నా.. సినిమాల్లో వస్తోన్న వరుస ఆఫర్లను కాదనలేక చిత్రసీమలో కొనసాగుతున్నానని చెబుతోందీ భామ.

Uppena Heroine Krithi Shetty interview
కృతిశెట్టి

By

Published : May 2, 2021, 7:52 AM IST

ఆమె నవ్వులో మేజిక్‌ ఉందన్నారు, కళ్లలో మెరుపుందన్నారు, ముఖం చంద్రబింబమేనని పొగిడారు. అవన్నీ ట్రైలర్‌, టీజర్‌ చూసినపుడు. సినిమా వచ్చాక నటనకూ ఫిదా అయిపోయారు. మొదటి సినిమా 'ఉప్పెన'తోనే టాలీవుడ్‌లో బలమైన పునాది వేసుకుంది కృతిశెట్టి. ఉప్పెనకు ముందూ తర్వాతా తన కెరీర్‌ గురించి ఈ అమ్మాయి ఏం చెబుతోందంటే..

ప్రకటనలతో మొదలు

కృతిశెట్టి

మా సొంతూరు మంగళూరు. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నాం. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. చిన్నపుడు నా గురించి నేను ఆలోచించుకునే మనిషిని. అలాగైతే కష్టమని నలుగురిలో కలవడానికి అన్నివిధాలా ప్రోత్సహించేవారు. తర్వాత మోడలింగ్‌లోనూ అవకాశం వచ్చింది. స్కూల్లో ఉన్నపుడే చాలా ప్రకటనల్లో నటించా. లైఫ్‌బాయ్‌, డెయిరీ మిల్క్‌, లింక్‌ పెన్స్‌.. ఇలా పది వరకూ ప్రకటనల్లో చేశా. డాక్టర్‌ కావాలన్నది నా లక్ష్యం. అమ్మానాన్న యాక్టింగ్‌ వైపు కూడా ప్రయత్నించి చూద్దామన్నారు.

వందల మందిని కాదని..

నా ఫొటోల్ని 'పూరీ కనెక్ట్స్‌' ఏజెన్సీ ద్వారా 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు గారు చూసి ఆడిషన్స్‌ కోసం హైదరాబాద్‌ రమ్మన్నారు. ఆడిషన్‌ సమయంలో సీన్లు చెప్పి నటించమని అడగలేదు. బొట్టు పెట్టుకోమన్నారు. అటూఇటూ నడవమని చెప్పారు. తర్వాత కాసేపటికి ఎంపికచేసినట్లు చెప్పారు. అప్పటికి దాదాపు రెండువేల మంది అమ్మాయిల ఫొటోల్ని పరిశీలించాక నన్ను ఎంపికచేశారని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా.

కృతిశెట్టి

ఎప్పటికీ మర్చిపోలేను!

'ఉప్పెన' షూటింగ్‌ ఓ యాక్టింగ్‌ స్కూల్‌ అనుభవాన్ని ఇచ్చింది. ఒకటికి రెండు టేక్‌లు తీసుకున్నా దర్శకుడు ఎంతో ఓర్పుగా చెప్పేవారు. వైష్ణవ్‌కి కూడా మొదటి సినిమా కావడం వల్ల ఇద్దరం ఒకరినొకరం ప్రోత్సహించుకునేవాళ్లం. విజయ్‌ సేతుపతిగారి లాంటి యాక్టర్ల నటనను లైవ్‌లో చూడటం మంచి అవకాశం. ఆయనే నాకు నటనలో చాలా విషయాలు నేర్పారు. ఒకసారి నేను చేసిన సీన్‌ను మానిటర్‌లో చూసిన సినిమాటోగ్రాఫర్‌.. 'నీ భావోద్వేగాలతో ఏడిపించేశావ్‌' అని కళ్లు తుడుచుకుంటూ చెప్పారు. ఆ మాటల్ని ఎప్పటికీ మర్చిపోలేను.

వారంలో తెలుగు నేర్చుకున్నా షూటింగ్‌ మొదలవ్వడానికి ముందు వారంపాటు వర్క్‌షాప్‌ నిర్వహించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్ల సాయంతో తెలుగు నేర్చుకున్నా. సినిమాకు డబ్బింగ్‌ చెప్పలేదు కానీ, షూటింగ్‌ సమయంలో ప్రతి డైలాగునీ తెలుగులోనే చెప్పా. సినిమా పూర్తయిన టైమ్‌కి తెలుగు అర్థమవ్వడమే కాదు, మాట్లాడటమూ వచ్చేసింది. హైదరాబాద్‌లో ఉన్నపుడు దివ్యారెడ్డి గారి దగ్గర కూచిపూడిలో శిక్షణ తీసుకున్నా. 'ఉప్పెన'లో 'ఈశ్వరా.. పరమేశ్వరా' పాటకు కూచిపూడి డ్యాన్స్‌ చేసి ఒక వీడియో తీశాం. అది యూట్యూబ్‌లో పెడితే లక్షల వ్యూస్‌ వచ్చాయి.

కృతిశెట్టి

సొంత కూతురిలా..

'ఉప్పెన' షూటింగ్‌కు రాక ముందు ఇక్కడ ఎలా ఉంటుందోనని బిడియంగా ఉండేది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందరూ బాగా చూసుకున్నారు. దర్శక, నిర్మాతలైతే తమ సొంత కూతురిలానే ఆదరించారు. అంత మంచి బృందంతో పనిచేయడంతో చాలా ఆనందంగా ఉన్నా! 'ఉప్పెన' మొదటి సినిమా కావడం నిజంగా నా అదృష్టమే.

రామ్‌చరణ్‌ అభిమానిని

ఒక్క సినిమా చేసి మళ్లీ చదువు కొనసాగిద్దాం అనుకున్నా కానీ 'ఉప్పెన' రిలీజ్‌కు ముందే మరో రెండు(శ్యామ్‌ సింగరాయ్‌, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి) సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. రిలీజ్‌ తర్వాత మరో రెండు సినిమాల్లో అవకాశం వచ్చింది. అప్రయత్నంగానే అవకాశాలు వస్తున్నపుడు ఈ రంగాన్ని ఎందుకు వదులుకోవడం అనిపించింది. 'ఉప్పెన' షూటింగ్‌కు ముందు దర్శకుడు నన్ను కొన్ని సినిమాలు చూడమన్నారు. అన్నింటిలోకీ 'రంగస్థలం' బాగా నచ్చింది. రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించారు. ఆ సినిమా చూశాక ఆయనకు అభిమానినైపోయా. తనతో ఓ సినిమా చేయాలనేది నా కోరిక.

కృతిశెట్టి

ఇదీ చూడండి:'ఈశ్వర' పాటకు కృతిశెట్టి స్పెషల్ డ్యాన్స్

ABOUT THE AUTHOR

...view details