'ఫిదా' అంటే సాయి పల్లవి, 'ఉప్పెన' అనగానే కృతి శెట్టి గుర్తొచ్చేస్తున్నారు కదూ! భానుమతి, బేబమ్మ పాత్రల్లో నటించి అంతలా మాయ చేశారు మరి. వీళ్లని గాఢంగా ప్రేమించింది వరుణ్ (వరుణ్ తేజ్) , ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) అనే సంగతి తెలిసిందే. కానీ, ఈ పాత్రలు ముందుగా వేరే హీరోల కోసం అనుకున్నవనే సంగతి మీకు తెలుసా? ఎవరా కథానాయకులు అంటే మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ. ఎందుకు చేయలేదంటే.. దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుగా 'ఫిదా' కథను మహేశ్‌కు వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అదే సమయంలో వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారాయన. డేట్స్ కుదరకపోవడం వల్ల మహేశ్ ఈ ప్రాజెక్టు చేయలేకపోయారు. మహేశ్ కోసం వేచిచూస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో వరుణ్ తేజ్‌తో 'ఫిదా'ను పట్టాలెక్కించారు శేఖర్ కమ్ముల.
'ఫిదా', 'ఉప్పెన' ఆ హీరోలతో చేయాల్సింది.. కానీ! - ఫిదా హీరో మహేశ్ బాబు
'ఫిదా'లో వరుణ్ తేజ్, 'ఉప్పెన'లో వైష్ణవ్ తేజ్.. వారి వారి నటనతో ప్రేక్షకుల్ని ఆక్టటుకున్నారు. కానీ ఈ సినిమాల్లో హీరో పాత్ర కోసం మొదటగా అనుకుంది వీరిని కాదు.
'ఉప్పెన' విషయానికొస్తే.. దర్శకుడు బుచ్చిబాబు సానా కథ సిద్ధం చేసుకుని హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ అయితే బావుంటుందనుకున్నా.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో విజయ్ రేంజ్ పెరిగిపోయిందని, అలాంటి పరిస్థితుల్లో విజయ్‌ని ఈ ప్రేమకథలో నటింపజేయడం సరైంది కాదనే నిర్ణయానికొచ్చారు బుచ్చిబాబు. లుక్స్ పరంగా విజయ్ లాంటి కుర్రాడే కావాలి, 'అర్జున్ రెడ్డి' లో విజయ్‌లా కథని భుజాలపై వేసుకుని నడిపించగలిగే కొత్త నటుడు కావాలనుకున్నారు. ఆ అన్వేషణలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో వైష్ణవ్ ఫొటో చూసి తనే 'ఉప్పెన'కు హీరో అని ఫిక్స్ అయిపోయారు బుచ్చిబాబు. అలా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మంచి విజయం అందుకున్నారు.