తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెర విలక్షణ హీరో.. ఉప్పీ దాదా

వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించి.. హీరోయిజానికి సరికొత్త ట్రెండ్​ సృష్టించిన నటుడు, దర్శకుడు ఉపేంద్ర. ఆయన డైరెక్షన్​లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాకుండా సందేశాత్మకంగానూ ఉంటాయి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉపేంద్ర వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ కెరీర్​పై ప్రత్యేక కథనం.

By

Published : Sep 17, 2020, 6:00 AM IST

Updated : Sep 18, 2020, 6:49 AM IST

upendra
ఉపేంద్ర

విలక్షణమైన హీరోయిజాన్ని కనబరిచి.. తెలుగు, కన్నడ చిత్రసీమల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో అత్యుత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉపేంద్ర. ఆయన తెరపై కనిపిస్తే ప్రేక్షకులు కోరుకునేది కూడా వైవిధ్యతే. కొత్తగా ఆయన చిత్రాలు చూసేవారికి తెరపై ఓ ప్రతినాయకుడిగా కనిపిస్తాడు. కానీ, ఒక్కసారి ఆ నటనను చూడటానికి అలవాటు పడ్డాక ఆ విలనిజంలోని అసలైన విలక్షణత బయటపడుతుంది. ఉపేంద్ర చిత్రాలన్నీ పైకి ఎలా ఉన్నా అంతర్లీనంగా ఓ అర్థవంతమైన సందేశాలనందిస్తాయి.

ఆ సినిమాల్లోని సంభాషణలు సమాజంలో తరతరాలుగా పేరుకుపోయిన రుగ్మతలను చాచిపెట్టి లెంపకాయ కొట్టినట్లుగా ఉంటాయి. ఇక వీటిలో ఉపేంద్ర కనబరిచే నటన ఒక ఎత్తైతే.. దాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చిన విధానం మరొక ఎత్తు. తనలోని నటన ఎంత విలక్షణీయంగా ఉంటుందో.. తెరపై ఆయన దర్శకత్వ ప్రతిభ కూడా అంతే వైవిధ్యభరితంగా కనువిందు చేస్తుంది. దీనికి ఉదాహరణే.. ఆయన నుంచి వచ్చిన 'ష్‌', 'రా', 'ఓం', 'ఉపేంద్ర', 'రక్త కన్నీరు' చిత్రాలు. ఇవన్నీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలవడమే కాక.. దర్శకుడిగా, నటుడిగా ఉపేంద్రకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

పేదరికం నేర్పించిన పాఠం..

ఉపేంద్ర కన్నడ నాట స్టార్‌ కథానాయకుడిగా, దర్శకుడిగా వెలుగులు చిందించడం వెనుక ఆయన ఎన్నో ఏళ్ల కష్టముంది. చిత్రసీమలో ఎలాంటి గాడ్‌ ఫాదర్‌లు లేకున్నా స్వయం ప్రతిభతో కన్నడ చిత్రసీమలో శిఖర స్థాయిని చేరుకున్నారు. ఇక ఆయన గతాన్ని మరింత వెనక్కు వెళ్లి తరచి చూస్తే తను అనుభవించిన కడు పేదరికం, దాటొచ్చిన కష్టాలు మనసును మెలిపెడతాయి.

ఉపేంద్ర పూర్తి పేరు ఉపేంద్ర రావు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో 1967 సెప్టెంబరు 17న కుందాపుర అనే మారుమూల గ్రామంలో జన్మించారు. మంజునాధరావు, అనసూయమ్మ తల్లిదండ్రులు. చిన్నతనంలో చాలా పేదరికం అనుభవించారు. కుటుంబ పోషణ కోసం తండ్రి కూలి పనులకు వెళ్తుండేవారు. ఉపేంద్ర చిన్నతనంలో కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో చాలా బాధపడ్డారు. ఫలితంగా కనుగుడ్లను తిప్పడంలో ఆయనకు సమస్యలు ఏర్పడ్డాయి. దీన్ని ఆయన చిత్రాల్లో కూడా గమనించవచ్చు.

ఉపేంద్రకు చిన్ననాటి నుంచి సినీ రంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ కళాశాల స్థాయికి వచ్చాక అది మరింత ముదిరింది. అందుకే బెంగుళూరులోని ఎ.పి.ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చేరాక తన స్నేహితులతో కలిసి ఓ నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ప్రదర్శనలు ఇస్తుండేవారు. అలా చేస్తున్న రోజుల్లోనే తన దూరపు బంధువు అయిన ప్రముఖ కన్నడ నటుడు కాశీనాథ్‌ దృష్టిలో పడ్డారు. ఇదే ఉపేంద్ర నటనా జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన కాశీనాథ్‌ సహకారంతో చిత్రసీమలోని పలువురు ప్రముఖుల వద్ద అన్ని విభాగాల్లో పని చేసి తన పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా..

ఉపేంద్ర అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది తనలోని విలక్షణమైన నటనే. కానీ, నిజానికి ఉపేంద్ర ముందు తెరకు పరిచయమైంది నటుడిగా కాదు.. దర్శకుడిగా. అసలు అతను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిందే దర్శకుడవ్వాలనే కలతో. ఆయనలో ఓ గొప్ప కథా రచయిత, పాటల రచయిత, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు కూడా ఉన్నారు. తన సినిమాలతో ఆ బహుముఖ ప్రతిభను ప్రేక్షకులకు రుచి చూపించారు.

ఆయన తొలిసారిగా దర్శకుడిగా తెరపై మెరిసింది 1992లో వచ్చిన 'తర్లే నన్‌ మగ' అనే కన్నడ చిత్రంతో. ఈ మూవీతోనే ప్రముఖ హాస్యనటుడు జగ్గేష్‌ తెరకు పరిచయమయ్యారు. ఓ వైవిధ్యమైన కల్ట్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కుమార్‌ గోవింద్‌ ప్రధాన పాత్రలో 'ష్‌' అనే హారర్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. 1993లో విడుదలైన ఈ సినిమా కన్నడలో ది బెస్ట్‌ హారర్‌ థ్రిల్లర్‌లో ఒకటిగా నిలిచింది.

ఇక 1995లో ఉపేంద్ర నుంచి వచ్చిన 'ఓమ్‌' దక్షిణాదిలోనే బిగ్గెస్ట్‌ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి గానూ ఆయన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని దక్కించుకోవడమే కాక, ఫిలింఫేర్‌ అవార్డునూ సొంతం చేసుకున్నారు. ఇక అదే ఏడాది స్టార్‌ హీరో అంబరీష్‌తో చేసిన 'ఆపరేషన్‌ అంత' బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది.

ఉప్పీ హీరోయిజంకు బీజం పడింది అక్కడే.

చిత్రసీమలోకి దర్శకుడిగా అడుగుపెట్టినా ఉపేంద్రకు నటుడిగానూ సత్తా చాటాలనే కోరిక ముందు నుంచీ ఉంది. అందుకే ఆయన తన దర్శకత్వంలో తెరకెక్కిన 'ష్‌', 'ఆపరేషన్‌ అంత' చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. తొలిసారిగా కథానాయకుడిగా తెరపై మెరిసింది ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏ' చిత్రంతోనే. అప్పటి వరకు ఒక రకమైన హీరోయిజానికి అలవాటు పడిన సినీప్రియులకు ఉపేంద్ర హీరోయిజం ఓ షాక్‌ అనే చెప్పాలి.

హీరోయిజం అనే మాటలకు ఓ కొత్త అర్థాన్ని, తనకు మాత్రమే సాధ్యమైన సరికొత్త సొబగులను 'ఏ'తో అద్దారు ఉపేంద్ర. అంతేకాదు దక్షిణాదిలో కల్ట్‌ చిత్రాలకు కేరాఫ్‌గానూ మారారు ఉప్పీ. ఇదే సమయంలో తెలుగులో 'కన్యాదానం' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించి తెలుగువారికీ దగ్గరయ్యారు.

ఉప్పి ప్రధాన పాత్రలో నటించిన 'ఉపేంద్ర', 'ఒక్కమాట', 'రా', 'బీ2', 'రక్త కన్నీరు', 'సూపర్' వంటి సినిమాలు అటు కన్నడలోనూ ఇటు తెలుగులోనూ వరుస హిట్లను అందుకున్నాయి. దాంతో ఆయన క్రేజ్‌ ఒక్కసారిగా జాతీయ స్థాయికి పాకింది. ముఖ్యంగా సామాజిక సమస్యలను ఆయుధాలుగా చేసుకుని తన చిత్రాలతో దాన్ని ఆయన ఎత్తి చూపే విధానం సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకునేది. దీనికి తగ్గట్లుగానే ఆయన హీరోయిజం కూడా ఎంతో విలక్షణమైన రీతిలో దర్శనమిచ్చేది. అందుకే ఆయన హీరోయిజాన్ని ప్రేక్షకులు ముద్దుగా ఉప్పియిజం అని పిలుస్తుంటారు. ఈ పేరు మీద ఉపేంద్ర 'ఉప్పీదాదా ఎంబీబీఎస్‌', 'ఉప్పి 2' వంటి చిత్రాలను తెరకెక్కించి విజయాలు అందుకున్నారు.

ఆయనను కన్నడ రియల్‌ స్టార్‌గానూ అభిమానిస్తుంటారు అక్కడి సినీప్రియులు. ఇక టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' (2015) చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు ఉపేంద్ర. ఇందులో దేవరాజ్‌గా ఆయన కనబర్చిన నటనకు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. దీనికి ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డును అందుకున్నారు ఉపేంద్ర. ఇటీవలే 'ఐ లవ్‌ యూ' చిత్రంతో తెలుగు సినీప్రియులను పలకరించారు. అయితే దీనికి బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన దక్కింది.

రాజకీయాల్లోనూ ఉప్పీ మార్క్‌..

సినీ రంగం వల్ల ప్రజల్లో ఏర్పడిన క్రేజ్‌తో రాజకీయ రంగంలోనూ సత్తా చాటే ప్రయత్నం చేశారు ఉపేంద్ర. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' (కేపీజేపీ) పేరుతో 2018లో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచీ పోటీ చేసినప్పటికీ దారుణ పరాజయాల్ని చవిచూశారు. భాజపా పొత్తుతో ఒక సీటును మాత్రం గెలుచుకోగలిగింది కేపీజేపీ.

వ్యక్తిగత జీవితంలో..

2003 డిసెంబరు 14న మోడల్, నటి ప్రియాంక త్రివేదిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 'రా', 'హెచ్‌2ఓ' చిత్రాల్లో జంటగానూ నటించి మెప్పించారు. వీరికి ఆయుష్‌ ఉపేంద్ర, ఐశ్వర్య ఉపేంద్ర అనే ఓ బాబు, పాప ఉన్నారు.

Last Updated : Sep 18, 2020, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details