యుద్ధం అనేది వెండితెరకు కొత్త కథావస్తువేం కాదు. సరిగ్గా తెరకెక్కిస్తే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. బిగి సడలని కథనం..ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్‌తో కథను తీర్చిదిద్దితే ప్రేక్షకుడు యుద్ధంలో పోరాడుతున్న అనుభూతికి గురవుతాడు. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్', 'షేర్షా' లాంటి వార్ చిత్రాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని యుద్ధ నేపథ్య సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. కంగనా రనౌత్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్, ఇషాన్ కట్టర్.. వీళ్లందరూ యుద్ధవీరులుగా తెరపై సందడి చేయనున్నారు.
కంగన తేజసం
'తలైవి'తో ప్రేక్షకుల్ని అలరించిన కంగన నటిస్తున్న వార్ చిత్రం 'తేజస్'(kangana ranaut tejas movie). పాత్ర ఎలాంటిదైనా అందులోకి కంగన ఎలా పరకాయ ప్రవేశం చేస్తుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇక పాత్ర విషయానికొస్తే ఎంతవరకూ అయినా వెళుతుంది. ఎలాంటి కష్టమైనా పడుతుంది కంగన. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ముగిసింది. కొత్త దర్శకుడు సర్వేష్ మేవ్రా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్లీ, ముంబయి, రాజస్థాన్‌ల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ పైలెట్‌గా కంగన లుక్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది.
మానెక్షా పోరాటం
'సర్దార్ ఉదమ్‌సింగ్'గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న విక్కీ కౌశల్ నటిస్తున్న మరో జీవిత కథ 'సామ్ మానెక్షా'(vicky kaushal sam manekshaw movie). భారతీయ తొలి ఫీల్డ్ మార్షల్ అయిన సామ్ మానెక్షా 1971 భారత్ పాక్ యుద్ధంలో చీఫ్ ఆఫ్ ఆర్మీగా పనిచేశారు. ‘రాజీ’ లాంటి హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలో విక్కీకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.