'తింటే గారెలు తినాలి.. వింటే మహాభారతం వినాలి'.. అలానే సినిమా అంటూ చూస్తే థియేటర్లోనే చూడాలి. కానీ కరోనా లాక్డౌన్.. ఆ అనుభూతిని దాదాపు తొమ్మిది నెలలు మనకు దూరం చేసింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. వచ్చే జనాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే బడా, చిన్న చిత్రాలు కొన్ని.. వచ్చే ఏడాది మనల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో అగ్రహీరోలతో పాటు యువ హీరోల సినిమాలూ ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?
థియేటర్లో సినిమాలు విడుదల స్టార్ హీరోలు.. భారీ చిత్రాలు
ఈ ఏడాది వెండితెరపై విడుదల కావాల్సిన చాలా చిత్రాలు లాక్డౌన్ వల్ల రిలీజ్‌కు నోచుకోలేదు. షూటింగ్ నిలిచిపోవడం, థియేటర్లు తెరుచుకోకపోవడం వల్లే ఇలా జరిగింది.
ఈ జాబితాలో చిరంజీవి 'ఆచార్య', పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్', వెంకటేశ్ 'నారప్ప', బాలకృష్ణ-బోయపాటి సినిమా, నాగార్జున 'వైల్డ్‌డాగ్', రామ్‌చరణ్-జూ.ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్', అల్లు అర్జున్ 'పుష్ప', ప్రభాస్ 'రాధేశ్యామ్', రవితేజ 'క్రాక్'తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి.
థియేటర్ దగ్గర అభిమానులు సందడి దూకుడు మీదున్న చిన్న హీరోలు
భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న హీరోలు కూడా తమ చిత్రాలను కొత్త ఏడాదిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో నాని, రామ్, విజయ్ దేవరకొండ, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, వరుణ్ తేజ్ తదితరుల చిత్రాలు ఉన్నాయి. కొందరు కథానాయకులు నటించిన రెండు, మూడు సినిమాలు 2021లో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.