Upcoming sports movies 2022: క్రికెట్, ఫుట్‌బాల్, బాక్సింగ్.. ఆట ఏదైనా భావోద్వేగాలు చక్కగా కుదిరి ప్రేక్షకుణ్ని ఆటలోకి తీసుకెళ్లగలిగితే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ సూత్రాన్ని పాటిస్తూ ఫుట్‌బాల్, క్రికెట్, స్నూకర్, బాక్సింగ్ నేపథ్యంగా పలు చిత్రాలు అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటో చూసేద్దాం..
మైదాన్ మెరుపులు
Ajaydevgan Maidan movie: ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం రానున్న మరో చిత్రం ‘మైదాన్’. కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాని జూన్ 3న విడుదల చేయనున్నారు.
ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం
ఈ ఏడాది ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే. ఎందుకంటే 2022లో ఫుట్‌బాల్ నేపథ్యంలో సాగే రెండు చిత్రాలు వస్తున్నాయి. అందులో ఒకటి ‘జుండ్’, రెండోది ‘మైదాన్’. మన దగ్గర ఫుట్‌బాల నేపథ్యంగా వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రం ‘జుండ్’. ప్రముఖ నటుడు అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. మాదక ద్రవ్యాలకు బానిసలైన వీధి బాలలను చేరదీసి వాళ్లని ఫుట్‌బాల్ ఆటగాళ్లుగా తీర్చిదిద్దిన విజయ్ బర్సే జీవిత కథ స్పూర్తితో ఈ చిత్రం రూపొందింది. రిటైర్డ్ టీచర్ తనకు ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు ఎదురైన తట్టుకొని వీధిబాలల్లో ఫుట్‌బాల్ ఆటను ప్రేమించేలా చేసిన తీరు ఈ చిత్రంలో చూపెట్టనున్నారు. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 4న రానుంది.
క్రికెటర్ జాన్వీ
Janvi kapoor sports movie: క్రికెట్ అభిమానుల కోసం వస్తున్న మరో చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో శరణ్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ధర్మప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబరు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఒక్కోసారి నీ కలల్ని ఒంటరిగా సాధించేవు...తోడుగా సాధిద్దాం జాన్వీ’’ అంటూ ఈ సినిమా గురించి పంచుకున్నారు రాజ్‌కుమార్. గతంలో ఈ దర్శకుడు తీసిన ‘గుంజన్ సక్సేనా’లో నటించి ప్రశంసలు అందుకుంది జాన్వీ.
అనుష్క ఎక్స్‌ప్రెస్
Anushka chakdaha express: అనుష్కశర్మ కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’. ప్రముఖ భారతీయ మహిళా క్రికెటర్ జులన్ ఘోస్వామి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రొసిట్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అనుష్క ప్రత్యేకంగా సిద్ధమైంది. ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.