Multi-starrer movies in Tollywood: చిత్రసీమలో తరచూ వినిపించే మాట... ట్రెండ్. పాత్రలు, కథలు, హావభావాలు, డ్యాన్సులు, ఫైట్లు, సాంకేతికత ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి విభాగంపైనా ట్రెండ్ ప్రభావం చూపిస్తుంటుంది. 'బాహుబలి', 'కె.జి.ఎఫ్' సినిమాల తర్వాత అగ్ర తారల చిత్రాలన్నీ పాన్ ఇండియాని లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకొనే ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత మల్టీస్టారర్ సినిమాల జోరు పెరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న సినిమాల సరళి అదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. తారలకి బలమైన అభిమానగణం ఉన్న తెలుగులో మల్టీస్టారర్ సినిమాలంటే ఆ హంగామా మామూలుగా ఉండదు. ఒక టికెట్‌పై రెండు సినిమాలు చూస్తున్న ఉత్సాహం ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది.
'ఇకపై రానున్నవన్నీ మల్టీస్టారర్ సినిమాలే'
'ఆర్‌ఆర్‌ఆర్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల విలేకర్లతో ఎన్టీఆర్ అన్న మాటలివీ. ఆయన రామ్‌చరణ్‌తో కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్' చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకు తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలంటే 'అదొక కలే' అన్నట్టుగా ఉండేవి పరిస్థితులు. ఇద్దరు సమాన స్థాయి హీరోలు కలిసి నటించడానికి చాలా విషయాలు అడ్డుగా నిలిచేవి. అభిమానులు, కథలు, ఇమేజ్, దర్శకులు... ఇలా చాలా విషయాల్ని చూపించేవారు కథా నాయకులు. తొలినాళ్లల్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్, కృష్ణ - కృష్ణంరాజు, చిరంజీవి - కృష్ణంరాజు... ఇలా అగ్ర తారలు కలిసి బోలెడన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాతే హీరోలు కలిసి నటించే సంప్రదాయం అరుదుగా మారిపోయింది. చాలా రోజుల తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గోపాల గోపాల' సినిమాలతో 'ఓ మంచి కథ దొరికితే మనమూ కలిసి నటించొచ్చ'నే ఓ భరోసా నవతరం హీరోల్లో ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్'తో నందమూరి, మెగా హీరోల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి మల్టీస్టారర్ ట్రెండ్‌కి మరోసారి ఊపు తీసుకొచ్చారు రాజమౌళి. అందులో నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఇద్దరూ ఇకపైనా మల్టీస్టారర్ సినిమాలకి రెడీ అంటున్నారు. భాషల మధ్య హద్దులు చెరిగిపోవడంతో కొన్నాళ్లుగా వివిధ భాషలకి చెందిన అగ్ర తారలు సినిమాల కోసం విరివిగా కలిసొస్తున్నారు.
చిరంజీవి కథా నాయకుడిగా తెరకెక్కుతున్న 'గాడ్‌ఫాదర్' సినిమాలో సల్మాన్‌ఖాన్ నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్‌కి చెందిన అగ్ర తార అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రాలైన 'సలార్'లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌కుమార్, 'ఆదిపురుష్'లో బాలీవుడ్‌కి చెందిన సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. 'కె.జి.ఎఫ్2'లో సంజయ్ దత్ నటించిన విషయం తెలిసిందే. 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటించారు. వీటినే క్రాస్ ఓవర్ స్టార్ సినిమాలుగా పరిగణిస్తోంది చిత్రసీమ. వివిధ భాషలకి చెందిన నటులే కాదు.. ఒకే భాషకి చెందిన వారూ కలిసి కెమెరా ముందుకొస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కథల్ని సిద్ధం చేయిస్తున్నారు.