కరోనా సెకండ్‌వేవ్ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో థియేటర్‌లలో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే, అసలైన జోష్ మాత్రం రావడం లేదు. ఇంకా కరోనా భయాలు వీడకపోవడం, నిబంధనల కారణంగా ఏపీలో థియేటర్‌లు పూర్తిగా అందుబాటులో లేకపోవడం దీని కారణం. కొన్ని సినిమాలు ధైర్యంతో థియేటర్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటే, మరికొన్ని ఇప్పటికీ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే, గత నెల రోజులతో పోలిస్తే, ఈ వారం అటు థియేటర్ (New movie release in Theaters), ఇటు ఓటీటీలోనూ (New movie release in OTT) కాస్త సందడి రెట్టింపు కానుంది. మరి వినాయకచవితిని పురస్కరించుకుని ఆ సందడి పంచే కథానాయకులు ఎవరు? ఏయే చిత్రాలు వస్తున్నాయి?
'లాభం'తో మొదలు
విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం 'లాభం'(Vijay Sethupathi Labham). శ్రుతిహాసన్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 9న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ కట్టాలనుకునే వ్యాపారవేత్తగా జగపతిబాబు, అది జరగకుండా రైతుల పక్షాన నిలిచే వ్యక్తిగా విజయ్ సేతుపతి కనిపించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అలరిస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్‌సేతుపతి ‘లాభం’లో ఈసారి ఎలా మెప్పిస్తారో చూడాలి. విజయ్‌సేతుపతి, పి.అరుముగకుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఇమ్రాన్ సంగీతం అందించారు.
థియేటర్‌లో 'కబడ్డీ కూత'.. 'సీటీమార్'తో మోత
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'సీటీమార్'(Seeti Maar movie release date). తమన్నా కథానాయిక. వేసవి కానుకగా రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇందులో గోపీచంద్, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. గోపీచంద్ నుంచి అభిమానులు కోరుకునే మాస్అంశాలతో పాటు, భావోద్వేగాలను కూడా జోడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవంశి, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జయలలిత జీవిత కథ 'తలైవి'
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి' (Thalaivi Trailer). కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి అలరించనున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్‌లో విడుదల కానుంది. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరాలు సమకూర్చారు. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు రచనా సహకారం అందించటం విశేషం. విష్ణు వర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, బృందా ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. జయలలిత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్‌కు ఎలా దగ్గరయ్యారు? తమిళ రాజకీయాల్లో ప్రవేశించి ఏవిధంగా చక్రం తిప్పారన్న విషయాలను ఏఎల్ విజయ్ చూపించనున్నారు.
నిజ జీవిత ఘటనల ఆధారం 'జాతీయ రహదారి'
'1940లో ఒక గ్రామం', 'కమలతో నా ప్రయాణం', 'లజ్జ' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నరసింహ నంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'జాతీయ రహదారి'. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్‌లో విడుదల కానుంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంతో ఈ సినిమా సాగనుంది.
ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలు..
'టక్ జగదీష్'గా అలరించనున్న నాని
నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్, కుటుంబ కథా చిత్రం 'టక్ జగదీష్' (Tak Jagadish movie release date) శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. 'నిన్నుకోరి' తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్య పరిణామాల తర్వాత ఓటీటీ బాటపట్టింది. భూ కక్షలు లేని భూదేవిపురం కోసం 'టక్ జగదీష్' యువకుడు ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్, రోహిణి కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు.
ఆ 'నెట్'లో పడితే ఇక అంతేనా?