తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​ కథలకు బాలీవుడ్​ కథనం - మిథునం బాలీవుడ్​ రీమేక్​ వార్తలు

'బాహుబలి' చిత్రం తర్వాత హిందీ చిత్రసీమ టాలీవుడ్​పై కన్నేసింది. తెలుగులో రూపొందిన హిట్టు సినిమాలను రీమేక్​ చేసేందుకు బాలీవుడ్​ నిర్మాతలు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. బాలీవుడ్​ను ఆకర్షించిన తెలుగు చిత్రాలేవో చూద్దాం.

Upcoming Bollywood films that are a remake of South Indian movies
టాలీవుడ్​ కథలకు బాలీవుడ్​ కథనం

By

Published : Nov 30, 2020, 7:41 AM IST

పెద్ద సినిమా.. చిన్న సినిమా.. అన్న హద్దులెప్పుడో చెరిగిపోయాయి. బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించినదే పెద్ద చిత్రంగా.. ప్రేక్షకుల్ని థియేటర్‌ వైపు లాక్కురాగల సత్తా ఉన్న కథే..నిజమైన హీరోగా నీరాజనాలు అందుకుంటున్న రోజులివి. కథ బాగుంటే చాలు.. అందులో స్టార్‌ హీరో ఉన్నాడా? లేడా? అని పట్టించుకోవట్లేదు ప్రేక్షకులు. ఈ మధ్య తెలుగులో ఇలాంటి కొత్తదనం నిండిన వైవిధ్యభరిత కథలు విరివిగా వస్తున్నాయి. అందుకే బాలీవుడ్‌ ఇటువైపు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతోంది. ఇక్కడ హిట్టు మాట వినపడిందంటే చాలు.. ఆ కథ కోసం ఎన్ని రూ.కోట్లు వెచ్చించడానికైనా వెనకాడటం లేదు. ఫలితంగా తెలుగు నుంచి హిందీకి ఎగుమతవుతున్న సినిమాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

'మంచి కథకు ప్రాంతీయ, భాషా భేదాలు ఎప్పుడూ అడ్డుకాదు'.. ఇది చిత్రసీమలో తరచూ వినిపించే మాట. రీమేక్‌ చిత్రాల విషయంలో ఇది చాలాసార్లు నిజమైంది. అందుకే ఏ భాషలో హిట్టు మాట వినబడినా.. ఆ కథను తమ భాషల్లోకి పట్టుకుపోవడం అన్ని చిత్రసీమల్లోనూ పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో తెలుగులోనే వైవిధ్య కథల జోరు పెరగడం వల్ల మిగతా చిత్రసీమలు ఇటువైపు చూడటం మొదలు పెట్టాయి. ముఖ్యంగా 'బాహుబలి' చిత్రాల తర్వాత నుంచి బాలీవుడ్‌కు తెలుగు చిత్రసీమ సత్తా ఏంటో బాగా తెలిసొచ్చింది. ఈ మధ్య కాలంలో 'అర్జున్‌రెడ్డి', 'టెంపర్‌' లాంటి చిత్రాలు అక్కడ రీమేక్‌లుగా వసూళ్ల వర్షం కురిపించడం వల్ల.. బాలీవుడ్‌ దర్శక నిర్మాతల దృష్టంతా మన పాత తెలుగు చిత్రాలపై పడింది. ఇప్పటికే 'జెర్సీ', 'ఆర్‌ఎక్స్‌ 100', 'భాగమతి' లాంటి చిత్రాలు అక్కడ రీమేక్‌లుగా సెట్స్‌పై ముస్తాబు అవుతుండగా.. కాస్త ఆలస్యమైనా మరికొన్ని పాత హిట్లు బాలీవుడ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడిలాంటి రీమేక్‌ చిత్రాల జాబితాలో ముందు వరుసలో ఉంది 'ఛత్రపతి'. ప్రభాస్‌..రాజమౌళిల కలయికలో రూపొందిన ఈ చిత్రం..తెలుగులో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడీ హిట్‌ రీమేక్‌తోనే బాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతున్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని వి.వి.వినాయక్‌ స్వీకరించారు. ఒకరకంగా ఇది ఆయనకూ తొలి బాలీవుడ్‌ చిత్రమే. దీన్ని పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర కథను బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసే పనిలో ఉంది చిత్ర బృందం. జనవరి నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్​

వినోదాల మత్తు.. థ్రిల్‌ చేసే హిట్టు!

ప్రస్తుతం బాలీవుడ్‌ తెరపై కనువిందు చేయనున్న తెలుగు చిత్రాల జాబితాలో ఆ పాత మధురాలతో పాటు కొన్ని లేటెస్ట్‌ హిట్‌లూ ఉన్నాయి. త్వరలో 'మత్తు వదలరా', 'హిట్‌' చిత్రాలు బాలీవుడ్‌ తెరపై వినోదాలు పంచబోతున్నాయి. తెలుగులో విశ్వక్‌ సేన్‌ నటించిన 'హిట్‌'ను హిందీలో రాజ్‌కుమార్‌ రావ్‌తో పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం. మాతృకను తెరకెక్కించిన శైలేష్‌ కొలనుతోనే ఈ హిందీ రీమేక్‌ను ఓ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థతో కలిసి దిల్‌రాజు నిర్మించనున్నారు. అలాగే కామెడీ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన 'మత్తు వదలరా' చిత్రమూ వచ్చే ఏడాదే పట్టాలెక్కనున్నట్లు సమాచారం. మాతృకను తెరకెక్కించిన రితేష్‌రాణానే ఈ హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.

'ఊసరవెల్లి' సినిమాలో ఎన్టీఆర్

బాలీవుడ్‌ తెరపై 'ఊసరవెల్లి'..

ఎన్టీఆర్‌.. తమన్నా జంటగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఊసరవెల్లి'. ఈ చిత్రం.. తెలుగులో మిశ్రమ ఫలితాన్ని అందుకొంది. ఈ చిత్ర కథలోని వైవిధ్యం నచ్చి దీన్ని హిందీలోకి రీమేక్‌ చేసేందుకు సిద్ధమైంది టిప్స్‌ అనే బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ. హీరోగా అక్షయ్‌ కుమార్‌ నటించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

'రేసుగుర్రం'లో అల్లుఅర్జున్

'రేసుగుర్రం' ఎక్కేదెవరు?

కథానాయకుడు అల్లు అర్జున్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం 'రేసుగుర్రం'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్‌కు వెళ్లబోతుంది. 'ఛత్రపతి'ని హిందీలో నిర్మిస్తున్న పెన్‌ స్టూడియో సంస్థే.. ఈ చిత్రాన్నీ పునర్నిర్మించనున్నట్లు సమాచారం.

'మిథునం'లో బాల సుబ్రహ్మణ్యం, శ్రీలక్మి

బిగ్‌బి.. రేఖలతో 'మిథునం' మ్యాజిక్‌!

శ్రీరమణ కలం నుంచి జాలువారిన అద్భుతమైన కథ 'మిథునం'. దీన్ని తెలుగులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మిలతో సినిమాగా తెరకెక్కించి మెప్పించారు తనికెళ్ల భరణి. ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఓ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ 'మిథునం' రీమేక్‌ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, రేఖలతో కథను తెరకెక్కించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? దీన్ని హిందీలో తెరకెక్కించనున్న దర్శకుడెవరు? అనే విషయాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

ఇదీ చూడండి:బాలీవుడ్​లోకి జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'?

ABOUT THE AUTHOR

...view details