upcoming Big movies released dates: విరామం లేదు.. వాయిదాల మాటే లేదు.. ఇక వారం వారం వినోదాల విందు భోజనమే.. ఈ మండు వేసవిలో చల్ల చల్లని వినోదాలతో సేదతీరడమే.. ఇటు ప్రేక్షకులు.. అటు చిత్ర వర్గాలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసే వేసవి సినీ మారథాన్ ఈసారి కాస్త ముందుగానే షురూ అయింది. కరోనా పరిస్థితుల వల్ల గడిచిన రెండేళ్లు సినీ క్యాలెండర్‌లో వేసవి వినోదాల సందడి కనిపించలేదు. ఈసారి వేసవికి కరోనా ముప్పు పూర్తిగా తప్పింది. దీంతో రెండేళ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న బడా చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫలితంగా ఈసారి కాస్త ముందుగానే సమ్మర్ వినోదాల సందడి మొదలైంది.
ఈ వారం బాక్సాఫీస్ ముందుకు వరుస కడుతున్న సినిమాల్లో పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’తో పాటు అలియా భట్ ‘గంగూభాయి కాఠియావాడీ’, అజిత్ ‘వలిమై’ వంటి పాన్ ఇండియా చిత్రాలున్నాయి. వీటిలో పవన్, అలియాల సినిమాలు శుక్రవారం విడుదల కానుండగా.. అజిత్ చిత్రం గురువారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూడు చిత్రాలపైనా ఇటు సినీప్రియుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి, మలి కరోనా ఉద్ధృతుల తర్వాత తెలుగు చిత్రసీమలో సినిమాల సందడి బాగానే కనిపించింది. ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీల్లో అంతగా జోష్ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ఈ అగ్రతారల సినిమాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ముఖ్యంగా ‘గంగూబాయ్’, ‘వలిమై’ వంటి చిత్రాలు మిగతా అన్ని భాషల్లోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన దక్కుతుందోనని చిత్ర వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. వీటికి మంచి స్పందన దక్కి, ప్రేక్షకులు మునుపటిలా వరుస కడితే.. రాబోయే అగ్రతారల చిత్రాలకు గొప్ప భరోసా దొరికినట్లవుతుంది.
మార్చి ఊరిస్తోంది..
RRR, Radheshyam release dates: ఈ వేసవి సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నెల మార్చి. సినీప్రియుల్ని ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మార్చి 4న శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ చిత్రాలు బాక్సాఫీస్ ముందు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఆ మరుసటి వారం ఒక్కరోజు వ్యవధిలోనే సూర్య ‘ఈటీ’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. వీటిలో ముందుగా తెరపై మెరిసేది సూర్య సినిమానే. ఇది మార్చి 10న విడుదల కానుంది. ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి విజయాల తర్వాత సూర్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే విభిన్నమైన ప్రేమకథతో రూపొందించారు. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్చి 25న థియేటర్లలో సందడి చేయనుంది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఇందులో అల్లూరి పాత్రను చరణ్ పోషించగా.. భీమ్ పాత్రలో తారక్ నటించారు. దాదాపు రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ అంచనాలు నెలకొని ఉన్నాయి.