కరోనా సంక్షోభంతో నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఉపాసన, రామ్‌చరణ్ కలిసి ఆన్‌లైన్ డ్యాన్స్ షోను ఆరంభించబోతున్నారు. దివ్యాంగులు తమ జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించి.. వారి కలలను ఎలా సాకారం చేసుకుని, విజయం సాధించారో చూపించబోతున్నారు.
దివ్యాంగుల కోసం మెగా దంపతుల డాన్స్‌షో
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, అతని భార్య ఉపాసన కలిగి దివ్యాంగుల కోసం ఓ ఆన్‌లైన్ డాన్స్‌షో ప్రారంభిస్తున్నారు. దీనికోసం ఆన్‌లైన్ తమ వివరాలను నమోదు చేయాల్సిఉంటుందని వారు తెలిపారు. చెర్రీతో పాటు ఈ షోలో ప్రభుదేవా, ఫరా ఖాన్లు భాగం కానున్నారు.
దివ్యాంగుల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు అడుగులు వేయాలని ఉపాసన కోరారు. తపస్ అనే కుర్రాడు పుట్టుక నుంచి అనారోగ్యంతో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడో ఉపాసన వివరించారు. పట్టుదలతో డ్యాన్సర్‌గా, గాయకుడిగా అనేక బహుమతులు గెలుచుకున్నట్లు చెప్పారు. రామ్ చరణ్‌తోపాటు ప్రభుదేవా, ఫరా ఖాన్‌లూ ఈ షోలో భాగస్వామ్యం కాబోతున్నారు. డ్యాన్స్ కేవలం ప్యాషన్ కాదని.. ఎమోషన్ అని ఫరా అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నా హృదయానికి ఎంతో చేరువైన విషయం డ్యాన్స్. చిన్నప్పటి నుంచి మ్యూజిక్, డ్యాన్స్ నన్ను ఎంతో మందికి చేరువ చేసింది. ఇప్పుడు ఎంతో ప్రత్యేకమైన డ్యాన్స్ టాలెంట్ షో గురించి ప్రకటిస్తున్నా. దివ్యాంగులు ఈ ఆన్‌లైన్ షోలో పాల్గొనాలని కోరుతున్నాం. ఇందు కోసం urlife.co.inలో మీ పేర్లు (దివ్యాంగులు మాత్రమే) నమోదు చేసుకోండి. ఈ మధ్య నేను కొన్ని అద్భుతమైన డ్యాన్స్ వీడియోలు చూశా. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఆ డ్యాన్స్ వీడియోలు చూసి స్ఫూర్తి పొందా. చిన్న చిన్న సవాళ్లను ఎలా అధిగమించాలనేది దివ్యాంగుల్ని చూసి నేర్చుకున్నా. మీ అందరూ కూడా వారికి మద్దతు ఇవ్వండి. వారి నుంచి ప్రేరణ పొందండి' అని అన్నారు.