నందమూరి బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్'. 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ షో 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో 'ఆహా మోస్ట్ వాచ్డ్ షో'గా గుర్తింపు తెచ్చుకుంది. 'అన్‌స్టాపబుల్' అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందడంపై ఆ షో దర్శకుడు బీవీఎస్ రవి ఆనందం వ్యక్తం చేశారు. ఓ ఛానల్‌కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షో కోసం మొదటిసారి బాలకృష్ణను డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 'అన్‌స్టాపబుల్' సక్సెస్‌కు ముఖ్య కారణం బాలయ్యే అని అన్నారు.
'అన్‌స్టాపబుల్'లో బాలకృష్ణ-చిరంజీవి ఎపిసోడ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నకు .. "అక్టోబర్ 27న ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేశాం. నవంబర్ 3న బాలకృష్ణ భుజానికి చిన్న సర్జరీ జరిగింది. కొన్ని వారాలు షూట్ చేయలేదు. అదే సమయంలో చిరంజీవి మూడు సినిమాల చిత్రీకరణలు మొదలయ్యాయి. దీంతో చిరు బిజీ అయిపోయారు. డేట్స్ దొరకలేదు. ఈ కారణంగానే బాలయ్య-చిరంజీవి ఎపిసోడ్ షూట్ చేయడం కుదరలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఈ షో మరో లెవల్లో ఉండేది. తదుపరి సీజన్లో అయినా వీరిద్దరి ఎపిసోడ్ ఉంటుందేమో చూడాలి. సీజన్-2 ఎప్పుడు ప్రారంభమవుతుందో నాకు పూర్తిగా తెలీదు" అని రవి చెప్పారు.