ఏడు నెలలుగా సినీ వినోదానికి దూరమైన ప్రేక్షకులకు తియ్యటి కబురు. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి భారతీయ తెరపై బొమ్మ పడుతోంది. నేడే చూడండి... మీ అభిమాన థియేటర్లో... అంటూ ఇక నుంచి పోస్టర్లు ఊరించనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 15 నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో థియేటర్లు తెరుచుకోవచ్చని ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. దాదాపు 15 రాష్ట్రాలు అనుమతులిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, తెలంగాణ ఇవ్వలేదు. ఏపీ సినీ ప్రదర్శనకారుల సంఘం మాత్రం గురువారం నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించింది. లాక్‌డౌన్ కాలానికి థియేటర్ల విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
మల్టీప్లెక్స్‌లు సిద్ధం
దేశవ్యాప్తంగా 3100 మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. వీటి యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే థియేటర్లను ముస్తాబు చేశాయి. ఒక సీట్ వదిలి మరో సీట్‌లో ప్రేక్షకుడు కూర్చుని సినిమా ఆస్వాదించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. 22 రాష్ట్రాల్లో 875 థియేటర్లను నిర్వహిస్తున్న పీవీఆర్ సంస్థ దాదాపు 14 రాష్ట్రాల్లో 500 థియేటర్లలో గురువారం నుంచి సినిమాల్ని ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ సంస్థకు అధికంగా స్క్రీన్‌లు ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాలేదు. సినీ పొలిస్ నిర్వహిస్తున్న 350 స్క్రీన్లలో 75 శాతం స్క్రీన్‌లపై ప్రదర్శనలు మొదలయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఐనాక్స్, సినీ ప్లెక్స్, కార్నివాల్ తోపాటు ఇతర మల్టీప్లెక్స్ సంస్థలూ తమ థియేటర్లను సిద్ధం చేశాయి.
తెలుగు రాష్ట్రాల మాటేమిటి?