Puneeth Rajkumar News: ఆరు నెలల వయసులోనే సినీ అరంగేట్రం!
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. 46 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి అభిమానులకు తీవ్ర వేధన మిగిల్చారు. అటు సినీ ప్రముఖుల నుంచి ఇటు అభిమానుల వరకు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
పునీత్ రాజ్‌కుమార్
ప్రముఖ కన్నడ హీరో, పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్ ప్రాణాలు దక్కలేదు. పునీత్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- 2002లో 'అప్పు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పునీత్. అప్పటి నుంచి ఈ కథానాయకుడిని ఫ్యాన్స్ 'అప్పు' అని పిలవడం ప్రారంభించారు.
- దిగ్గజ నటుడు, కన్నడ కంఠీవ రాజ్‌కుమార్-పార్వతమ్మల మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. చెన్నైలో జన్మించిన పునీత్ చిన్నప్పటి పేరు లోహిత్.
- ఆరు నెలల వయసులో ఉన్నప్పుడే సినిమాల్లో కనిపించారు రాజ్‌కుమార్. 1976లో విడుదలైన ఆయన తండ్రి రాజ్‌కుమార్ నటించిన 'ప్రేమద కనికే' సినిమాలో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
- 1976లో బాలనటుడిగా పరిచయమైన పునీత్.. 'బెట్టడ హూవు'(1985) సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. చలిసువ మొదగలు', 'యారడు నక్షత్రగళు' చిత్రాలతో బాలనటుడిగా పునీత్.. కర్ణాటక రాష్ట్ర అవార్డునూ అందుకున్నారు. మొత్తంగా బాలనటుడిగా 13 సినిమాలు చేశారు.
- తన తండ్రి లాగే పునీత్ కూడా మంచి సింగర్ అన్న విషయం విదితమే. పునీత్ మొదటిసారి ఆరేళ్ల వయసులోనే 'బానా దారియల్లి సూర్య' అనే పాట పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు టీజీ లింగప్ప ఈ సాంగ్‌కు స్వరకల్పన చేశారు.
- అభి, వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, హుదుగురు, అంజనీపుత్ర తదితర సినిమాలతో హిట్లు కొట్టి అభిమానుల మనసుల్లో పునీత్ రాజ్‌కుమార్ చెరిగిపోని స్థానం సంపాదించారు.
- ఇప్పటివరకు పునీత్ రాజ్‌కుమార్ 32 కన్నడ సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన 'యువరత్న' సినిమాలో చివరగా కనిపించారు. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై ఆదరణ దక్కించుకుంది.
- ప్రస్తుతం పునీత్ నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
- అశ్విని రేవంత్‌ని 1999 డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు పునీత్. వీరికి ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు.
ఇవీ చూడండి: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం
Last Updated : Oct 29, 2021, 4:48 PM IST