మనమంతా హడావిడి జీవితానికి అలవాటు పడిపోయాం. బతుకు పోరులో తరుముకొచ్చే సమస్యలన్నీ మనల్ని చిన్ అప్, షోల్డర్ డౌన్, ఐస్ ఓపెన్ అంటూ ఆడేసుకుంటున్నాయి. కష్టాలకు మనం కుంగిపోతుంటే స్మైల్ ప్లీజ్ అంటూ జనాలు పలికే ఓదార్పు మాటలైతే షరామాములే. అసలు ఈ పరుగెందుకోసమంటే.. ఏమో మనకి కూడా తెలియదు.
ఒక్కోసారి అవసరమైన దానికంటే వేగంగా పరిగెత్తేస్తున్నామా అనే సందేహం మనసుని తొలిచేస్తుంటుంది. పోనీ ఓసారి ఆగి వెనక్కి చూద్దామా అంటే .. పోటీ ప్రపంచంలో వెనుక పడిపోతామేమో అనే భయం ఒకటి. సరిగ్గా అలాంటి సమయంలోనే మనం చూసే కొన్ని సంఘటనలు, విషయాలు, మనం కోల్పోతున్న ఆ నిజమైన మనల్ని.. మళ్లీ మనకు పరిచయం చేస్తాయి. వాస్తవికతలోని అందాన్ని.. ప్రకృతి అంత అందంగా చూపెడతాయి.
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. అనవసర ఆర్భాటాలు లేని ఓ మాములు సినిమా. నీ సినిమా, నా సినిమా, మనందరి సినిమా. నిజజీవితాల్లోని వాస్తవికతలను దాటుకొని కల్పనా ప్రపంచంలో సినిమాలన్నీ అతీత శక్తులతో ప్రవర్తిస్తుంటే నేలమీద పారగాన్ చెప్పులతో నడిచిన సినిమా.
తమదేదో తమదంటూ మితిమీరి తగదంటూ.. తమదైన తృణమైనా చాలనే మనసులు.. వాటి తాలుకూ మనుషులు.. ఉన్న చిత్రమిది. చిత్రంగా కలివిడి సూత్రంగా కలబడి ప్రేమ, పంతం తమ సిరిగా బతుకుతున్న వ్యక్తుల కథ ఇది. ఉచిత సలహాలు పగలేని కలహాలు ఎనలేని కథనాలున్న చోటును చూపించే పరిచయమిది. సిసలైన సరదాలతో, పడిలేచే పయనాల్లో, తిమిరాలు తరిమేసే ఓ ఉమామహేశ్వరుడి కథ ఇది.