తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: ఉమామహేశ్వరుడు ఉగ్రరూపం చూపించాడా?

టాలీవుడ్​ విలక్షణ నటుడు సత్యదేవ్​ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' గురువారం (జులై 30)న ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Uma Maheswara Ugra Roopasya Telugu Movie Review
రివ్యూ: ఉమామహేశ్వరుడు ఉగ్రరూపం చూపినది ఎవరిమీద?

By

Published : Jul 30, 2020, 8:14 PM IST

Updated : Jul 30, 2020, 8:37 PM IST

చిత్రం:ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

నటీనటులు: సత్యదేవ్‌, హరిచందన, నరేశ్‌, సుహాస్‌, రూప, కుశాలిని, రవీంద్ర విజయ్‌, టీఎన్‌ఆర్‌ తదితరులు

సంగీతం: బిజిబల్‌

సినిమాటోగ్రఫీ:అప్పు ప్రభాకర్‌

ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల

నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయప్రవీణ పరుచూరి

దర్శకత్వం: వెంకటేశ్‌ మహా

బ్యానర్‌: ఆర్కా మీడియా, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌

విడుదల:30-07-2020 (నెట్‌ఫ్లిక్స్‌)

ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో సత్యదేవ్​, హరిచందన

లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లలో విడుదల చేయలేకపోయిన ఒక్కో సినిమా ఓటీటీ బాట పడుతోంది. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా? అని కళ్లు కాయలుకాచేలా చూసీ చూసీ నిర్మాతలు ఓటీటీనే సరైన వేదిక అనుకొని అటువైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' అదే బాటలో పయనించింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'మహేశ్‌ ఇంటే ప్రతికారం' చిత్రాన్ని తెలుగులోకి 'ఉమామహేశ్వర..'గా రీమేక్‌ చేశారు. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న నటుడు సత్యదేవ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. 'కేరాఫ్‌ కంచరపాలెం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం వల్ల సినిమాపై ఆసక్తి నెలకొంది? మరి ఉమామహేశ్వరరావు ఎవరిపై, ఎందుకు ఉగ్రరూపం దాల్చాడు.. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సెన్సార్​ సర్టిఫికేట్​

కథేంటంటే:ఉమామహేశ్వరరావు (సత్యదేవ్‌) అరకులో ఫొటోగ్రాఫర్‌. చావులు, పెళ్లిళ్లకు ఫొటోలు తీస్తుంటాడు. ఆ ఊళ్లో అతనొక్కడే ఫొటోగ్రాఫర్‌ కావడం వల్ల ఏ కార్యక్రమానికైనా అతనినే పిలుస్తారు. ఉమామహేశ్వరరావుకి చిన్నప్పటి నుంచి గొడవలంటే భయం. ఎక్కడైనా, ఎవరైనా గొడవపడుతుంటే ఆమడదూరం పారిపోతాడు. చిన్నతనంలో స్కూళ్లో కలసి చదువుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకరోజు అనుకోకుండా రోడ్డు మీద జరుగుతున్న గొడవను ఆపడానికి వెళ్లి.. దెబ్బలు తింటాడు. అందరి ముందు తన్నులు తినడం వల్ల పరువు పోయిందని భావిస్తాడు. తనని కొట్టినవాడిని తిరిగి కొట్టిన తర్వాతే మళ్లీ చెప్పులు వేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయికి అమెరికా సంబంధం రావడం వల్ల ఇద్దరూ విడిపోతారు. మరి తనని కొట్టిన వాడిపై మహేశ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అందుకు ఏం చేశాడు? తిరిగి చెప్పులు వేసుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: మలయాళ చిత్రాలంటే సహజత్వానికి పెట్టింది పేరు. అలాంటి చిత్రానికి 'కేరాఫ్‌ కంచరపాలెం' వంటి అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌ మహాను ఎంచుకోవడంతోనే చిత్ర బృందం సగం విజయం సాధించింది. మలయాళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్ర సహజంగా ఉంది తప్ప ఎక్కడా ఇరికించిన భావన కలగదు. అరకు ప్రాంతాన్ని నేపథ్యంగా చేసుకోవడం వల్ల ప్రకృతి అందాలు సినిమాకు బాగా ప్లస్‌ అయ్యాయి.

ఫొటోగ్రాఫర్‌గా మహేశ్‌ పరిచయ సన్నివేశాలు, స్వాతితో ప్రేమ సన్నివేశాలతో ప్రథమార్ధం సరదాగా సాగిపోతుంది. మధ్యలో సుహాస్‌- నరేశ్‌ కామెడీ, పొలం విషయంలో ఇద్దరి మధ్య జరిగే గొడవ తదితర సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా దర్శకుడు ప్రాంతీయతకు పెద్దపీట వేశాడు. అరకు, ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు జీవన విధానం, ఆహారపు అలవాట్లను చక్కగా చూపించాడు. అగ్ర కథానాయకుల విషయంలో ఫ్యాన్స్‌ ఏవిధంగా మాట్లాడుకుంటారన్న విషయాన్ని వినోదభరితంగా చూపించాడు. అయితే, కథాగమనం కాస్త నెమ్మదిగా ఉంటుంది. మహేశ్‌ తన్నులు తినడం, తనని కొట్టినవాడిని తిరిగి తన్నే వరకూ చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో సత్యదేవ్​

మహేశ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఈ సమయంలో ఊహించని ట్విస్ట్‌ ఇస్తాడు దర్శకుడు. దీంతో కథ వేరే వైపునకు మళ్లుతుంది. అప్పటివరకూ సరిగ్గా ఫొటోలు తీయడం రాని మహేశ్‌ ఒక అమ్మాయి అన్న మాటను సీరియస్‌గా తీసుకుని ఫొటోగ్రఫీపై దృష్టి పెట్టడం వల్ల అసలు పాయింట్‌ పక్కకు వెళ్లిపోయిందేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయిని ప్రేమించడం, వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్త విసుగు తెప్పిస్తాయి. చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా, సహజత్వం కోసం వాటిని వదిలేశారేమో అనిపిస్తుంది. అసలు మహేశ్‌ ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుంటాడా అని ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తాడు. అయితే, అన్ని సినిమాల్లో మాదిరిగానే ప్రతీకారం తీర్చుకోవడం వల్ల కథ సుఖాంతమవుతుంది. అది ఎలా అన్నది మాత్రం స్క్రీన్‌పై చూడాల్సిందే!

ఎవరెలా చేశారంటే:మలయాళ చిత్రం రీమేక్‌ అనగానే ఈ కథలో ఎవరు నటిస్తారన్న ఆసక్తి నెలకొంది. విలక్షణ నటుడిగా సత్యదేవ్‌కు మంచి పేరుంది. ఆయన గత చిత్రాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఉమామహేశ్వరరావు పాత్రకు సత్యదేవ్‌ వంద శాతం న్యాయం చేశాడు. మంచివాడిగా, గొడవలంటే భయపడే వ్యక్తిగా చక్కని నటన కనబరిచాడు. నరేశ్‌, సుహాస్‌ మినహా మిగిలిన వారందరూ కొత్తవారే. వారందరూ తమ పరిధిమేరకు ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. కనపడేది కొద్దిసేపే అయినా సహజంగా నటించారు. బిజిబల్‌ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ నేపథ్యంలోనే సాగిపోతాయి. అప్పు ప్రభాకర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ కొత్తగా ఉంది. రవితేజ గిరిజాల తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.

దర్శకుడు వెంకటేశ్‌ మహా మలయాళ చిత్రాన్ని తెలుగు నేటివిటికీ అనుగుణంగా మార్చడంలో విజయం సాధించారు. సంభాషణలు అలరిస్తాయి. 'ఆలోచనలు, జ్ఞాపకాలు.. ప్రపంచంలో అన్నింటికంటే బరువైనవంట', 'వెళ్లిపోవాలనుకున్న వారిని వెళ్లిపోనివ్వకపోతే... ఉన్నా వెలితిగానే ఉంటుంది', 'కళ అనేది పాఠాలు వింటే రాదు. పరితపిస్తే వస్తుంది', 'నవరసాలు అంటే మన ముఖంలో కండరాల కదలిక కాదు. మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ' వంటి సంభాషణలు హృద్యంగా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే, సినిమా కథ, నేపథ్యం తీసుకుంటే నిడివి ఎక్కువైందేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

బలాలు బలహీనతలు
+ సత్యదేవ్‌ - నెమ్మదిగా సాగే కథనం
+ దర్శకత్వం - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
+ పాత్రలను తీర్చిదిద్దిన విధానం

చివరిగా:'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' రొటీన్‌ చిత్రమైతే కాదు! మాతృక చూడకపోయి ఉంటే మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Last Updated : Jul 30, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details