కరోనా పరిస్థితుల వల్లే 'టక్ జగదీష్' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత సాహు గారపాటి తెలిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. తమన్ సంగీతమందించారు.
భావోద్వేగాలకు పెద్ద పీట
"మజిలీ' తర్వాత ఈ సినిమా మొదలు పెట్టాం. అందులో భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ తీశాం. అలాంటి ఎమోషన్స్ కూడిన కథతో మరో సినిమా చేద్దామని శివ నిర్వాణను అడిగితే 'టక్ జగదీష్' కథ చెప్పారు. ఈ కథను నానికి చెప్పడం వల్ల ఆయనకు నచ్చి వెంటనే ఒప్పుకొన్నారు. ఇప్పటివరకు ఆయన పోషించని పాత్ర ఇది. ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా 'టక్ జగదీష్' ఉంటుంది. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. ద్వితీయార్ధం మొత్తం భావోద్వేగాలతో నడుస్తుంది".
మా ప్రాధాన్యం థియేటర్లే
"ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాం. కరోనాతో మా ఆశలు అడియాసలు అయ్యాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలు అందరిలోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలు చూడడానికి వేరే కొత్త మీడియమ్స్ వచ్చాయి. థియేటర్లు కూడా ఉంటాయి. మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లే. మా సమస్యలు మాకు ఉన్నాయి.. ఇండస్ట్రీ నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చింది. గిల్డ్ నుంచి కూడా మద్దతు లభించింది. అందుకే మేం ఎక్కువగా మాట్లాడలేదు. హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండగ నాడు చూపించాల్సిన సినిమా."