థియేటర్లు తాత్కాలికంగా మూతబడటం వల్ల 'టక్ జగదీష్' చిత్రం డిజిటల్ మాధ్యమంలో విడుదలవుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకుందని నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రూమర్లపై స్పందించింది చిత్రబృందం.
"టక్ జగదీష్' చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుంది. అనధికారిక వార్తల్ని నమ్మకండి" అని స్పష్టత ఇచ్చింది. అయితే లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలవ్వనున్న తొలి తెలుగు చిత్రమిదేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
నాని కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నాయికలు. జగపతి బాబు కీలకపాత్ర పోషించారు. యాక్షన్‌తో కూడిన మంచి కుటుంబ కథా చిత్రంగా రూపొందింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
'నిన్ను కోరి' సినిమా తర్వాత శివ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడం వల్ల అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది.
ఇదీ చూడండి:మన సినిమాలు ఓటీటీ వైపు చూడట్లేదు!