సూపర్‌స్టార్ మహేష్‌బాబు, త్రివిక్రమ్ కలయికలో రానున్న హ్యాట్రిక్ చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ఈనెల 31న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం కోసం ఇతర తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్రబృందం. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఓ బలమైన మహిళ పాత్ర కనిపిస్తుంటోంది. ఇందుకోసం ఆయన సీనియర్ నటీమణులను వెతికి పట్టుకొస్తుంటారు.
మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో శిల్పా శెట్టి! - మహేష్ బాబు చిత్రంలో సుశాంత్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో కీలకపాత్రల కోసం శిల్పాశెట్టి, సుశాంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
గతేడాది ఆయన నుంచి వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో నటి టబుతో ఈ తరహా పాత్రనే చేయించారు. ఇప్పుడు మహేష్ చిత్రంలోనూ ఓ బలమైన మహిళ పాత్ర ఉందట. ఇప్పటికే ఈ పాత్ర కోసం పలువురు సీనియర్ భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడా పాత్ర కోసం బాలీవుడ్ భామ శిల్పాశెట్టిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం అందుతోంది.
అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఓ యువ కథా నాయకుడిని తీసుకునే అవకాశముందని, ఇప్పుడా పాత్ర కోసం అక్కినేని సుశాంత్‌ను సంప్రదించారని ప్రచారం సాగుతోంది. త్వరలో దీనిపై ఓ స్పష్టత రానుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ఫైనల్ అయిందని సమాచారం.