మాటల రచయితలు దర్శకులుగా మారటం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే జాబితాకి చెందిన వ్యక్తి అయినా తనకో ప్రత్యేకత ఉంది. దర్శకుడిగా మారిన రచయితలు దర్శకత్వంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. త్రివిక్రమ్ అందుకు భిన్నంగా మాటలతోనే తన దర్శకత్వ ప్రతిభ చూపిస్తుంటాడు. ఈయన మాటలు అందించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టాయి.
సినిమా పరాజయం పాలైనా త్రివిక్రమ్ పంచ్ డైలాగులు చిరస్థాయిగా నిలుస్తాయి. 'స్వయంవరం' చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి 'నువ్వేకావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'చిరునవ్వుతో', 'వాసు', 'మల్లీశ్వరి', 'జై చిరంజీవ'.. సినిమాలకు మాటలు రాసి ప్రేక్షకులతో 'మాటల మాంత్రికుడు' అనిపించుకున్నాడు.
ఆ తర్వాత 'నువ్వే నువ్వే' చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆయన చిత్రాలు ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపుతాయో.. సినిమా టైటిల్సూ అంతే ఆసక్తి పెంచుతాయి. తాజాగా అల్లు అర్జున్‌తో తీస్తోన్న చిత్ర టైటిల్ విషయంలో ఇదే జరిగింది. ఊహకు అందని పేరు పెట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు త్రివిక్రమ్.
అదే 'అల.. వైకుంఠపురములో'.. ఈ టైటిల్ 'అ'తో మొదలవుతుండటం త్రివిక్రమ్‌కి 'అ' సెంటిమెంట్ ఉందా? అనే సందేహం సగటు సినీ అభిమానికి రావడం సహజం. ఎందుకంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు 10. వీటిలో 5 .. 'అతడు', 'అత్తారింటికి దారేది', 'అఆ', 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత వీర రాఘవ'.. చిత్రాల టైటిల్స్ 'అ'తోనే ప్రారంభమవుతాయి. తాజాగా 'అల వైకుంఠపురములో' అదే రిపీట్ అయింది. వీటిలో ఒక్క సినిమా మినహా అన్నీ ఘన విజయం సాధించినవే.
ఇవీ చూడండి.. అనుష్కను కలిసి రెండేళ్లయింది: ప్రభాస్