తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నన్ను కదిలించకపోతే ఎవరితోనూ కలిసి పనిచేయను'

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా మ్యూజికల్ నైట్ సోమవారం జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన త్రివిక్రమ్ తనదైన శైలి పంచ్​లతో ఆకట్టుకున్నాడు.

trivikram
trivikram

By

Published : Jan 7, 2020, 8:22 AM IST

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవనుంది. ఈ సందర్భంగా మ్యూజికల్ నైట్​ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తనదైన శైలి డైలాగ్​లతో ఆకట్టుకున్నాడు.

"30ఏళ్ల యువకుడు.. 60ఏళ్ల పెద్దాయన.. కూనిరాగం తీసుకుంటూ రాసిన ఒక పాట ఇన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే 'సామజవరగమన'. తన వయసు నుంచి దిగి ఆయన(సీతారామశాస్త్రి), తన స్థాయి నుంచి ఎక్కి తమన్‌ ఇద్దరూ కలిసి ఈ చిత్రానికి ఒక స్థాయిని తీసుకొచ్చారు. ఇది వినాలనిపించే సాయంత్రం.. అనాలనిపించే సాయంత్రం కాదు.. ఒక ఒంటరి సాయంత్రం కారులో వెళ్తున్న కుర్రాడు తన ప్రేయసిని గుర్తు చేసుకుంటూ వినడానికి, ఎక్కడో విదేశంలో ఉన్న ఒక అబ్బాయి, తన గర్ల్‌ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుంటూ వినడానికి, ఒక ఆడపిల్ల ఎక్కడో తన కోసం దొంగతనంగా సైట్‌ కొట్టుకుంటూ వెళ్లే అబ్బాయిని గుర్తు చేసుకుంటూ వినడానికి.. ఒక జ్ఞాపకాన్ని ఈ ఇద్దరూ కలిసి ఇచ్చారు. వీరందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. దానికి గొంతునిచ్చి సిద్ శ్రీరామ్‌ మన జీవితాల్లోకి తీసుకొచ్చాడు. ఒక పాట మనకు జ్ఞానం బోధిస్తుంది. అలాంటి అందమైన పాటల్ని గౌరవించాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే దీనికి మ్యూజికల్‌ నైట్‌ అని పెట్టాం. ఈ సంస్కారవంతమైన కోరికను బయటకు తీసుకొచ్చిన వ్యక్తి అల్లు అర్జున్‌."

'జులాయి' సమయానికి పెళ్లి కాని అల్లు అర్జున్‌గా తెలిసిన నాకు ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రిగా జీవితంలో, పనిలో మెచ్యురిటీ సాధించాడు. ఈ సినిమా ట్రైలర్‌ కోసం రాత్రి 2గంటల వరకూ అందరం కష్టపడ్డాం. ఈ సినిమాలో పాటలు పాడిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు. సంగీతం అంటే మనసుకు దురద పెట్టినప్పుడు గోక్కునే దువ్వెనలాంటిది. నేను ఒక్క పదం ఇచ్చినందుకే సీతారామశాస్త్రిగారు పొగిడారు. కానీ, ఆయన మన జీవితాల్లో ఎన్నో ఇచ్చారు. మీరు చెప్పిన మాట మాకు ఒక ఆశీర్వాదం. వేటూరి గారు, సీతారామశాస్త్రిగారు సినిమా పాటకు స్థాయిని తెచ్చిన వ్యక్తులు. అందుకు ఎన్నో పోరాటాలు, యుద్ధాలు చేశారు. మనిషిగా నన్ను కదిలించకపోతే ఎవరితోనూ కలిసి పనిచేయను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తున్నా. ఈ సినిమాకు మొదలు చివర అన్నీ అల్లు అర్జునే. ఎందుకంటే ఈ కథ చెప్పినప్పుడు "ఆనందంగా ఉంది సర్‌.. తప్పకుండా చేద్దాం సర్‌" అన్నారు. ఇప్పటికీ ఆ ఆనందం కొనసాగుతూనే ఉంది. లిరికల్‌ వీడియో కాకుండా, పాట కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ కనిపించాలన్న ఐడియా అల్లు అర్జున్‌దే. జనవరి 12న అందరం కలుద్దాం. ఆనందంగా పండగ చేసుకుందాం" అని తివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు.

ఇవీ చూడండి.. 'అభిమానులు గర్వపడేలా ముందుకు సాగుతా'

ABOUT THE AUTHOR

...view details