తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోల్డెన్​ ప్రిన్సెస్​ ఆఫ్​ సౌతిండియన్​ సినిమా - దక్షిణాధి నాయిక త్రిష

వెండితెరతో 1999లో 'జోడీ' కట్టి ...‘వర్షం’తో తెలుగు ప్రేక్షకులను తడిసి ముద్దయ్యేలా చేసింది. ‘నువ్వొస్తానంటే నే వద్దంటానా’ అంటూ చిలిపిదనంతో అశేష ప్రేక్షకులకు మురిపించింది త్రిష. నేడు 36వ పడిలోకి అడుగుపెట్టింది.

సినీ ప్రేమికుల సౌందర్య దేవత త్రిష పుట్టినరోజు

By

Published : May 4, 2019, 8:58 AM IST

Updated : May 4, 2019, 9:21 AM IST

త్రిష​​... తెరపై కనిపిస్తే చాలు వీక్షకులకు ఓ నిషా. ఆమె నటన అల్లరి తమాషా. అందుకే తెలుగు తెరను రెండు దశాబ్దాలు ఏలింది. ఇప్పటికీ తన నటనకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా '96', పేట చిత్రాలతో తన అభినయంతో సత్తా చాటింది.

చీరకట్టులో త్రిష

సౌతిండియా క్వీన్​:

మొదట మోడలింగ్‌ మెట్లెక్కిన త్రిష తర్వాత సినీ సౌధంపై రాణిగా విరాజిల్లింది. అందాల పోటీల్లో పాల్గొన్న ఆమెను... 1999లో మిస్‌ సేలం, మిస్‌ మద్రాస్‌ అవార్డులు వరించాయి. 1999లోనే త్రిష వెండితెరంగేట్రం చేసింది. ‘జోడి’ సినిమాలో నాయిక సిమ్రాన్‌ స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించిన త్రిష... తక్కువ కాలంలోనే అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంది.

1999లోనే వెండితెరపై కనిపించినా 2002 వరకు సరైన హిట్​ రాలేదు. 2002లో ‘మౌనం పసియాదే’ తమిళ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన త్రిష... ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష చిత్రాల్లో నటించి బహుభాషా కళాకారిణిగా పేరు తెచ్చుకుంది.

10 ఇయర్స్​ ఛాలెంజ్​లో త్రిష

చెన్నై చందమామ...

సినిమా ప్రపంచంలోకి రాకముందు క్రిమినల్‌ సైకాలజిస్ట్‌గా మారాలని త్రిష ఆశ పడింది. అయితే కెమెరా విపరీతంగా ఆకర్షించగా ఆమె గమ్యం మారింది. ఆర్టిస్ట్‌గా యావత్​ భారతావనికి తెలిసింది.

త్రిష పుట్టి పెరగడం అంతా చెన్నై లోనే. 1983, మే 4న ఉమ, క్రిష్ణన్‌ దంపతులకు జన్మించింది. చెన్నై చర్చ్‌ పార్క్‌లోని 'సేక్రెడ్‌ హార్ట్‌ మెట్రికులేషన్‌' స్కూల్‌లో చదువుకున్న త్రిష... యతిరాజ్‌ మహిళా కళాశాలలో 'బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌' చేసింది.

మోడల్​గా వ్యాపార ప్రకటనల్లో సందడి చేసింది. ఫల్గుణి పాఠక్‌ మ్యూజిక్‌ వీడియోలో కనిపించింది. 1999 నుంచి 2003 వరకూ త్రిష సినీ కెరీర్‌ పుంజుకునేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. ప్రియదర్శన్‌ దర్శకత్వంలోని ‘లిసా లిసా’ చిత్రంలో అవకాశం రావడం ఆమె కెరీర్‌ ఊపందుకుంది.

2003లో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత సంచలనం ‘ఎనక్కు 20 ఉనక్కు 18’ చిత్రంలోనే త్రిష అవకాశం దక్కించుకుంది. ఈ రెండు ప్రాజెక్టులూ విడుదలలో ఆలస్యం కారణంగా ‘మౌనం పసియాదే’తో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో సూర్య సరసన నటించింది. ‘మనసెల్లామ్‌’లో కాన్సర్‌ పేషేంట్‌గా నటించి విమర్శకుల అభినందనలు సైతం పొందింది. ‘సామి’, ‘లిసా లిసా’, ‘అలె’, ‘ఎనక్కు 20 ఉనక్కు 18’ చిత్రాలు త్రిష ఉనికిని ఇండస్ట్రీలో బలంగా చాటాయి.

తెలుగులో తిరుగులేని తార...

2003లో తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రం ద్వారా పరిచయం అయింది. 2004లో ‘వర్షం’ 2005లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన 'నువ్వొస్తానంటే నే వద్దంటానా?' , 2005లోనే ‘అతడు’, ‘అల్లరి బుల్లోడు’, 2006లో ‘పౌర్ణమి’, ‘బంగారం’, ‘స్టాలిన్‌’చిత్రాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
2007లో ‘ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే, 2008లో ‘కృష్ణ, ‘బుజ్జిగాడు’, ‘కింగ్‌’, 2010లో ‘నమో వేంకటేశ’, 2011లో ‘తీన్మార్‌’, 2012లో ‘బాడీ గార్డ్‌’, ‘దమ్ము’, 2014లో ‘పవర్‌’, 2015లో ‘లయన్‌’, ‘చీకటి రాజ్యం’, 2016లో ‘నాయకి’... ఇలా చిత్రాలు చేసుకుంటూ విజయాలు ఖాతాలో వేసుకుంది. 2010లో ‘కట్టా మీఠా’ సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో త్రిష ఎంట్రీ ఇచ్చింది.

అవార్డులు - పురస్కారాలు:
చిత్రసీమలో చూపించిన సృజనాత్మక ప్రతిభకు త్రిషను అనేక అవార్డులు వరించాయి. 2004లో ‘వర్షం’, 2005లో ‘నువ్వొస్తావంటే నేనొద్దంటానా?’, 2007లో ‘ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే’, 2016లో ‘కోడి’ చిత్రాల్లో నటనకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డులు అందుకుంది. 2003లో ‘లిసా లిసా’ చిత్రంలో నటనకుగాను ఇంటర్నేషనల్‌ తమిళ్‌ ఫిలిం అవార్డుల్లో ఉత్తమ నటిగా... 2018లో 96 చిత్రంలో నటనకుగాను ‘ఆనంద వికటం’ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డును త్రిష సొంతం చేసుకుంది. అదే సినిమాకు నార్వే తమిళ్‌ ఫిలిం ఫెస్టివల్‌ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

నువ్వొస్తావంటే...కి నంది పురస్కారం:

‘నువ్వొస్తావంటే నేనోద్దంటనా?’ చిత్రానికి ఉత్తమ నటిగా 2005లో అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో త్రిషను సత్కరించింది. 2012లో దివా ఆఫ్‌ సౌత్‌ ఇండియా అవార్డు, బెస్ట్‌ యాక్టెస్ర్‌ ఆఫ్‌ ది డికేడ్‌ అవార్డు, 2013లో ఉమన్‌ అఛీవర్‌ అవార్డు, 2016లో ఫోర్టీన్‌ ఇయర్స్‌ ఇన్‌ సినిమా అవార్డులను త్రిషకు జెఎఫ్‌డబ్ల్యూ సంస్థ అందించింది. 2010లో తమిళ ఇండస్ట్రీలోనే అత్యుత్తమం అనదగ్గ ‘కలైమామణి’ అవార్డును త్రిష అందుకుంది. 60 సినిమాలకు పైగా నటిస్తే 30 సినిమాల్లో అవార్డులు లభించడం విశేషం.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం

ఒంటరి భామ...

కోట్లాది అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టిన త్రిష ఇప్పటికీ ఒంటరే. వివాహం చేసుకోవాలనుకున్నా, అనివార్య కారణాలతో రద్దయింది.

Last Updated : May 4, 2019, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details