తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అగ్రతారల 'షూటింగ్'​కు వేళాయెరా! - బోయపాటి శ్రీను

లాక్​డౌన్​ కారణంగా స్తంభించిన చిత్రసీమ నెమ్మదిగా ఊపందుకుంటోంది. యువ హీరోలు మునుపటి వేగంతో సినిమాలు చేయడం ప్రారంభించారు. తాజాగా అగ్రతారలు.. తామూ రంగంలోకి దిగనున్నట్లు ప్రకటించారు. బాలకృష్ణ, పవన్​ కల్యాణ్​, బన్నీ త్వరలోనే తమ సినిమాల చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Top Heros_shootings
సిద్ధమవుతోన్న అగ్రహీరోలు..

By

Published : Oct 28, 2020, 7:21 AM IST

Updated : Oct 28, 2020, 9:35 AM IST

చిత్రసీమలో సందడి మొదలైంది. చిత్రీకరణలు, ప్రారంభోత్సవాలు, విడుదల సన్నాహాలతో ఎవరికి వాళ్లు బిజీ బిజీగా గడుపుతున్నారు. కరోనా ప్రభావంతో ఆరేడు నెలలుగా స్తబ్దత నెలకొన్న విషయం తెలిసిందే. సినిమాలు ఆగిపోవడంతో ఇంటిపట్టునే గడిపిన కథానాయకులు ఒకొక్కరిగా తమ సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. యువతరం కథానాయకులైతే మునుపటిలాగే వేగంగా సినిమాల్ని చేస్తున్నారు. అగ్ర తారల్లో కొందరు మాత్రం ఇప్పటికీ కెమెరా ముందుకు రాలేదు. ఇప్పుడు వాళ్లల్లో కూడా కదలిక మొదలైంది. రానున్న వారం రోజుల వ్యవధిలో ముగ్గురు అగ్ర కథానాయకులు రంగంలోకి దిగబోతున్నారు.

29 నుంచి బాలకృష్ణ చిత్రం

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత ఆ ఇద్దరి కలయికలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత చిత్రీకరణని పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ని ఈ నెల 29 నుంచి ఆరంభించబోతున్నారు.

హైదరాబాద్‌లోనే మొదలుకానున్న తదుపరి షెడ్యూల్‌లో బాలకృష్ణతోపాటు ఇతర తారాగణం కూడా పాల్గొనబోతోందని సమాచారం. కథానాయిక ఎంపిక కూడా పూర్తయింది. బాలకృష్ణ సరసన మలయాళీ భామ ప్రయాగ మార్టిన్‌ నటించబోతోంది.

బాలకృష్ణ

వచ్చే నెలలో ఇద్దరూ

అగ్ర కథానాయకులు పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ కూడా రంగంలోకి దిగబోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా విరామం తర్వాత ఈ సినిమా చిత్రీకరణని షురూ చేశారు. అయితే పవన్‌ కల్యాణ్‌ మాత్రం మేకప్‌ వేసుకోలేదు.

సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న అంజలి, నివేదా థామస్‌లపై సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇక పవన్‌ కూడా రంగంలోకి దిగే సమయం వచ్చిందని చిత్రవర్గాలు చెప్పాయి. నవంబర్‌ 1 నుంచి పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమా కోసం కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతోంది.

పవన్​ కళ్యాణ్, బన్నీ

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘పుష్ప’ కూడా వచ్చే నెలలోనే శ్రీకారం చుట్టుకోబోతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణని షురూ చేయడానికి సర్వం సన్నద్ధమైంది. విశాఖ పరిసరాల్లో చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు.

ఇదీ చదవండి:ఆ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేశ్​ ఖరారు!

Last Updated : Oct 28, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details