దేవకన్యలు, అప్సరసలు, రంభ, ఊర్వశి, మేనకలను ఎవరూ చూడలేదు. కానీ సీనియర్ హీరోయిన్ రంభను చూస్తే మాత్రం వాళ్లు ఇలానే ఉంటారేమోనని అనిపిస్తుంది. అంతటి అందం ఆమె సొంతం. అల్ట్రా మోడరన్‌గా కనిపించినా, బికినీ వేసినా, చీర కట్టినా ఈమెకే చెల్లింది. నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమె గురించి ఓ కథనం.
మలయాళ చిత్రంతో
విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. పాఠశాలలో చదువుతున్నప్పుడే దర్శకుడు హరిహరన్ దృష్టిలో పడింది. మలయాళ చిత్రం 'సర్గమ్'తో అరంగేట్రం చేసింది.
'ఆ ఒక్కటి అడక్కు'
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'ఆ ఒక్కటి అడక్కు'తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రంతోనే ఆమె పేరు రంభగా మారిపోయింది. 'ఏవండీ ఆవిడ వచ్చింది', 'భైరవద్వీపం' తదితర చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో వెనుదిరిగి చూసుకోలేదు. 'హలో బ్రదర్', 'బంగారు కుటుంబం', 'ముద్దుల ప్రియుడు', 'అల్లరి ప్రేమికుడు', 'అల్లుడా మజాకా', 'మాతో పెట్టుకోకు' తదితర చిత్రాల్లో నటించి అభిమానుల మనసు గెల్చుకుంది.
అగ్రకథానాయకులందరితోనూ
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భోజ్‌పురి, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించింది రంభ. మొత్తంగా దక్షిణాదిలో మమ్ముట్టి, రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌కాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌లాల్, రవిచంద్రన్, కార్తిక్ ముత్తురామన్, జయరామ్, అజిత్ కుమార్, విజయ్ తదితరుల స్టార్హీరోలతో కలిసి పనిచేసింది.
బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్, మిధున్ చక్రవర్తి, గోవింద, సన్నీ దేఓల్, అనిల్ కపూర్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగణ్, సునీల్ శెట్టి వంటి అగ్రహీరోలతోనూ నటించింది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన రెండో ఇన్నింగ్స్‌లో పలు సినిమాల్లో ప్రత్యేక గీతాలతో అలరించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది.
బుల్లితెరపైనా
బుల్లితెరతోనూ అనుబంధం ఏర్పరచుకున్న రంభ.. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అలా 2010లో ఇంద్ర కుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అనంతరం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
ఇదీ చూడండి : బాలీవుడ్‌కు నో చెప్పి.. దక్షిణాదికి జైకొట్టి