తెలుగు చిత్రసీమకు ఆయువు పట్టు సంక్రాంతి. అగ్ర హీరోలు మూకుమ్మడిగా వెండితెరపైకి దండయాత్రగా వచ్చేది.. కళ్లు చెదిరే వసూళ్లతో బాక్సాఫీస్ ముందు సరికొత్త రికార్డులు సృష్టించేది ఈ సీజన్‌లోనే. అందుకే ముగ్గుల పండగ వస్తుందంటే చాలు.. దాదాపు ఆర్నెళ్ల ముందు నుంచే సంక్రాంతి అల్లుళ్లగా మారేందుకు సెట్స్‌పై ముస్తాబవుతుంటారు అగ్ర హీరోలు. ఇది ఏటా ఉన్న ఆనవాయితీనే. ఇప్పుడీ ఆనవాయితీకి కరోనా రూపంలో చెక్ పడినట్లయింది. చిత్రీకరణలు ఆలస్యమవడం వల్ల.. పెద్ద పండక్కి వస్తారనుకున్న అగ్ర హీరోలంతా వేసవి వైపు దృష్టిసారించారు. దీంతో ఈసారి సంక్రాంతి బరిలో నిలిచేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసే సినీ సంక్రాంతికి నాలుగున్నర నెలల సమయమే ఉంది. కరోనాతో ఈసారి చిత్ర సీమలో పండగ సందడి కనిపించడం లేదు. ఓ వైపు చిత్రీకరణలకు అనుమతులిచ్చినా.. కరోనా పరిస్థితులు కుదుటపడకపోవడం వల్ల అగ్ర హీరోలు సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. థియేటర్లు తెరవడంపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుండటం, ఒకవేళ ప్రదర్శనలకు అనుమతులిచ్చినా ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇప్పుడుఇలాంటి అంశాలన్నీ సంక్రాంతి సీజన్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.
వాస్తవానికి దర్శకుడు రాజమౌళి తన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం కోసం అందరి కంటే ముందుగానే సంక్రాంతి బెర్తును బుక్ చేసుకున్నారు. మహమ్మారి వైరస్.. జక్కన్న ఆశలపై నీళ్లు జల్లింది. ఇప్పటికిప్పుడు చిత్రీకరణ మొదలుపెట్టినా.. అన్ని పనులు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడానికి కనీసం ఆరు నెలల సమయమైనా పట్టొచ్చని ఇటీవలే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టీ చూస్తే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు పండగ బరి నుంచి తప్పుకొన్నట్లే అని అర్థమవుతోంది. 'ఆచార్య'గా చిరంజీవి, 'అణ్ణాత్త'తో రజనీకాంత్ ముగ్గుల పండగ రేసులో తలపడతారని భావించినప్పటికీ.. ఆ చిత్రాలూ వేసవి వైపే దృష్టి సారించాయి. ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్‌సాబ్' తుదిదశ చిత్రీకరణకు చేరుకున్నప్పటికీ.. ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయమే పట్టే అవకాశాలున్నాయి. దీంతో పవన్ సంక్రాంతి బరిలో నిలుస్తారా? లేదా? అన్నది అనుమానమే.