నటుడు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) అధికారుల దర్యాప్తు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మత్తు పదార్థాల సరఫరా ముఠాలపై కొనసాగుతున్న దాడులు, ఇప్పటికే అరెస్టయిన వారి విచారణల్లో కొత్త కొత్త పేర్లు వెలుగుచూస్తున్నాయి. తాజా పరిస్థితులపై కలవరం చెందుతున్న అగ్రశ్రేణి నటులు కొందరు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
దీపిక మేనేజర్‌కు సమన్లు
మాదక ద్రవ్యాల వినియోగం కేసులో నటి దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌కు, టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ 'క్వాన్' సీఈవో ధ్రువ్ చిట్గోపేకర్‌లకు ఇప్పటికే ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అవసరమైతే నటి దీపికా పదుకొణెకు సమన్లు జారీ చేస్తామని ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్‌లకూ త్వరలోనే సమన్లు జారీచేసే అవకాశముందని సమాచారం.
రెండు ముఖ్య కోణాల్లో దర్యాప్తు
డ్రగ్స్ సరఫరా కోసం సినీప్రముఖులతో ప్రత్యేకమైన వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారని భావిస్తున్న టాలెంట్ మేనేజర్ జయా సాహా నుంచి కీలకమైన అంశాలను దర్యాప్తు అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. 2007 అక్టోబరులో జరిగినట్లుగా భావిస్తున్న ఓ వాట్సప్ సంభాషణ సంకేతాల రూపంలో కొనసాగింది. అందులో 'డి', 'కె', 'ఎస్', 'ఎన్', 'జె' అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీబీ దర్యాప్తులో కనీసంగా రెండు ముఖ్య కోణాలు కనిపిస్తున్నాయి.
బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాలు-సుశాంత్‌సింగ్, రియా చక్రవర్తిల వ్యవహారం ఒకటి కాగా ఇంకొకటి '2019 బాలీవుడ్ పార్టీ వీడియో' గురించి మన్‌జిందర్ సింగ్ సిర్సా చేసిన ఫిర్యాదు, దానిలో పాల్గొన్న తారలు. ఎన్‌సీబీ ఇప్పటి వరకు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సహా 12 మందిని అరెస్టు చేసింది.
చట్టపరంగా చర్యలు తీసుకుంటా
మాదక ద్రవ్యాల వినియోగంపై తనపై వస్తున్న ఆరోపణలను నటి దియా మీర్జా ఖండించారు. దీపికా పదుకొణె మేనేజర్‌కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో దియా మీర్జా పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది అవాస్తవమని..తప్పుడు సమాచారం, ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని దియా పేర్కొన్నారు.