తెలంగాణ

telangana

రొమాన్స్​కు స్వస్తి.. యాక్షన్​ కోసం కుస్తీ!

By

Published : Mar 5, 2021, 9:31 AM IST

టాలీవుడ్​లో లవర్ బాయ్​, రొమాంటిక్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న కొందరు కథానాయకులు తమలోని మాస్ కోణాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారెవరో చూద్దాం.

Tollywood Young Heros interested on Action films
రొమాన్స్​కు స్వస్తి.. యూక్షన్​ కోసం కుస్తీ!

రొమాంటిక్‌ చిత్రాల్లో నటించి బోర్‌ కొట్టేసింది. కొత్తదనం కోసమే యాక్షన్‌ ప్రయత్నం అంటున్నారు ఈ హీరోలు. క్లాస్‌ పాత్రల్లో కనిపించి క్లాప్స్‌ కొట్టించుకోవడమే కాదు మాస్‌ లుక్‌లోనూ దర్శనమిచ్చి విజిల్‌ వేయించాల్సిందే అంటున్నారు. అందుకే కొంతకాలం ప్రేమకథల్ని పక్కనపెట్టి యాక్షన్‌ బాట పట్టారు. వాళ్లెవరో తెలుసుకుందామా..!

రామ్ పోతినేని

రామ్‌ కెరీర్​లో పూర్తి స్థాయి మాస్‌ చిత్రాలు అంతగా కనిపించవు. 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో ఆ కల నెరవేరింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సరికొత్త రామ్‌ని పరిచయం చేసింది. బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించడమే కాకుండా, సినిమాలో రామ్‌ నటనకు ప్రశంసలూ దక్కాయి. . కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన 'రెడ్‌'లోనూ ద్విపాత్రాభినయం చేసి అలరించారు రామ్‌. ప్రస్తుతం మరో యాక్షన్‌ కథని ఎంపిక చేసుకుని అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైందా సినిమా. ఇందులో ఇద్దరు భామలకు అవకాశం ఉందని, ఇప్పటికే ఓ నాయికగా కృతిశెట్టి ఖరారైందని సినీ వర్గాల సమాచారం. మరి రామ్‌ను లింగుస్వామి ఎలా చూపిస్తారో చూడాలి.

రామ్

నాని

గతేడాది మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన 'వి'లో వైవిధ్య నటన చూపించారు నాని. దాన్ని కొనసాగిస్తూ ఫ్యామిలీ డ్రామాకు యాక్షన్‌ జోడించి 'టక్‌ జగదీష్‌'గా రాబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 23న విడుదల కాబోతుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ మరో నానిని పరిచయం చేసిందని చెప్పొచ్చు. టక్‌ చేసుకుని క్లాస్‌గా కనిపిస్తూనే లోపలి మాస్‌ కోణాన్ని ఆవిష్కరించారాయన. దీంతోపాటు 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నటిస్తున్నారు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకుడు. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా నిర్మితమవుతుంది. నాని గత చిత్రాలకు మించిన యాక్షన్‌ ఇందులో ప్రదర్శించనున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి నాయికలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది.

నాని

వరుణ్ తేజ్

వరుణ్‌ తేజ్ కూడా మాస్‌ పాత్రలపైనే మనసుపడ్డారు. అందుకే 'గద్దలకొండ గణేష్‌'గా మారి ఆశ్చర్యానికి గురిచేశారు. తనలోని నటుడ్ని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రమిది. వైవిధ్యభరితమైన టైటిల్‌ పాత్ర పోషించి శెభాష్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు 'గని'గా వెండితెరపై పంచ్‌ విసిరేందుకు సన్నద్ధమవుతున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. యాక్షన్‌ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలోని పాత్ర కోసం బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సయీ మంజ్రేకర్‌ నాయిక. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జులై 30న విడుదలవుతుంది.

వరుణ్ తేజ్

విజయ్ దేవరకొండ

'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' ఇచ్చిన షాక్‌తో ఇక ప్రేమ కథలకు స్వస్తి పలుకుతున్నట్లు చెప్పేశారు విజయ్‌ దేవరకొండ. తొలి నుంచి వైవిధ్య కథలు ఎంపిక చేసుకునే ఆయన రొమాంటిక్‌ చిత్రాలకు కాస్త విరామం ఇచ్చి మాస్‌ని ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్‌'. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఈ సినిమా ఏ రేంజ్‌లో రూపొందుతుందో తెలియజేసింది. విజయ్‌ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో విజయ్‌ సరసన అనన్యా పాండే నటిస్తోంది. సెప్టెంబరు 9న విడుదలవుతుందీ సినిమా.

విజయ్ దేవరకొండ

నాగశౌర్య

తొలినుంచి లవర్‌ బాయ్‌గా అలరించిన నాగశౌర్య ఇటీవలే 'అశ్వథ్థామ'లో యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. త్వరలో 'లక్ష్య' సినిమాతో పూర్తిస్థాయి మాస్‌ని పరిచయం చేయనున్నారు. ఆర్చరీ నేపథ్యంలో సంతోశ్‌ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్‌ప్యాక్‌ చేసి ఔరా అనిపించారు శౌర్య. కేతికా శర్మ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు మరో మూడు ప్రేమకథా చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

నాగశౌర్య

నితిన్

ఇప్పటికే ఎన్నో మాస్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన నితిన్‌ కొంతకాలంగా ప్రేమకథల్నే చేస్తున్నారు. ఇటీవలే 'చెక్‌'ని విడుదల చేసిన ఆయన మరోవైపు 'రంగ్‌ దే' సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. 'ఇదే నాకు చివరి లవ్‌స్టోరీ అనుకుంటున్నా' అని చెప్పకనే చెప్పారు నితిన్‌. 'పవర్‌పేట'‌, 'అంధాధున్‌' రీమేక్‌లతో రొమాంటిక్‌ చిత్రాలకు చెక్‌ పెట్టనున్నారు.

నితిన్

ABOUT THE AUTHOR

...view details