సినిమా ఓ విచిత్రమైన వ్యాపారం.. ఓ ఫ్యాక్టరీ స్థాపించి నష్టపోయినా-కనీసం దాని తాలుకూ స్థిర, చర ఆస్తులైనా మిగులుతాయి. సినిమా అలా కాదు. పోతే... అంతా పోయినట్టే. రూ.కోట్లతో తీసిన సినిమా అయినా తేడా వస్తే రూపాయి కూడా మిగలదు. ఒక్కోసారి పది రూపాయలు పెడితే, రూ.వందలు వేలు జాక్ పాట్‌లా వచ్చి పడిపోవొచ్చు. అయితే అలాంటి అద్భుతాలు అరుదుగానే జరుగుతుంటాయి. కానీ వాటినే నమ్ముకుని కొత్త నిర్మాతలు వస్తుంటారు. అందుకే విజయాల శాతం తక్కువగా కనిపిస్తున్నా సరే, ఏటికేడు సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019లోనూ రికార్డు స్థాయిలో 184 చిత్రాల్ని విడుదల చేసింది తెలుగు చిత్రసీమ. వీటిలో హిట్ జాబితాలో చేరిన సినిమాలు 20 మాత్రమే. అంటే దాదాపు 10 శాతం విజయాలకే పరిమితమై పోయిందన్నమాట. 50 శాతం చిత్రాలకు వాటి పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. కొన్ని చిన్న సినిమాలకు విడుదల కావడమే విజయంలా అయిపోయింది. అయినా సరే రూ.కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు వెనుకంజ వేయలేదు. హీరో, దర్శకుడి స్థాయిని మించి ఖర్చు చేసే సాహసం చేశారు. హిందీ మార్కెట్ పెరగడం, డిజిటల్ రైట్స్ రూపంలో ఆకర్షణీయమైన మొత్తాలు రావడం నిర్మాతలకు కొండంత భరోసాని కలిగించాయి. మొత్తంగా చూస్తే 2019లోనూ టాలీవుడ్ ఏమాత్రం మారలేదు. పది శాతం విజయాలకు పరిమితమైంది. నెలవారిగా విడుదలైన సినిమాలేంటి? అందులో విజయాలెంత? వాటి మార్కెట్ ఎంత? అని విశ్లేషిస్తే...
జనవరి
విడుదలైన చిత్రాలు: 10
వ్యాపారం: సుమారు రూ.250 కోట్లు
విజయాలు: 1
ఏటా సంక్రాంతితో తెలుగు సినిమా సీజన్ మొదలవుతుంది. పెద్ద సినిమాలు పలకరించేది, రికార్డుల హవా కనిపించేది ఇప్పుడే. అయితే ఈ సంక్రాంతి చిత్రసీమకు మింగుడు పడలేదనే చెప్పాలి. 'కథానాయకుడు', 'ఎఫ్ 2', 'వినయ విధేయ రామ' విడుదలయ్యాయి. వీటిలో 'ఎఫ్ 2' మాత్రమే విజయాన్నందుకుంది. ఈసినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ఊరటనిచ్చింది. 'కథానాయకుడు' నందమూరి అభిమానుల్ని కూడా మెప్పించలేకపోయింది. 'వినయ విధేయ రామ' మాస్‌ని అలరించడమే ధ్యేయంగా రూపొందించినప్పటికీ, వాళ్ల ఆశీస్సులూ ఈ చిత్రానికి దక్కలేదు. దాదాపు రూ.వంద కోట్ల బిజినెస్ చేసింది గానీ, నిర్మాతలకు, బయ్యర్లకూ నష్టాలు మిగిల్చింది. అఖిల్ 'మిస్టర్ మజ్ను'గా వచ్చినా ఫలితం లేదు.
ఫిబ్రవరి
విడుదలైన చిత్రాలు: 14
వ్యాపారం: సుమారు రూ.30 కోట్లు
విజయాలు: 1
ఫిబ్రవరి కూడా చిత్రసీమకు కలిసి రాలేదు. సంక్రాంతి పరాజయాల భారాన్ని ఫిబ్రవరిలోనూ మోయాల్సివచ్చింది. 14 చిత్రాలొచ్చినా అందులో 'యాత్ర' ఒక్కటే ప్రేక్షకులు, విమర్శకుల మన్ననలు పొందగలిగింది. 'ఎన్టీఆర్' బయోపిక్‌లో భాగంగా బాలకృష్ణ నటించిన 'మహానాయకుడు' ఆశించినంతమేర ఆకట్టుకోలేకపోయింది. 'రహస్యం', 'అక్కడొకడుంటాడు', 'ఉన్మాది', 'అమావాస్య', 'మిఠాయి' లాంటి చిత్రాలైతే అసలు వచ్చాయో, రాలేదో.. తెలిసేలోగా థియేటర్ల నుంచి వెళ్లిపోయాయి. ఈ నెల నిర్మాతలకు నష్టాల్ని మిగిలిస్తే, థియేటర్లన్నీ బోసిపోయాయి.
మార్చి
విడుదలైన చిత్రాలు: 24
వ్యాపారం: సుమారు రూ.50 కోట్లు
విజయాలు: 1
మార్చిలో సినిమాలు వెల్లువలా వచ్చాయి. వారానికి నాలుగైదు సినిమాలు వరుస కట్టాయి. మొత్తంగా రికార్డు స్థాయిలో 24 చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఒకే ఒక్క సినిమా విజయాన్ని అందుకుంది. అదే '118'. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం మెప్పించింది. మంచి వసూళ్లనీ అందుకుంది. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' టైటిల్‌తోనూ, ప్రచార చిత్రాలతోనూ యువతరాన్ని థియేటర్ల వరకూ రప్పించి, కొన్ని వసూళ్లని దక్కించుకుంది. విడుదలకు ముందు వివాదాలతో ప్రచారం సంపాదించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బాక్సాఫీసు ముందు మాత్రం బోల్తా కొట్టింది. నిహారిక 'సూర్యకాంతం' కూడా ప్రేక్షకుల మనసుల్ని గెలవలేదు.
ఏప్రిల్
విడుదలైన చిత్రాలు: 10
వ్యాపారం: సుమారు రూ.80 కోట్లు
విజయాలు: 3
సంక్రాంతి తరవాత కీలమైన సీజన్ వేసవి. ఏప్రిల్‌లో వేసవి హంగామా బాగానే కనిపించింది. ఈనెల బాక్సాఫీసుకు కాస్త ఉపశమనాన్ని కలిగించిందనే చెప్పాలి. పది చిత్రాలు విడుదలైతే అందులో మూడు నిర్మాతల కళ్లల్లో సంతోషాన్ని నింపాయి. 'మజిలి'తో నాగచైతన్య, సమంతల జోడీ మరోసారి మ్యాజిక్ చేసింది. చక్కటి కథకు భావోద్వేగాలు, మంచి సంగీతం తోడవ్వడం వల్ల హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సాయితేజ్ కెరీర్‌కు 'చిత్రలహరి' ఊపిరి పోసింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంగా సాగిన నాని 'జెర్సీ' మెప్పించింది. ఇది హిందీలోనూ రీమేక్ అవుతోంది. ఈ మూడు విజయాలు టాలీవుడ్‌కి టానిక్‌లా పనిచేశాయి.
మే
విడుదలైన చిత్రాలు: 13
వ్యాపారం: సుమారు రూ.150 కోట్లు
విజయాలు: 1
ఏప్రిల్‌లో మూడు విజయాలు దక్కినప్పటికీ, బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సినిమా ఒక్కటీ రాలేదు. ఆ లోటు 'మహర్షి'తో తీరిపోయింది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఓ ప్రభంజనంలా దూసుకెళ్లిపోయింది. రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరింది. 'ఫలక్‌నుమా దాస్' కొన్ని చోట్ల మంచి వసూళ్లే అందుకున్నా, హిట్‌కి కాస్త దూరంలో నిలిచిపోయింది. తేజ - కాజల్ కలయికలో వచ్చిన 'సీత' అన్ని విధాలా నిరాశ పరిచింది. అల్లు శిరీష్ చిత్రం 'ఏబీసీడీ' కూడా పరాజయాన్నే చవిచూసింది.
జూన్
విడుదలైన చిత్రాలు: 16
వ్యాపారం: సుమారు రూ.70 కోట్లు
విజయాలు: 2
జూన్‌లో 16 చిత్రాలు విడుదలయ్యాయి. కానీ విజయాలు మాత్రం రెండే. 'సెవెన్', 'హిప్పీ', 'విశ్వామిత్ర', 'ఓటర్'... ఇలా ఫ్లాపుల మీద ఫ్లాపులు వచ్చాయి. 'మల్లేశం' మంచి ప్రయత్నంగా మిగిలింది. చిన్న చిత్రాలుగా వచ్చి, ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై మ్యాజిక్ చేసిన సినిమాల్లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా' మిగిలిపోతాయి. కథ, కథనాలు కొత్తగా ఉంటే, ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు భుజాలకు ఎత్తుకుంటారని ఈ రెండు సినిమాలూ నిరూపించాయి. రాజశేఖర్ ఎత్తిన 'కల్కి' అవతారం ప్రేక్షకులకు నచ్చలేదు. 'స్పెషల్', 'ప్రేమజంట', 'వజ్ర కవచధర గోవింద'... ఏదీ ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా రాలేదు.