తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సొంత సినిమాలతో హీరోలకు పోటీ తప్పదా? - varun tej F3

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు మూతపడ్డాయి. ఇటీవలే పరిణామాలతో పలు రాష్ట్రాల్లో సినిమాహాళ్లు తెరుచుకునేందుకు అనుమతులు లభించాయి. అయితే కరోనా సంక్షోభం కారణంగా తెలుగు హీరోలు నటిస్తున్న రెండు, మూడు చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు థియేటర్లు తెరుస్తున్న నేపథ్యంలో హీరోలు తమ చిత్రాలతో తామే పోటీ పడాల్సిన పరిస్థితి చిత్రసీమలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిత్రాల విడుదలలను వాయిదా వేస్తారా? లేదా వరుస చిత్రాలను థియేటర్లలోకి తీసుకురానున్నారా? అని టాలీవుడ్​ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tollywood Top Heroes upcoming Movies ready to release
స్వంత సినిమాలతోనే హీరోలకు పోటీ తప్పదా?

By

Published : Jul 7, 2021, 6:16 AM IST

అగ్రహీరోలు ఒకప్పుడు ఒకరితో ఒకరు పోటీపడేవారు. ఇప్పుడు సొంత చిత్రాలతో పోటీపడే పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా థియేటర్లు తెరుచుకోలేదు. మరోవైపు షూటింగ్‌లు యథావిధిగా జరుగుతున్నాయి. తారలంతా బడా సినిమాలను వండి సిద్ధం చేశారు. వడ్డించడమే మిగిలిపోయింది. అయితే ఒక హీరో చేతిలో రెండు, మూడు చిత్రాలుండం వల్ల వాటిని ఎలా వడ్డిస్తారనేది సమస్యగా మారింది. ఏ చిత్రాన్ని ముందు పంపాలో, దేనిని ఆపేయాలో తెలియని విచిత్ర పరిస్థితిలో టాలీవుడ్‌ హీరోలున్నారు. ఇది ఒక్కరి కథ కాదు? స్టార్‌ హీరోలందరి వ్యథ. మన హీరోల ఈ చిక్కుముడుల కథేంటో చూద్దాం..

చెర్రీ బాక్సాఫీస్‌ వర్రీ!

మెగా పవర్​స్టార్​ రామ్‌ చరణ్‌ రెండు సినిమాలు.. 'ఆచార్య', 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. వేసవి కానుకగా థియేటర్లలో విడుదలకావాల్సిన 'ఆచార్య' కరోనా కారణంగా వాయిదా పడింది. అన్నీ కుదిరితే దసరాకు 'ఆర్‌ఆర్‌ఆర్‌' వస్తుందని సినీ వర్గాల అంచనా. గతంలోనే అక్టోబర్‌ 13న వస్తుందని ప్రకటించారు కాబట్టి త్వరితగతిన పనులు పూర్తి చేసి ఆ చిత్రం బరిలో ఉండొచ్చు. చిరంజీవితో చరణ్​ కలిసి నటించిన 'ఆచార్య' కూడా దసరా కానుకగా వచ్చే అవకాశం ఉంది. దీంతో రామ్‌చరణ్‌ ఈ రెండు చిత్రాలు పోటీలో ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలా కుదరకపోతే ఏదో ఒక చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. చెర్రీ ఏం చేస్తాడో చూడాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు. ఈ రెండే కాకుండా శంకర్‌తో భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించనున్నాడు.

'ఆచార్య'లో రామ్​చరణ్​, పూజాహెగ్డే

ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' వచ్చేనా..?

'సాహో' తర్వాత ప్రభాస్‌ భారీ సినిమాలకు సంతకం చేశాడు. 'రాధేశ్యామ్‌', 'ఆదిపురుష్', 'సలార్‌' చిత్రాలు ఒప్పుకున్నాడు. నాగ్‌ అశ్విన్‌తో మరో సైన్స్ ఫిక్షన్‌ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. 'ఆదిపురుష్‌' ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకొని ఈ మధ్యే షూటింగ్‌ ప్రారంభించింది. ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌' చిత్రీకరణ కూడా శరవేగంగా జరుపుకొంటోంది. మరోవైపు ప్రభాస్​ నటించిన మరో చిత్రం 'రాధేశ్యామ్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టులో కానీ లేదా దసరాకు బరిలోకి దింపాలని చిత్రబృందం ఆలోచనలో ఉంది. 'ఆదిపురుష్‌' వచ్చే ఏడాదికి థియేటర్లలోకి వస్తుంది. మిగతా సినిమాల్లో ఏవీ త్వరగా షూట్‌ పూర్తి చేసుకొని థియేటర్లలోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. వచ్చే ఏడాది 'సలార్‌', 'ఆదిపురుష్‌' సినిమాలతో బరిలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

'రాధేశ్యామ్​'లో ప్రభాస్​

మూడు చిత్రాలతో వెంకీ!

వెంకటేశ్‌ నటించిన రెండు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. 'నారప్ప', 'దృశ్యం 2' సినిమాలను పూర్తి చేసి బాక్సాఫీసు వేటకు సిద్ధంగా ఉన్నాడు వెంకీమామ. అయితే వీటిలో ఏది ముందు తీసుకు రావాలనేది సమస్యగా మారింది. శ్రీకాంత్‌ అడ్డాలతో చేసిన అసురన్‌ రీమేక్‌ 'నారప్ప', జీతూజోసెఫ్‌ తెరకెక్కించిన 'దృశ్యం 2' రెండూ ఓటీటీకి వస్తాయా? లేదా థియేటర్లలో సందడి చేస్తాయా? అనేది వేచి చూడాలి. మరోవైపు వరుణ్‌తేజ్‌తో కలిసి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్‌3' చివరి దశకు వచ్చేసింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. అంటే వెంకటేశ్ మూడు సినిమాలు విడుదలకు వరుసగా ఉన్నాయి.

వెంకటేశ్​

భారీ సినిమాల తారక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రాజమౌళితో తీస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా దాదాపు పూర్తయింది. రెండు పాటలు మిగిలిపోయాయని చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. పరిస్థితులు సద్దుమణిగితే అనుకున్న సమయానికి దసరా బరిలో ఉండే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మిగతా చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. దీనికన్నా ముందే త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ నీల్‌ కథలు ఓకే అయ్యాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత తారక్‌ చేయబోయే చిత్రమేంటో ఇంకా స్పష్టత రాలేదు.

'ఆర్​ఆర్ఆర్​' సినిమాలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​

పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి అంతే!

కరోనా కాలంలో 'వకీల్‌ సాబ్‌'తో బాక్సాఫీసుకు ఊపు తెచ్చాడు పవన్‌ కల్యాణ్‌. ప్రస్తుతం ఆయన మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌'ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు. రానాతో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు పవర్‌ స్టార్‌. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. దీంతో పాటు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాలోనూ ఆయన నటిస్తున్నాడు. ఇదొక పీరియాడిక్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ఇందులోని పోరాట సన్నివేశాల కోసం శిక్షణ తీసుకున్నారు పవన్‌. మరోవైపు దర్శకుడు హరీశ్‌ శంకర్‌తో చేయబోయే సినిమా పనులు వేగం అందుకున్నాయి. వీటిలో దేన్ని పవన్‌ పూర్తిచేస్తారు? ఏది ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది? తెలియాలి.

'హరిహర వీరమల్లు' చిత్రంలో పవన్​కల్యాణ్​

అఖిల్‌ ఒకే నెల్లో వస్తాడా?

అక్కినేని అఖిల్‌, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌'. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ వేసవిలో థియేటర్లలోకి సందడి చేయాల్సిన ఈ సినిమాకు కష్టాలు తప్పట్లేదు. ఓటీటీలో విడుదల అవుతుందని కొన్నాళ్లు ప్రచారం సాగింది. కానీ ఆ వార్తలను కొట్టిపడేసింది చిత్రబృందం. దసరాకు పెద్ద సినిమాలు సందడి చేయనుండటం వల్ల ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే నెలలో సురేందర్‌ రెడ్డితో చేస్తున్న 'ఏజెంట్‌' సినిమా థియేటర్లలో రానుందని పోస్టర్లోనే చెప్పేశారు. వీటిలో ఏది ముందస్తుందో.. ఏది వెనక్కెళ్లిపోతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

అక్కినేని అఖిల్​

నాని సిద్ధంగానే ఉన్నాడు

నాని నటించిన రెండు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్‌ జగదీష్' షూటింగ్‌ ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సింది. కానీ ఆగస్టులో వచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు 'శ్యామ్‌ సింగరాయ్‌', 'అంటే సుందరానికి' సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇవి రెండూ డిసెంబర్‌లో తలపడే అవకాశముంది.

'శ్యామ్​ సింగరాయ్​' చిత్రంలో నాని

మరికొందరి తెలుగు హీరోల పరిస్థితి ఇలాగే ఉంది. వరుణ్ తేజ్‌ నటిస్తోన్న 'ఎఫ్‌ 3'తోపాటు 'గని' సినిమా సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్‌, నితిన్‌, రవితేజ, శ్రీవిష్ణు, నాగశౌర్య వారి వారి చిత్రాలతో రెడీ అయిపోయారు. అయితే థియేటర్లు తెరిచాక ఈ సినిమాలన్నీ ఏ క్రమంలో విడుదలవుతాయో తెలియని పరిస్థితి. అన్నింటినీ వారం తేడాతో విడుదల చేస్తే, ఏ సినిమాకూ లాభం లేకుండా పోతుంది. దీంతో అసలుకే మోసం వస్తుంది. అలాగని రెడీగా ఉన్న చిత్రాలనూ రిలీజ్‌ చేయకుండా ఉండటమూ కష్టమే.

ఇదీ చూడండి..Sujeeth: జన్మలో డైరెక్టర్ కాలేవన్నారు!

ABOUT THE AUTHOR

...view details