తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గంగోత్రి' టు 'అల వైకుంఠపురంలో'.. బన్నీ స్టైల్​

బాక్సాఫీస్‌ బొనాంజా... మాట్నీ ఐకాన్‌... హీరోగా సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్​ నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి సినీ జర్నీపై ప్రత్యేక విశేషాలను తెలుసుకుందాం.

Tollywood stylish star Alluarjun birthday special
అల్లు అర్జున్​

By

Published : Apr 8, 2020, 6:24 AM IST

మెగాస్టార్‌ మేనల్లుడు... అల్లువారసుడు... అతడే అల్లు అర్జున్‌. టాలీవుడ్​లో స్ట్రైలిష్​ స్టార్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గంగోత్రితో వెండితెరకు పరిచయమైన అల్లు... ఇటీవల విడుదలైన 'అల వైకుంఠపురంలో' వరకు విజయాలతో రికార్డ్స్‌ సృష్టించాడు. నేడు ఈ స్టైలిష్​ స్టార్​ పుట్టినరోజు సందర్భంగా అతడి సినీ జర్నిపై ఓ లుక్కేద్దాం.

అల్లు రామలింగయ్య సినీ వారసుడు

అల్లు అర్జున్‌ 1982 ఏప్రిల్‌ 8న (తమిళనాడు) చెన్నైలోని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మలకు జన్మించాడు. తన హావభావాలతో, హాస్య వల్లరితో కొన్ని దశాబ్దాలు తెలుగు తెరపై నవ్వులు పూయించిన ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య... అల్లు అర్జున్‌కు తాతయ్య. అల్లు అర్జున్‌ మేనత్త సురేఖ టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని వివాహం చేసుకొంది. అర్జున్‌ ముద్దు పేరు బన్నీ. ఆ పేరుతో కూడా సినిమా వచ్చింది. యువ హీరో అల్లు శిరీష్‌... బన్నీకి సోదరుడు. అల్లు వెంకటేష్‌ అనే మరో సోదరుడు కూడా ఉన్నాడు.

బాలనటుడిగా విజేత

'విజేత' సినిమాలో అల్లు అర్జున్‌ ఓ బాల నటుడి పాత్రలో నటించాడు. ఆ తరువాత 'డాడీ' చిత్రంలో డాన్సర్‌గా కనిపించాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు సినిమా 'గంగోత్రి'తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్‌. ఇది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి వందవ సినిమా. ఆ తరువాత సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' సినిమాలో నటించాడు.

అనంతరం 'బన్నీ', 'హ్యాపీ', 'దేశముదురు', 'పరుగు'తో సినిమాలు చేశాడు. వీటిలో బన్నీ, దేశముదురు అల్లు అర్జున్​కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

చిరంజీవి హీరోగా వచ్చిన 'శంకర్‌ దాదా జిందాబాద్‌'లో అతిధి పాత్రలో తళుక్కుమని మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్‌ యాక్షన్‌ డ్రామా 'ఆర్య 2'లో నటించాడు. అనంతరం 2010లో రెండు ప్రయోగాత్మకమైన సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించాడు అల్లు అర్జున్‌. వాటిలో మొదటిది గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన 'వరుడు' సినిమా కాగా రెండవది క్రిష్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'వేదం' సినిమా. ఆ తరువాత 'బద్రీనాథ్‌','జులాయి' ,'ఇద్దరమ్మాయిలతో' సినిమాల్లో నటించాడు.

'ఎవడు'లో కీలకభూమిక

2014లో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎవడు' సినిమాలోకీలక పాత్రలో కనిపించాడు బన్నీ. ఆ తరువాత సురేందర్‌ రెడ్డి, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో 'రేసుగుర్రం' సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన రెండవ సినిమా 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి'. ఇది 2015 ఏప్రిల్‌ 9న విడుదల అయింది. ఆ తరువాత గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రుద్రమదేవి' సినిమాలో నటించాడు. ఇది భారతదేశంలో మొదటిసారిగా 3డిలో తెరకెక్కిన ఓ చారిత్రక సినిమా. ఆ తరువాత 'సరైనోడు', 'దువ్వాడ జగన్నాధం' 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో నటించాడు. ఇటీవల తాజాగా 'అల వైకుంఠపురములో' మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బన్నీ.

మళయాళ ఇండస్ట్రీలో అర్జున్‌

అల్లు అర్జున్‌కు మలయాళ సినిమా పరిశ్రమలో కూడా తిరుగు లేని స్టార్డం ఉంది. టాలీవుడ్‌ హీరోలలో ఏ హీరోకూ దక్కనంత స్టార్‌ స్టేటస్‌ మలయాళ సినిమా పరిశ్రమలో దక్కించుకున్నాడు అల్లు అర్జున్‌. అల్లు అర్జున్‌ నటించిన దాదాపు ప్రతీ సినిమా కూడా మలయాళ భాషలో కూడా విడుదలయ్యి అక్కడ ప్రేక్షాభిమానాన్ని దక్కించుకోవడం విశేషం.

వివాహం

2011 మార్చి 6న, హైదరాబాద్‌లో అల్లు అర్జున్, స్నేహరెడ్డిలకు వివాహం అయింది. వీరికి అయాన్, అర్హా అనే పిల్లలు ఉన్నారు. కుటుంబమంటే అర్జున్‌కి ఎంతో ప్రేమ.

అల్లు అర్జున్​ వివాహం

ఇదీ చూడండి : క్వారంటైన్​లో 'కలరిపట్టు'తో మెప్పించిన జమ్వాల్

ABOUT THE AUTHOR

...view details