తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ ఐడియాతో మీరూ వెండితెరపై స్టార్లైపోండి

Tollywood Stars Advice: సినిమా రంగంలో రాణించాలని చాలా మంది కలలు కంటారు. యాక్షన్​.. కట్​ అంటూ దర్శకత్వం వహించాలనుకుంటారు. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగిన సూచనలను ఇస్తున్నారు మన స్టార్లు. మరి వారేమంటున్నారో తెలుసుకుందాం..

hero nani
హీరో నాని

By

Published : Jan 1, 2022, 7:15 AM IST

Updated : Jan 1, 2022, 7:44 AM IST

Tollywood Stars Advice: సినిమా.. ఎంతో మంది యువత కల. కళల ప్రపంచం. ఎన్నో ఆశలు.. ప్రయత్నాలు.. సుదీర్ఘ నిరీక్షణ.. ఇలా దాన్ని చేరుకోడానికి ముందుగా మనలో ఏదో ఒక ప్రతిభ ఉండాలి. మెరుగులద్దుకోవాలి. మెళకువలు నేర్చుకోవాలి. మరి ఇవన్ని ఎక్కడ, ఎలా నేర్చుకోవాలి? అనేది పెద్ద ప్రశ్న. మారిన కాలం.. అందివచ్చిన సాంకేతికత.. మిమ్మల్ని ఆ దిశగా నడిచేందుకు ఉపకరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక నిమిషం నిడివున్న రీల్స్‌ నుంచి.. 5, 10 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్స్‌ దాకా.. మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడానికి వేదికలవుతున్నాయి. యూట్యూబ్‌ ప్రపంచం మీలోని టాలెంట్‌ను నలుగురికి చూపించి.. పదిమంది ప్రశంసలందించి.. ఒక్క వెండితెర అవకాశాన్ని అందిస్తుంది. మరి వీటినైనా సృజనాత్మకంగా తీయడానికి మీకు కావాల్సింది కాస్త ఓపిక. శ్రమ. వీటితోపాటు నిపుణుల ఆన్‌లైన్‌ పాఠాలు, శిక్షణ సంస్థలు ఉండనే ఉన్నాయి. కొత్త ఏడాదిలో వీటిని ఉపయోగించుకొని మీరూ వెండితెరపై స్టార్లైపోండి.

అవకాశాలు అందరివి:

నాని

"చదువుకునేటప్పుడు పాఠ్య పుస్తకాల్లో అందరికీ ఒకే సిలబస్‌ ఉంటుందేమో కానీ.. జీవితంలో అలా ఉండదు. ఒకొక్కరిది ఒక్కో రకమైన సిలబస్‌. ఎవరి శైలిలో వాళ్లు ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధిస్తుంటారు. నావరకు నేను చెప్పేది ఒక్కటే. ఏం చేసినా.. మనసుకు నచ్చిందే చేయండి. ఇష్టమైన పనినే మనం వంద శాతం మనసు పెట్టి చేస్తాం. ఆరంభంలో ఇబ్బందిగా ఉండొచ్చు కానీ, ఆ పని చేస్తే మీరు అనుకున్న స్థానానికి వెళతారు. సినీ పరిశ్రమలోనే కాదు.. ఏ రంగంలోనైనా ఎదగడానికి అవకాశాలు అందరికీ ఉన్నాయి. మనం ఎంత చిత్తశుద్ధితో కష్టపడుతున్నామనేదే కీలకం. దర్శకత్వం చేయాలని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. సహాయ దర్శకుడిగా పనిచేశా. కొన్నాళ్లు రేడియో జాకీగా చేశా. అనుకోకుండా నటుడినయ్యా. అయితే నేను నటుడిని కాక ముందే.. నాకు తెలియకుండానే నటుడికి కావల్సిన శిక్షణనంతా పూర్తి చేసినట్టు అనిపించింది. స్పష్టంగా మాట్లాడటమనేది రేడియో జాకీగా పనిచేయడంతో వచ్చింది. సహాయ దర్శకుడిగా పనిచేయడం వల్ల బెరుకు లేకుండా కెమెరా ముందుకెళ్లా. శిక్షణ తీసుకుంటారా? లేక ఏకలవ్య శిష్యుల్లాగా ఎవరినైనా స్ఫూర్తి పొంది నేర్చుకుంటారా? అనేది వేరే సంగతి. నటుడు కావాలనేదే మీ లక్ష్యం అయితే దానికోసం ఎంత తపనతో ప్రయత్నాలు చేస్తున్నారనేది కీలకం"

- నాని, ప్రముఖ కథానాయకుడు

ఒకే కథ పట్టుకుని వేలాడకండి

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ

Tollywood New: "ఎంత ప్రతిభ ఉన్నా సరే.. నాకంతా వచ్చేసిందనైతే ఎప్పుడూ అనుకోవద్దు. నేను దర్శకుడిగా ప్రయత్నిస్తున్న తొలి రోజుల నుంచి ఇప్పటి వరకు నమ్మే సూత్రం ఒకటే.. ప్రతిరోజూ కొత్తగా నేర్చుకుంటూ నిత్య విద్యార్థిలా ఉండాలి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో గొప్ప చిత్రాలొచ్చాయి. వాటన్నింటినీ చూసే ప్రయత్నం చేయండి. నిజ జీవితంలో నుంచి వచ్చే కథల్ని బయటకు తీసే ప్రయత్నం చేయండి. అలాంటి కథలు చాలా ఫ్రెష్‌గా.. ప్రభావవంతంగా ఉంటాయి. మీకు వంద కోట్ల మార్కెట్‌ ఉందనిపిస్తే.. ఆస్థాయికి తగ్గ చిత్రం చేయండి. ఒకవేళ ఆస్థాయి కథకు తగ్గ హీరో, నిర్మాత దొరకట్లేదంటే.. దాన్ని పక్కకు పెట్టి కోటి రూపాయల్లో తీయదగ్గ కథ రాసుకోండి. ఒకే స్క్రిప్ట్‌ పట్టుకుని ఎదురు చూడకండి. నేను ‘అ!’ చిత్రం అలాగే చేశా. నిజానికి నా దగ్గర అప్పటికే ఓ ముప్పై కథలున్నాయి. కానీ, అప్పటికి నేను కొత్తవాణ్ని కాబట్టి ఆ కథలకు తగ్గ బడ్జెట్‌లు పెట్టే నిర్మాతలు దొరికేవారు కాదు. దీంతో చిన్న బడ్జెట్‌లో పూర్తయ్యేలా ‘అ!’ కథ రాసుకున్నా. ఎంత ప్రయత్నిస్తున్నా.. దర్శకుడు కాలేకపోతున్నారంటే దానికి కారణం మీరే. ఆ లోపమేంటో తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి".

- దర్శకుడు ప్రశాంత్‌ వర్మ

లక్ష్య సాధనలో.. ఓర్పు అవసరం

దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి
Tollywood Acting Auditions:"నే ను ఆస్ట్రేలియాలో ఫిల్మ్‌ మేకింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశా. నిజానికి అప్పుడు నేను ఎంబీఏ చేయాలి. సినిమాలపై ఆసక్తితో ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ పూర్తి చేశా. 2009లో హైదరాబాద్‌కు తిరిగొచ్చాక.. అసలు విషయం చెప్పా. అందరూ షాకయ్యారు. తర్వాత నేనే మెల్లగా వాళ్లను కన్విన్స్‌ చేశా. ఇక్కడికి వచ్చాకే తెలిసింది.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఎంత కష్టమో. నాకెప్పుడూ భిన్నమైన చిత్రం తీయాలని కోరిక ఉండేది. దాన్ని 'ఘాజీ' రూపంలో కార్యరూపంలోకి తీసుకురావడానికి ఐదేళ్లు పట్టింది. వాస్తవానికి నేను దీన్ని ఒక గంటన్నర నిడివి ఉండే సినిమాగా తీద్దామనుకున్నా. అన్నీ కలిసొస్తే వెండితెరపై లేదంటే యూట్యూబ్‌లో విడుదల చేద్దామనుకున్నా. రూ.25లక్షల సొంత ఖర్చుతో ఓ సబ్‌మెరైన్‌ సెట్‌ వేసుకొని చిత్రీకరణ ప్రారంభించా. కానీ, ఆ డబ్బులు ఏ మూలకీ సరిపోలేదు. దీంతో లాభం లేదనుకుని నిర్మాతల చుట్టూ తిరగడం మొదలు పెట్టా. సబ్‌మెరైన్‌ నేపథ్యంలో సాగే కథనేసరికి చాలా మంది ఆసక్తి చూపించలేదు. ఆఖరికి నా ప్రయత్నాలు ఫలించి మ్యాట్నీ సినిమా సంస్థ నిరంజన్‌ గారికి కథ నచ్చడం.. ఆయన ద్వారా హీరో రానా కథలోకి రావడంతో నా కష్టాలు తీరిపోయాయి. దాంతో నా యూట్యూబ్‌ స్టోరీ కాస్తా వెండితెరపైకి వెళ్లింది. 2016లో చిత్రీకరణ ప్రారంభించి.. 60రోజుల్లోనే హిందీ, తెలుగు భాషల్లో సినిమాని పూర్తి చేశా. ఇది 2017లో విడుదలై ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు తొలి ప్రయత్నంలోనే నాకు జాతీయ అవార్డును అందించింది. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి నేను చెప్పేది ఒక్కటే. ఇక్కడ నిలబడాలంటే ప్రతిభతో పాటు చాలా సహనం, ఓర్పు కావాలి".

- దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి

అవకాశం రాలేదని ఆగిపోకూడదు

కార్తీక్‌ ఘట్టమనేని
Auditions For Acting In Hyderabad: "చిన్నప్పటి నుంచీ విజువల్స్‌ నన్ను బాగా కదిలించేవి. ఫొటో, పెయింటింగ్‌, వీడియో.. ఆసక్తిగా అనిపించిందంటే దానిపై దృష్టి మళ్లేది. వాటి వెనక నాకంటూ ఓ ప్రత్యేకమైన కథ కనిపించేది. ఓ బొమ్మతో కథ చెప్పొచ్చనే విషయం అప్పుడే నాకు అర్థమైంది. అలా చెప్పాలనే ఆ ఆసక్తే నన్ను ఛాయాగ్రాహకుడిని చేసిందేమో! నాకున్న ఆసక్తితో ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు కొన్ని లఘు చిత్రాలు చేశా. వాటికి పురస్కారాలొచ్చాయి. ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగం చేయాలనే ఆలోచనని పక్కనపెట్టి నా అభిరుచిని, నా ఆసక్తిని ఇంట్లోవాళ్లకి చెప్పి చెన్నైలోని మైండ్‌ స్క్రీన్‌ అనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. ఒక ఏడాది ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళితే వచ్చేది కాదు సినిమాటోగ్రఫీ. ప్రముఖ ఛాయగ్రాహకుడు అశోక్‌ మెహతా ఎక్కడా చదువుకోలేదు. ఓ కథని, ఓ దృశ్యాన్ని సృజనాత్మకంగా చూసే కోణం స్వాభావికంగా మనలో ఉండాలి. కాకపోతే ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతని అర్థం చేసుకోవడానికి చదువుకోవడం కొంచెం ఉపయోగపడుతుంది. సినిమాటోగ్రఫీ చదువుకోవడానికి ఎఫ్‌.టి.ఐ పుణె మొదలుకొని.. కోల్‌కతాలోని సత్యజిత్‌ రే, చెన్నైలో ఎల్వీ ప్రసాద్‌, మైండ్‌ స్క్రీన్‌ వరకు చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ కొన్ని ఉన్నాయి. ఎఫ్‌.టి.ఐ పుణెలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్స్‌ చెబుతున్నారు. అది నాలుగేళ్లు పడుతుంది. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంటుంది. నేను ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బయటికొచ్చాక 'ఇన్ఫినిటీ' అనే ఓ లఘు చిత్రాన్ని తీశా. అది చూసి బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ట్వీట్‌ చేశారు. అదే సమయంలో చందు మొండేటి, పవన్‌ సాధినేని నాకు పరిచయం కావడం, వాళ్లు అవకాశాలు ఇవ్వడంతో 'కార్తికేయ', 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' సినిమాల్ని సమాంతరంగా చేశా. 'సూర్య వర్సెస్‌ సూర్య' చిత్రానికి దర్శకత్వమూ చేశా.

- కార్తీక్‌ ఘట్టమనేని, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు

అందుబాటులో ఎన్నో వేదికలు

How to Join Film Industry in Hyderabad: చిత్రసీమలో రాణించడానికి ఫిల్మ్‌ స్కూల్‌ వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్‌లో అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా, రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌ వంటివి ఉన్నాయి. దేశంలో ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె), ఎల్వీ ప్రసాద్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ అకాడమీ (చెన్నై), ఏసియన్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ (నోయిడా), సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కోల్‌కతా) తదితర శిక్షణ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాక ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్‌ దర్శకులు, రచయితలు సామాజిక మాధ్యమాల వేదికగా ఔత్సాహికులకు సినీ పాఠాలు బోధిస్తున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు తన సినీ అనుభవాల్ని.. దర్శకత్వ మెళకువల్ని ‘సౌందర్య లహరి’ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈటీవీ రూపొందించిన ఈ భాగాలు యూట్యూబ్‌లో ఉన్నాయి. దర్శకేంద్రుడు ‘కేఆర్‌ఆర్‌ క్లాసస్‌’ పేరుతో యూట్యూబ్‌లో ప్రత్యేకంగా స్క్రీన్‌ప్లే పాఠాలు చెబుతున్నారు. ఇవికాక.. హాలీవుడ్‌ నుంచి ఆన్‌లైన్‌లో చాలా కోర్సులు నడుస్తున్నాయి.

ఇదీ చదవండి:

జ్వరం కావాలని బేబమ్మను అడిగేసిన హైపర్ ఆది

ఫ్యాన్స్​కు పండగే.. 'ఆర్ఆర్ఆర్' నుంచి మరో సాంగ్ రిలీజ్

Last Updated : Jan 1, 2022, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details