తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విప్లవ కథాంశాలతో సిద్ధమవుతున్న అగ్రహీరోలు - chiranjeevi news

విప్లవ, పోరాట నేపథ్య చిత్రాలకు తెలుగు తెరపై ఓ ప్రత్యేక స్థానం ఉంది. 'మా భూమి', 'యువతరం కదిలింది', 'ఎర్ర సైన్యం', 'ఒసేయ్‌ రాములమ్మ', 'శ్రీరాములయ్య'.. ఇలా విప్లవ నేపథ్యంతో తెరకెక్కి బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఓ తరంలో తెలుగు చిత్రసీమకు సరికొత్త కమర్షియల్‌ సూత్రంగా మారిన ఈ జోనర్‌.. ఆ తర్వాతి కాలంలో ట్రెండీ కథల జోరుతో ప్రభ కోల్పోయింది. అడపాదడపా రెండు మూడు చిత్రాలు ఈ తరహా కథాంశాలతో వచ్చినా.. అగ్ర కథానాయకులు ఎవరూ ఈ జోనర్‌తో ప్రయోగాలు చేసింది లేదు. కానీ, ఇప్పుడు పలువురు అగ్ర హీరోలు ఈ పోరు బాటలో నడుస్తూ.. బాక్సాఫీస్‌ బరిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Tollywood star heroes preparing with revolutionary stories on the silver screen
విప్లవ కథాంశాలతో సిద్ధమవుతున్న అగ్రహీరోలు

By

Published : Sep 16, 2020, 6:59 AM IST

ప్రజా పోరాటాలే ఇతివృత్తంగా వచ్చిన ఏ కథాంశాలైనా విప్లవ నేపథ్య చిత్రాలుగా చెప్పొచ్చు. వెండితెరపై ప్రజా సమస్యలకు గొంతుకగా నిలిచిన ఇలాంటి వాటికి సినీప్రియుల మదిలో ఓ ప్రత్యేక స్థానముంది. ఈ తరహా సినిమాతోనే ప్రేక్షకుల మదిలో పీపుల్స్‌ స్టార్‌గా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు నటుడు, దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి. ఆయన కన్నా ముందు అనేక మంది దర్శక నిర్మాతలు ఈ తరహా చిత్రాలతో వెండితెరపై సందడి చేసినా.. ఈ జోనర్‌కు గొప్ప క్రేజ్‌ తెచ్చిపెట్టింది మాత్రం నారాయణమూర్తే. ఒక తరంలో తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఈ తరహా కథాంశాలకు తర్వాతి కాలంలో ఆదరణ తగ్గింది. అడపాదడపా 'దళం', 'విరోధి', 'జార్జి రెడ్డి' లాంటి చిన్న చిత్రాలు తెరపైకి వచ్చినా.. పెద్ద హీరోలు ఈ జోనర్‌లో ప్రయోగాలు చేసింది తక్కువే.

అగ్ర దర్శకులు త్రివిక్రమ్‌ 'జల్సా'తో, క్రిష్‌.. 'గమ్యం' చిత్రాలతో ఈ తరహా జోనర్‌ను టచ్‌ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడిన్నాళ్లకు చిరంజీవి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రానా లాంటి వారు ఈ పోరు బాటలోనే హీరోయిజం చూపేందుకు సిద్ధమయ్యారు.

రామ్​ చరణ్​, చిరంజీవి
  • ప్రస్తుతం చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ ఉంది. 'ధర్మస్థలిలో ధర్మం కోసం ఓ కామ్రేడ్‌ చేసిన అన్వేషణ'గా ఈ చిత్ర కథాంశం ఉండబోతుంది. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లోనూ ఆయన్ని ఓ విప్లవ నాయకుడి తరహాలోనే చూపించారు. ఈ చిత్ర ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ ఓ మాజీ నక్సలైట్‌గా కీలక పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది వేసవికి రానుంది.
    రానా దగ్గుబాటి, ఎన్టీఆర్​
  • 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఊడుగుల. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న 'విరాటపర్వం'లోనూ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ కనిపించబోతుంది. రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రియమణి, నందితాదాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంట్లో రానా, ప్రియమణి నక్సలైట్లుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.

వీళ్లదీ పోరు బాటే.. కానీ!

ప్రస్తుతం చిరు, రానాలతో పాటు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లూ విప్లవ శంఖం పూరించబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో స్వాతంత్రోద్యమ నేపథ్యం కనిపించనుంది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఓ ఫిక్షనల్‌ కథాంశంతో.. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంట్లో అల్లూరిగా చరణ్‌ కనిపిస్తుండగా.. భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ దర్శనమివ్వబోతున్నారు. విభిన్న ప్రాంతాల్లో పుట్టిపెరిగిన ఈ విప్లవ వీరులిద్దరూ స్వాతంత్రోద్యమంలో ఎలా భాగం అయ్యారన్నది దీంట్లో చూపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 70 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details