తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒళ్లంత.. థ్రిల్లింత.. కావాలిలే! - నిఖిల్ థ్రిల్లర్

థ్రిల్లర్ సినిమాలకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. థియేటర్​ అయినా ఓటీటీ అయిన ఇటువంటి కంటెంట్​కు ప్రేక్షకాదరణ మెండుగా లభిస్తోంది. అయితే ఇన్నిరోజులు ఇలాంటి కథలు చిన్న హీరోలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అగ్రహీరోలూ థ్రిల్లర్​ బాట పడుతున్నారు. మరి వారెవరు? వారి సినిమాల విశేషాలేమిటి? చూసేద్దామా!

thrillers
థ్రిల్లర్స్

By

Published : Jun 4, 2021, 7:32 AM IST

సినీప్రియుల్లో థ్రిల్లర్‌ చిత్రాలకున్న క్రేజ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. కొన్నేళ్లుగా వెండితెరపై ఈ జానర్‌ హవానే ఎక్కువ కనిపిస్తోంది. అయితే థ్రిల్లర్‌ కథలకు ఎంతటి ఆదరణ ఉన్నా.. వీటితో అగ్ర కథానాయకులు ప్రయోగాలు చేయడం చాలా అరుదుగా కనిపించేది. ఈ తరహా కథలన్నీ ఎక్కువగా చిన్న సినిమాలకే పరిమితమవుతుండేవి. ఇప్పుడీ పద్ధతిలో మార్పొచ్చింది. అగ్ర హీరోలూ తమ చిత్రాల్లో థ్రిల్‌ ఉండాలని కోరుకుంటున్నారు. కథకు కొత్త హంగులు అద్దడంలోనూ.. దాన్ని తెరపై ఆసక్తికరంగా వడ్డించడంలోనూ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌కి చోటిస్తున్నారు. తమదైన శైలి మాస్‌ మసాల అంశాలు జోడించి మరీ.. సినీప్రియులకు విభిన్న రకాలైన థ్రిల్లర్లు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మరి వారెవరు? వారి సినిమాల విశేషాలేమిటి? చూసేద్దాం పదండి..

నాగ్​ 'రా' థ్రిల్

నాగార్జున

వైవిధ్యభరిత కథలతో వెండితెరపై ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు నాగార్జున. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో థ్రిల్లర్ల వైపు దృష్టి సారించారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుతో చేస్తున్న కొత్త సినిమాతో థ్రిల్లింగ్‌ కథాంశాన్నే రుచి చూపించనున్నారు. ఇదొక అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ కథాంశంతో రూపొందుతోంది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రంలో నాగార్జున 'రా' ఏజెంట్‌గా దర్శనమివ్వనున్నారు. ఆయనకు జోడీగా నటిస్తున్న కాజల్‌ 'రా' అధికారిణిగానే కనిపించనుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుంది.

సైకో థ్రిల్లర్​ 'ఖిలాడీ'తో రవితేజ

రవితేజ

కథానాయకుడు రవితేజ థ్రిల్లర్‌ జానర్‌లో ప్రయోగాలు చేసింది చాలా తక్కువే. ఇప్పుడీ లోటును 'ఖిలాడీ' సినిమాతో కాస్త పూడ్చనున్నారు. 'రాక్షసుడు' లాంటి విజయవంతమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ తర్వాత రమేష్‌ వర్మ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రమిది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సైకో కిల్లర్‌గా నెగిటివ్‌ పాత్రలో కనిపిస్తారని సమాచారం. మేలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా పరిస్థితులతో వాయిదా పడింది.

వెంకీ ఫ్యామిలీ థ్రిల్లర్

వెంకటేష్

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశాన్ని.. కుటుంబ కథతో మిళితం చేసి బాక్సాఫీస్‌ షేక్‌ చేయొచ్చని నిరూపించిన చిత్రం 'దృశ్యం'. మలయాళంలో విజయవంతమైన దీన్ని హీరో వెంకటేష్‌ తెలుగులో చేసి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి కొనసాగింపుగా ఇటీవలే 'దృశ్యం 2' వచ్చింది. ఇదీ విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇప్పుడు తెలుగులోనూ ఈ కొనసాగింపు చిత్రాన్ని పునర్నిర్మిస్తున్నారు. తొలి భాగంలో నటించిన వెంకటేష్‌, మీనాల జోడీనే ఇందులోనూ కనిపించనుంది. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్ నేచురల్ థ్రిల్లర్​లో నాని

నాని

యంగ్‌.. థ్రిల్లింగ్‌... వైవిధ్యమైన కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో నాని. ఇప్పుడాయన 'శ్యామ్‌ సింగరాయ్‌'తో ఓ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశాన్ని ప్రేక్షకులకు రుచి చూపించనున్నారు. 'టాక్సీవాలా'తో ఆకట్టుకున్న రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. పునర్జన్మల అంశంతో పాటు పలు థ్రిల్లింగ్‌ విషయాలు ఈకథలో ఉన్నాయట.

డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్​తో నితిన్

నితిన్

ఇన్నాళ్లు ప్రేమకథలతో అలరించిన కథానాయకుడు నితిన్‌.. ఇప్పుడు 'మాస్ట్రో'తో థ్రిల్లర్‌ బాట పట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇదొక డార్క్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌. బాలీవుడ్‌లో విజయవంతమైన 'అంధాధున్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోంది.

మిస్టరీ థ్రిల్లర్​తో నిఖిల్

నిఖిల్

'స్వామి రారా', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'కార్తికేయ' లాంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు నిఖిల్‌. ఇప్పుడాయన తన మిస్టరీ థ్రిల్లర్‌ 'కార్తికేయ'కు కొనసాగింపుగా 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నారు. తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ చిత్రం కొనసాగనున్నట్లు సమాచారం. దీంట్లో తొలి పార్ట్‌ను మించిన థ్రిల్లింగ్‌ అంశాలు కనిపిస్తాయని దర్శకుడు చందు మొండేటి ప్రకటించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్పై, క్రైమ్ థ్రిల్లర్​తో శేష్​

అడివి శేష్

'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' లాంటి చిత్రాలతో థ్రిల్లర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు హీరో అడివి శేష్‌. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబు నిర్మాణంలో 'మేజర్‌' సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక ఆయన నుంచి రానున్న రెండు చిత్రాలు థ్రిల్లర్‌ జానర్‌లోనే ఉండనున్నాయి. వాటిలో ఒకటి శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న 'హిట్‌ 2' కాగా.. మరొకటి రాహుల్‌ పాకాల రూపొందించనున్న స్పై థ్రిల్లర్‌ 'గూఢచారి 2'.

ఇవీ చూడండి: మళ్లీ వస్తా.. మల్లికనై పూస్తా!

ABOUT THE AUTHOR

...view details