"మళ్లీ నేను సినిమా తీస్తే పాటలు ఎవరు పాడతారనిపించేంత లోటుని సృష్టించిన మహా వ్యక్తి బాల సుబ్రహ్మణ్యం (Bala Subramaniam). ఆయనొక కారణజన్ముడు, అమరగాయకుడు" అన్నారు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్. శుక్రవారం బాలు జయంతి (Bala Subramaniam Jayanthi). ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో 'ఎస్పీ బాలుకు స్వర నీరాజనం' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. 12 గంటలపాటు ఆన్‌లైన్‌లో సాగిన ఆ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు బాలు కీర్తిని కొనియాడుతూ, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గాయనీ గాయకులు బాలుకు నివాళులర్పిస్తూ రాగాలాపన చేశారు. ఈ సందర్భంగా కె. విశ్వనాథ్ మాట్లాడుతూ బాలు గురించి ఎంత చెప్పుకొన్నా తనివి తీరదన్నారు.
కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ "బాలు అన్నయ్యతో 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. కుటుంబం, సినిమా పరంగా బాగా దగ్గరగా ఉండేవాళ్లం. నా సినిమాలకి పాటలు పాడాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆయన గాత్రానికి నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసేందుకు చాలా కష్టపడ్డా. నా విజయంలో ఆయనకి సగభాగం ఇస్తా" అన్నారు.
SP Balu: బ్రహ్మ, మురారీ.. బాలు 'స్వరార్చితం'
దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ "పాటకి పల్లవి ప్రాణం అంటారు. కానీ నా దృష్టిలో బాలు గాత్రమే పాటకి, పల్లవికి ప్రాణం. మా ఇద్దరిదీ యాభయ్యేళ్ల అనుబంధం. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు" అన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) మాట్లాడుతూ "ఆఖరి క్షణాల వరకు పాడుతూనే ఉన్నారు బాలు. దక్షిణాదిలో ఇప్పుడు పాడుతున్నవాళ్లల్లో 60 శాతం మంది ఆయన దగ్గరి నుంచి వచ్చినవారే. ఆయన గెలవడమే కాదు.. తర్వాతి తరాల్నీ గెలిపించారు" అన్నారు.