తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలనిజం, హాస్యానికి కేరాఫ్​ అడ్రస్​ జయప్రకాశ్​ రెడ్డి - జయప్రకాశ్​ రెడ్డి మృతి

సీనియర్​ నటుడు జయప్రకాశ్​ రెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుంటూరులోని ఆయన నివాసంలో గుండెపోటుతో స్నానాలగదిలోనే కుప్పకూలిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Tollywood Senior Actor Jayapraksh Reddy Died
విలనిజం, హాస్యానికి కేరాఫ్​ అడ్రస్​ జయప్రకాశ్​ రెడ్డి..

By

Published : Sep 8, 2020, 9:00 AM IST

Updated : Sep 8, 2020, 11:16 AM IST

రాయలసీమ యాసలో ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా తనదైన ముద్రవేసిన నటుడు జయప్రకాశ్‌రెడ్డి (73) ఇకలేరు. లాక్‌డౌన్‌ నాటి నుంచి ఇంట్లోనే ఉంటోన్న ఆయన.. ఇవాళ ఉదయం గుంటూరులో కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

దాసరి శిష్యుడు..

జయప్రకాశ్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్లలో 1946 మే 8న జన్మించారు జయప్రకాశ్​ రెడ్డి. రంగస్థల నటుడిగా ఎంతో పేరున్న జయప్రకాశ్​.. నాటకాలపై అమితమైన శ్రద్ధ చూపించేవారు. ఓసారి నల్గొండలో 'గప్ చుప్' అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి సినీరంగంలోకి తీసుకొచ్చారు. అలా దాసరి దర్శకత్వంలో 1988లో విడుదలైన 'బ్రహ్మపుత్రుడు' చిత్రంతో తెలుగు సినీరంగానికి ఆయన పరిచయమయ్యారు. 1997లో 'ప్రేమించుకుందాం రా' చిత్రంలో ప్రతినాయకుడిగా మెప్పించి విశేషమైన పేరుతెచ్చుకున్నారు.

ఉత్తమ విలన్​గా నంది...

బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' లాంటి విజయవంతమైన చిత్రాల్లో తన విలనిజం‌తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు జయప్రకాశ్. ఆ తర్వాత 2000లో విడుదలైన 'జయం మనదేరా' చిత్రానికి ఉత్తమ విలన్​గా నంది అవార్డు లభించింది.

జయప్రకాశ్​ రెడ్డి

వందకుపైగా చిత్రాలు...

విజయరామరాజు, చెన్న కేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్‌, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్‌షా, రేసు గుర్రం, మనం, పటాస్‌, టెంపర్‌, సరైనోడు, ఖైదీ నంబర్‌ 150, జై సింహా, రాజా దిగ్రేట్‌ తదితర చిత్రాలు నటించారు. చివరిగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో కనువిందు చేశారు జయప్రకాశ్​ రెడ్డి. అలా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు.

నాటకరంగంపై మక్కువతో గుంటూరు వచ్చి.. వేంకటేశ్వర విజ్ఞానమందిరంలో అనేక నాటకాల్లో భాగమయ్యారు. ప్రతివారం జరిగే నాటకాల ప్రదర్శనలో పాల్గొనే జయప్రకాశ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల.. పలువురు సినీ, నాటకరంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Last Updated : Sep 8, 2020, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details