తెలుగు సినిమా కథలు కరోనాను ఖాతరు చేయడం లేదు. పరిస్థితులు భయపెడుతున్నా సరే... ఫ్లైట్ ఎక్కేయాల్సిందే అంటున్నాయి. మొన్నటివరకు విదేశాల్లో చిత్రీకరణలు కష్టమే అనుకున్నారంతా. కానీ మన కథలు అస్సలు రాజీ పడటం లేదు. విదేశాల్లో చిత్రీకరణలు లేకుండా రూపొందే తెలుగు సినిమాలు చాలా అరుదు. ఒకట్రెండు పాటల కోసమైనా అక్కడికెళ్లి క్లాప్ కొడుతుంటారు. ఇక ఆ నేపథ్యంలోనే సాగే సినిమాలైతే నెలలపాటు అక్కడే చిత్రీకరణలు జరుపుకొంటుంటాయి. అలాంటి కథలకు వైరస్ దెబ్బతో కష్టకాలమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా పరిస్థితులకు ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా అలవాటుపడుతోంది. దాంతో చిత్రబృందాలు మళ్లీ చలో అంటూ రెక్కలు కట్టుకుని ఎగిరి పోతున్నాయి.
విదేశాల్లో షూటింగ్‌కు తెలుగు సినిమాలు సై
కరోనా ప్రభావమున్నప్పటికీ విదేశాల్లో చిత్రీకరణ జరిపేందుకు తెలుగు సినిమా బృందాలు సై అంటున్నాయి. త్వరలో విమానమెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.
నిన్న మొన్నటివరకు కరోనా ఉద్ధృతి చూసి విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న చిత్రబృందాలు చాలా ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు అక్కడికి వెళ్లినవాళ్లు కూడా వెంటనే తిరిగొచ్చేశారు. ఎంతకూ కరోనా తీవ్రత తగ్గే పరిస్థితులు కనిపించకపోవడం వల్ల.. విదేశీ నేపథ్యంలో సాగే సినిమాలన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. విదేశాల తరహాలోనే కొన్ని సెట్స్ వేసి ఇక్కడే చిత్రీకరణ పూర్తి చేయాలనుకున్నాయి. ప్రభాస్ 'రాధేశ్యామ్' బృందం అదే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో యూరప్‌ను పోలిన వీధులు, ఆస్పత్రి సెట్స్ పనుల్ని మొదలు పెట్టింది. ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయినా ప్రభాస్ మాత్రం సెట్స్‌లోకి దిగకుండా విమానమెక్కేశారు. 'రాధేశ్యామ్' బృందం ఇటలీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్లిపోయింది. సన్నివేశాల్లో సహజత్వం కనిపించాలంటే అక్కడ చిత్రీకరణ జరపాల్సిందే అని చిత్ర బృందాలు నమ్ముతున్నాయి.
- మహేశ్ బాబు 'సర్కార్ వారి పాట' అమెరికా నేపథ్యంలో సాగే కథే. అందుకే నవంబర్‌లో ఫ్లైట్ ఎక్కేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు మహేశ్. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్, ఆయన బృందం అమెరికాలో లొకేషన్ల వేటలో ఉంది. కరోనా ఉద్ధృతి ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరపడానికి ఆయా బృందాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
- విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ తీస్తున్న 'ఫైటర్' విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. సినిమాలో విదేశీ ఫైటర్లతో తలపడే సన్నివేశాలు ఉంటాయట. వాటిని తెరకెక్కించేందుకు పూరీ.. అక్కడే చిత్రీకరణ జరపాలని నిర్ణయించారంటున్నాయి సినీ వర్గాలు.
- నితిన్ 'రంగ్‌దే' త్వరలోనే ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనున్నదని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఆ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. హిందీ, తమిళ చిత్రబృందాలు విరివిగా విదేశీ షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటున్నాయి.
- బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, ఇటీవలే 'బెల్ బాటమ్' కోసం స్కాట్లాండ్ వెళ్లి విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చారు. దాంతో మిగతా పరిశ్రమలన్నీ మునుపటిలాగా విదేశాల్లో చిత్రీకరణల కోసం ప్రణాళికలు రచించుకుంటున్నాయి.