టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి - ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత
08:26 September 27
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ పలు చిత్రాలు నిర్మించారు. జగపతిబాబుతో 'సామాన్యుడు', ఎన్టీఆర్‌తో 'ఆంధ్రావాలా', నాగార్జునతో 'ఢమరుకం', మహేశ్ బాబుతో 'బిజినెస్ మెన్', రవితేజతో 'డాన్ శ్రీను', 'మిరపకాయ్', 'కిక్', నానితో 'పైసా', నాగచైతన్యతో 'ఆటోనగర్ సూర్య', ఆదిసాయికుమార్ తో 'లవ్లీ', 'ప్రేమకావాలి' చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతల్లో ఒకరయ్యారు.
అంతేకాకుండా ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'మావిడాకులు' చిత్రాన్ని 2012లో హాలీవుడ్ లో 'డివోర్స్ ఇన్విటేషన్' పేరుతో పునర్నిర్మించారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా, సామాజిక సేవ కార్యకర్తగా సేవలందించిన వెంకట్‌ను 'యూనివర్సీటీ ఆఫ్ కొలంబో' గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.