Tollywood Pan India Movies: నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా.. ఇప్పుడీ పాట తెలుగు సినిమా పరిశ్రమకి సరిగ్గా సరిపోతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కచ్‌నుంచి కోల్‌కతా వరకూ డిసెంబరు చలిలోనూ సినిమా ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది 'పుష్ప'. శ్రీవల్లీ పుష్పరాజ్‌లను చూసి పంజాబీ సోదరులు 'సామీ సామీ...' అంటూ భాంగ్రా ఆడేస్తున్నారు. మరాఠీ ప్రేక్షకులు 'మన్ ఫూలా ఫూలా ఫిరే' అంటూ మైమరిచిపోతున్నారు. ఆ జోరూ హుషారూ తగ్గక ముందే మీసం మెలేస్తూ వచ్చిన బెంగాలీ బాబు 'శ్యామ్ సింగరాయ్' పునర్జన్మ కథ చెబితే కళ్లు విప్పార్చుకుని చూసింది దేశం. బెంగాలీ వనితగా సాయిపల్లవీ, అందమైన నవ్వుతో కృతి శెట్టీ చేసిన మ్యాజిక్ అందరినీ మైమరిపించింది.
Tollywood Pan India Movies: ఇక, అటు అల్లూరి... ఇటు కొమురం భీమ్. రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన ఇద్దరు యోధులతో ఏకంగా 'ప్రియభారత జనని' కోసం సాగే స్వాతంత్య్రోద్యమ నేపథ్యం... కథ ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతోందో టీజర్లూ ట్రైలర్లూ ఊరించి చూపించాయి. ఎప్పుడెప్పుడు ఈ పాటల్ని థియేటర్లో చూడగలమా అని ఎదురుచూసినవారి కోరిక తీరే సమయం వచ్చేసింది.
RRR Movie Updates: 'ఆర్ఆర్ఆర్'గా త్వరలో దేశమంతటా వెండితెరలమీద వెలిగిపోనుంది దర్శకుడు రాజమౌళి కన్న కల. యువ హీరోలిద్దర్నీ వెంటేసుకుని నగరాలన్నీ చుట్టేస్తూ ఆయన చేసిన ప్రమోషనూ, హోరెత్తిన అభిమానుల ఈలలూ, మార్కెట్‌ని ముంచెత్తిన మర్చెండైజూ.. మార్కెటింగ్ ఒక రేంజ్‌లో సాగిన సంగతి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిక సినిమా వసూళ్లకు రెండు వేల కోట్ల క్లబ్బే లక్ష్యం..! ఎక్కడా తగ్గేదే లే..!
Prabhas New Movie: ఈ సినిమాల పండుగ ఇలా హుషారుగా నడుస్తుండగానే మన సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. అసలే సంక్రాంతిదీ సినిమాదీ విడదీయరాని బంధమాయె...! ఎంతమంది చుట్టాలొచ్చినా ఎన్ని పిండివంటలతో విందుభోజనం చేసినా చివరాఖరున కొత్తగా విడుదలైన ఓ సినిమా చూసేస్తే తప్ప తృప్తిగా ఉండదు తెలుగు వాళ్లకి. ఇప్పుడా ఆనందాన్ని దేశానికంతా పంచడానికి వస్తున్నాడు 'రాధేశ్యామ్'. పాన్ ఇండియా యువ హీరోగా ప్రభాస్ ఇప్పటికే అందరికీ పరిచయం కావడమూ, అతడి పక్కన పూజాహెగ్డే హీరోయిన్‌గా ఉండడమూ ఈ సినిమా మీద అభిమానుల ఆశలను పెంచేశాయి. కుర్రకారంతా 'ఆశికీ ఆ గయీ...' అంటూ గోలపెట్టేస్తున్నారు. ప్రభాస్‌దే మరో సినిమా 'సలార్' కూడా కొద్ది నెలల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఏమిటిదంతా.. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాకుండా దేశమంతా విడుదలవడం ఏమిటీ.. భాషాప్రాంత భేదాలు లేకుండా అందరూ వాటిని ఆదరించడం ఏమిటీ అంటే- దాన్నే 'పాన్ ఇండియా మ్యాజిక్' అంటోంది సినీ పరిశ్రమ. ఆ మ్యాజిక్ ముందూ వెనకలేమిటో చూద్దామా మరి..!
అప్పుడూ ఉంది..!
మనదేశంలో ప్రధాన భాషలన్నిటికీ ఆయా రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమలు ఉన్నాయి. వాటిని ప్రాంతీయ పరిశ్రమలంటాం. మిగతావాటితో పోలిస్తే దక్షిణాది పరిశ్రమలన్నీ కాస్త పెద్దవి. అవి కాకుండా ముంబయిలో హిందీ చిత్రాలు తయారవుతాయి. హిందీ దేశభాష కాబట్టి సహజంగానే ఆ భాషా చిత్రాలకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉంటారు. అందుకే బాలీవుడ్ అన్నిటికన్నా పెద్ద పరిశ్రమ అయింది. ఇతర పరిశ్రమలపై దాని ఆధిక్యం ఉండేది. అయితే ఇరుగుపొరుగు కుటుంబాల మధ్య ఉన్నట్లే ఈ చిత్ర పరిశ్రమల మధ్య కూడా మొదటినుంచీ ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేవి. తెలుగులో హిట్టయిన సినిమాని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేయడం, ఆ భాషల్లో మంచి సినిమాలనుకున్నవాటిని తెలుగులోకి తెచ్చుకోవడం తరచూ చేసేవారు. అలాగే ఇటు పక్క నుంచి ఎందరో నటీనటులూ దర్శకులూ బాలీవుడ్‌కి వెళ్లారు. సినిమాలనూ తీసుకెళ్లారు. సువర్ణసుందరిలాంటి సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తే, రాముడు-భీముడు, మూగమనసులు లాంటి సినిమాలను రీమేక్ చేశారు. వైజయంతి మాల, వహీదా రెహ్మాన్, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి, ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే, విద్యా బాలన్ తదితర తారలంతా దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లి వెండితెరపై మెరిసినవారే. అంతెందుకు, హిందీ సినిమాని కొత్తదారి పట్టించిన గురుదత్ కన్నడిగుడే.
ఎందరో సంగీతకారులూ గాయనీగాయకులూ కూడా ఈ పరిశ్రమల మధ్య అనుబంధాల వారధి వేశారు. 'నిదురపోరా తమ్ముడా' అంటూ లతా మంగేష్కర్, 'నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై...' అంటూ మహమ్మద్ రఫీ తెలుగు పాటలు పాడినా, మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెళ్లి 'తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్' అంటూ హిందీ పాట పాడినా.. ఆ ఇచ్చిపుచ్చుకోవటాల్లో భాగమే.
ఒక భాషలో హిట్టయిన సినిమాని ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడమే కాక, చాలా బాగుందీ అనుకుంటే హక్కుల్ని కొనుక్కుని స్థానిక నటీనటులతో రీమేక్ చేసేవారు. కన్నడలో రాజ్‌కుమార్ నటించిన మహిషా సురమర్దిని(1959) సినిమాను ఆరోజుల్లోనే ఏడు భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారట. మూడు నాలుగు భాషల్లోకి డబ్ చేయడం సాధారణం. కానీ అంతకన్నా ఎక్కువ భాషల్లోకి అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. అలా మళ్లీ 2005లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని తొమ్మిది ఇతర భాషల్లో పునర్నిర్మించారట. హిందీలో వచ్చిన మైనే ప్యార్‌కియా, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి చిత్రాలను తెలుగులోకి డబ్ చేసినా ఒరిజినల్ చిత్రానికి వచ్చిన ఆదరణ డబ్బింగ్ చిత్రాలకు రాలేదు. 'రోబో' లాంటి చిత్రాలను ఒరిజినల్ చిత్రంతోపాటు ఒకేసారి ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. రజినీకాంత్, కమల్‌హాసన్ లాంటి నటుల చిత్రాలను హిందీలో డబ్బింగ్ చేసినా రీమేక్ చేసినా దేశమంతటా ఆదరణ ఉండేది. దక్షిణాది నుంచి తొలి పాన్ ఇండియా నటుడిగా చెప్పాలంటే రజినీకాంత్‌నే చెప్పాలి. ఆయన సినిమాలను భాషతో సంబంధం లేకుండా దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఎక్కువగా చూసేవారు. క్రమంగా కళాకారులు పరిశ్రమల పరిధులు దాటి చేయీ చేయీ కలిపి పనిచేయడం పెరిగింది. రజినీకాంత్, కమల్‌హాసన్‌ల తర్వాత చిరంజీవి, నాగార్జున, ప్రభుదేవా, ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనె, కాజోల్, టబు, రవీనా... లాంటివాళ్లు వేర్వేరు భాషల చిత్రాల్లో కలిసి నటించారు. కన్నడ, తమిళ నటులు తెలుగులో నటించడం, తెలుగు కథానాయికలు పలువురు తమిళంలో మలయాళంలో నటించడం మామూలు విషయమైంది.
ఇటు నుంచి అటు...
చాలాకాలం పాటు దక్షిణాది సినిమాలు ఇతర దక్షిణాది భాషల్లోకీ, హిందీ సినిమాలూ దక్షిణాది భాషల్లోకే డబ్ అవుతూ రాగా 2010 తర్వాత ట్రెండ్ మారింది. దక్షిణాది చిత్రాలను హిందీలోకి డబ్ చేయడం బాగా పెరిగింది. ప్రత్యేకించి తమిళ, తెలుగు సినిమాలు దాదాపుగా అన్నీ విడుదలైన వెంటనే అటు హిందీలోకీ వెళ్లడం, ఆదరణ పొందడం మొదలైంది. ఈ ట్రెండ్ ఇలా కొనసాగుతున్నప్పుడే 2015లో 'బాహుబలి' సినిమా వచ్చి ఒకే సమయంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమై హిందీలోనూ డబ్బింగ్ పూర్తిచేసుకుని దేశవ్యాప్తంగా విడుదలైంది. 180 కోట్లతో తయారై ఏకంగా 650 కోట్లు సంపాదించిన ఈ సినిమా మొత్తం దేశం దృష్టిని తెలుగు చిత్రసీమవైపు మళ్లించింది. రెండేళ్ల తర్వాత వచ్చిన దాని రెండోభాగం మరో మెట్టు పైకి ఎక్కి ఏకంగా 1500 కోట్ల వసూళ్లు దాటింది. ఆ ఏడాది అది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది. మొత్తంగా చిత్రసీమని బాహుబలికి ముందు- తర్వాత అన్న రెండు దశలుగా చెప్పుకునేలా చేశాయి ఈ సినిమాలు. వీటితో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ కథానాయకుడిగా ఆ తర్వాత వచ్చిన 'సాహో' వాణిజ్యపరంగానూ మంచి విజయం సాధించింది. దక్షిణాదిన మిగతా పరిశ్రమలతో పోలిస్తే కన్నడ చిత్రపరిశ్రమలో కొంచెం హడావుడి తక్కువ. అలాంటిది 2018లో ఆ చిత్రసీమ నుంచి వచ్చిన కేజీఎఫ్ చాప్టర్-1 దేశవ్యాప్తంగా మరో సంచలనమైంది. ఇప్పుడు 'రాకీ భాయ్' యశ్ అభిమానుల కోసం కేజీఎఫ్-2 సిద్ధమవుతోంది.
బాహుబలి, కేజీఎఫ్, సాహో చిత్రాల అనూహ్య విజయం మొత్తంగా దక్షిణాది చిత్రపరిశ్రమ హోదానే పెంచేసింది. పాన్ ఇండియా అన్నమాటను అందరికీ చేరువ చేసింది. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తయారై విడుదలయ్యే సినిమాను పాన్ ఇండియా సినిమాగా వ్యవహరించడం మామూలయ్యింది. ఆ మధ్యకాలంలోనే వచ్చిన రజినీకాంత్ తమిళ సినిమా 'రోబో 2.0', ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటించిన తెలుగు సినిమా 'సైరా'లను కూడా దక్షిణాది భాషలతో పాటు హిందీలోకీ డబ్చేసి ఒకేసారి విడుదల చేశారు. అయితే ఇలా ఒకేసారి అన్ని భాషల్లో సినిమాని విడుదల చేస్తే అది పాన్ ఇండియా సినిమా అయిపోతుందా అంటే- కాదనే చెప్పాలి.