కరోనా దెబ్బకు కొన్నాళ్లుగా కళ తప్పిన చిత్రసీమలో ఇప్పుడిప్పుడే నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన సినీతారలు.. ధైర్యంగా సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే వెండితెరపై తమ యాక్షన్ హంగామాతో అలరించేందుకు చిత్రీకరణలకు సై అంటున్నారు. ఇప్పటికే యశ్ 'కేజీఎఫ్ 2', నాగార్జున 'వైల్డ్‌డాగ్', సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటరు' తదితర చిత్రాల షూటింగ్ ప్రారంభమైంది. ఈ సెప్టెంబరులోనే మరిన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ నెలలో తొలి రోజైన మంగళవారమే యువ హీరో సందీప్ కిషన్ తన రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లి సెప్టెంబరుకు స్వాగతం పలికారు. అతడు నటిస్తున్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో పాటు నిర్మాతగా చేస్తున్న 'వివాహ భోజనంబు' చిత్రీకరణ మొదలుపెట్టాయి.
ఇప్పటికే తుది దశకు చేరుకున్న నాగచైతన్య - సాయి పల్లవిల 'లవ్‌స్టోరీ' సినిమా షూటింగ్ ఈ నెల 7నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఒకే షెడ్యూల్‌లో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చైతూ తర్వాతి చిత్రం 'థ్యాంక్యూ' ఈ నెలఖారు నాటికి లాంఛనంగా ప్రారంభం కానుంది.
సినీప్రియులంతా ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రభాస్ 'రాధేశ్యామ్' సెప్టెంబరు రెండో వారం నుంచి సెట్స్‌కు తిరిగి వెళ్లనుంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ ఆస్పత్రి సెట్ సహా యూరోప్ స్ట్రీట్ సెట్‌ను సిద్ధం చేశారు. ఈ సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయ్యాకా చిత్ర బృందం మరోసారి ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
- 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రంతో, ఈ లాక్‌డౌన్‌లోనే ఓటీటీ వేదికగా చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు సత్యదేవ్. ఆయన హీరోగా తమన్నాతో చేస్తున్న 'గుర్తుందా శీతాకాలం' షూటింగ్.. ఈనెల రెండో వారం నుంచే మొదలుకానుందట.
- గోపీచంద్ - సంపత్ నంది 'సీటీమార్'.. ఈనెల మూడో వారం నుంచి తిరిగి కూతకు రానున్నట్లు తెలుస్తోంది. సంపత్ కథతో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో రూపొందనున్న కొత్త సినిమా ఈనెలలోనే ప్రారంభం కానుందట. ఈ చిత్రంతోనే బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా తెలుగు తెరకు పరిచయమవుతోంది.
- దర్శకుడు సతీష్ వేగేశ్న కొత్త చిత్రం 'కోతికొమ్మచ్చి' ఈ నెలాఖరుకు ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనితో పాటే సెట్స్‌పైకి వెళ్లే వాటిలో పలువురు అగ్ర హీరోల చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ 'క్రాక్', నాని 'టక్ జగదీష్', అల్లు అర్జున్ 'పుష్ప' లాంటి చిత్రాలు ఉండనున్నాయని సమాచారం.
- తుదిదశ చిత్రీకరణలో ఉండి సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో దర్శకుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' ఒకటి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రం.. ఇప్పటికే 70శాతానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం తీయాల్సిన కీలక ఎపిసోడ్లకు వందల మంది సిబ్బంది అవసరం. కాబట్టి కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కాస్త ఆలస్యంగానే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు జక్కన్న. ఒకవేళ పరిస్థితులు కాస్త అనుకూలిస్తే అక్టోబరు మధ్య నుంచి పని మొదలు కానుంది.
వీరి రాక కాస్త ఆలస్యం..
- విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబోలోని పాన్ ఇండియా చిత్రం 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) కాస్త ఆలస్యంగానే సెట్స్‌పైకి వెళ్లనుంది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కథతో దీనిని రూపొందిస్తున్నారు. ముంబయితో పాటు విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది. కీలక యాక్షన్ ఎపిసోడ్లలో అనేక మంది అంతర్జాతీయ ఫైటర్లు నటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి ఆ నటులు రావడం కష్టంగా ఉండటం వల్ల సినిమా ఆలస్యమవుతోంది.
- వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'నారప్ప' ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ.. మిగిలిన కీలక ఎపిసోడ్లన్నీ ఎక్కువ మంది సిబ్బంది మధ్య చిత్రీకరించాల్సినవే. అందుకే పరిస్థితులు కుదుట పడ్డాకే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు నిర్మాత సురేశ్ బాబు. ఆయనే నిర్మిస్తున్న 'విరాటపర్వం' కూడా ఇదే తరహా ఇబ్బందిని ఎదుర్కొంటోంది.
- బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' తుది దశలో ఉంది. చిత్రీకరించాల్సి ఉన్న పాటల కోసం భారీ సెట్స్ రూపొందించాల్సి ఉంది. అందుకే ఈ పనులన్నీ పూర్తి చేసి, అక్టోబరులోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది.
- వరుణ్ తేజ్ నటిస్తోన్న బాక్సింగ్ నేపథ్య చిత్రం.. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో తీస్తున్న కొత్త చిత్రం అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి 'ఆచార్య', పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రాలు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయనేది స్పష్టత రావాల్సి ఉంది.