Tollywood Old Heroines Reentry in 2022: విరామాలు.. రీఎంట్రీలు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. తెరపై తళుక్కున మెరిసి.. వరుస విజయాలతో మెరుపులు మెరిపించి.. స్టార్లుగా నీరాజనాలు పొంది.. ఆ తర్వాత పరాజయాలతోనో.. వ్యక్తిగత కారణాల వల్లో చిత్రసీమకు దూరమైన తారలు అనేకమంది. గతంలో అలా ప్రేక్షకులను అలరించి తెరమరుగైన పలువురు సీనియర్ నాయికలు.. ఇప్పుడు మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో మురిపిస్తామంటూ. వెండితెరపైకి దూసుకొస్తున్నారు. ఇటీవల విడుదలైన 'రాధేశ్యామ్'లో భాగ్యశ్రీ అలా మెరిశారు. మరికొందరు సిద్ధమవుతున్నారు.
అనురాగాల అమ్మగా..
Akkineni Amala Sarvanand movie: ‘పుష్పక విమానం’, ‘శివ’, ‘నిర్ణయం’ వంటి పలు విజయ వంతమైన చిత్రాలతో దక్షిణాదిలో స్టార్ నాయికగా మెరుపులు మెరిపించారు అక్కినేని అమల. నాగార్జునతో పెళ్లి తర్వాత విరామం తీసుకున్న ఆమె... 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో హీరో తల్లిగా ఆమె కనబరిచిన అభినయం సినీప్రియుల మదిని తడి చేసింది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో జోరు చూపిస్తారని భావించినా.. మళ్లీ తెరపై కనిపించలేదు. ‘మనం’ క్లైమాక్స్‌లో అతిథి పాత్రలో అలా తళుక్కున మెరిసి మాయమయ్యారు. ఇప్పుడామె పదేళ్ల విరామం తర్వాత ‘ఒకే ఒక జీవితం’ కోసం మరోసారి ముఖానికి రంగేసుకున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీకార్తీక్ తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో శర్వాకు తల్లిగా నటించారు అమల. తల్లీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘విరాటపర్వం’తో ఆ ఇద్దరూ..
Rana Virataparvam Nandita das: ‘అమర ప్రేమ’, ‘హేమా హేమీలు’, ‘రక్తచరిత్ర’ చిత్రాలతో జరీనా వహాబ్.. ‘కమ్లీ’ సినిమాతో నందితా దాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ నాయికలుగా మెరిపించిన ఈ ఇద్దరూ.. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ‘విరాటపర్వం’తో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. వేణు ఊడుగుల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సురేష్‌బాబు సమర్పిస్తున్నారు. ప్రియమణి, నవీన్‌చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నక్సలిజం నేపథ్యంతో అల్లుకున్న ప్రేమకథతో రూపొందింది. మహిళలకు ఎంతో ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో.. జరీనా, నందితా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఇప్పటికే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘గాడ్‌ఫాదర్’తో.. అలనాటి ‘సీతాకోకచిలుక’?