కొత్త అందాలకు పట్టుగొమ్మ తెలుగు చిత్రసీమ. ఏటా పదుల సంఖ్యలో కొత్త తారకలు తెలుగు తెరపై తళుక్కుమని మెరుస్తుంటారు. అయితే వాళ్లలో హిట్టు మాట వినిపించి.. స్టార్ హీరోలతో జట్టు కట్టే స్థాయికి చేరుకునేది కొద్ది మందే. అందుకే ఎందరు భామలు తెలుగు తెరకు పరిచయమైనా.. స్టార్ కథానాయకుల సినిమాలకి నాయికల సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఆ లోటును పూడ్చేందుకే దర్శక నిర్మాతలు అప్పుడప్పుడు పొరుగు చిత్రసీమల వైపు దృష్టి సారిస్తుంటారు. ఆయా భాషల్లోని కొత్త సోయగాల్ని వెతికి పట్టుకొని తెలుగు సినీప్రియులకు పరిచయం చేస్తుంటారు. ఇప్పుడీ బాటలోనే పలువురు పరభాషా భామలు తెలుగు తెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. మరి వాళ్లెవరు.. వారి సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం.
అంటే.. సుందరానికి.. జోడీ
సినిమాల విషయంలో ఎప్పుడూ జోరు చూపిస్తుంటారు కథానాయకుడు నాని. ఏటా ఆయన నుంచి రెండు, మూడు చిత్రాలైనా విడుదలవుతుంటాయి. అందుకే ఆయన సినిమాల్లో కొత్త అందాల సందడి ఎక్కువ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆయన హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీనికి 'అంటే.. సుందరానికి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పుడీ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది మలయాళీ అందం నజ్రియా ఫహాద్. తమిళం, మలయాళ భాషల్లో స్టార్ నాయికగా మెరుపులు మెరిపిస్తున్న ఈ అమ్మడు.. అనువాద చిత్రం 'రాజా.. రాణి'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు నానితో జోడీ కట్టి నేరుగా తెలుగు వారిని పలకరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
నయా అందాల లీల..
కొత్త అందాలకు నెలవులా నిలుస్తుంటాయి దర్శకుడు రాఘవేంద్రరావు చిత్రాలు. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎంతో మంది స్టార్ నాయికల్ని వెండితెరకు పరిచయం చేశారు. ఇప్పుడాయన నుంచి వస్తోన్న కొత్త చిత్రం 'పెళ్లి సంద..డి'. గతంలో ఆయన నుంచి వచ్చిన 'పెళ్లి సందడి'కి సీక్వెల్‌గా రూపొందిస్తున్న చిత్రమిది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. గౌరీ రోనంకి దర్శకురాలు. ఇప్పుడీ చిత్రంతో శ్రీలీల అనే ఓ కొత్త భామను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు రాఘవేంద్రరావు. కన్నడలో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది శ్రీలీల. ఇప్పుడీ సినిమాతోనే తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో ఆమె ఓ నాయికగా ఎంపికైందట.