కొన్ని నెలలుగా ఎక్కడా లేని రీతిలో తెలుగులో కొత్త సినిమాలు విడుదలవుతూ వచ్చాయి. ఏడెనిమిది సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన శుక్రవారాలూ కనిపించాయి. కరోనా తర్వాత ఎక్కడా ఇన్ని సినిమాలు విడుదల కాలేదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని కీర్తిస్తూ వచ్చిన సినీ వర్గాల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. కరోనా ఉద్ధృతితో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తున్నాయి. విడుదల కోసం ముందే తేదీల్ని ఖరారు చేస్తూ కట్చీఫ్ వేసుకున్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. గాడిన పడిందనుకున్న చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది.
కరోనా తర్వాత థియేటర్లు తెరుచుకున్నా.. వంద శాతం కెపాసిటీతో ప్రదర్శనలు మొదలైనా మళ్లీ మునుపటిలా సినిమాలు సందడి చేస్తాయో? లేదో? అనే సందేహాలు వ్యక్తం అయ్యేవి. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తెలుగు సినిమా దూసుకెళ్లింది. థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. రూ. వందల కోట్లు వసూళ్లు వచ్చాయి. రికార్డులూ నమోదయ్యాయి. ఓవర్సీస్‌లోనూ మన సినిమాకు మళ్లీ డాలర్ల వర్షం కురిసింది. ఇది చూసి పొరుగు పరిశ్రమలు కూడా స్ఫూర్తి పొందాయి. ఉత్సాహాన్ని కూడగట్టుకున్నాయి. అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. హీరో ఎంత కొట్టినా చావకుండా ఎదురు తిరిగిన విలన్‌లాగా.. కరోనా మళ్లీ పంజా విసరడం వల్ల తెలుగు సినిమా బాక్సాఫీసు మరోసారి కళ తప్పేలా కనిపిస్తోంది.
వరుసగా మూడు చిత్రాలు
'లవ్‌స్టోరి', 'టక్ జగదీష్', 'విరాటపర్వం'.. ఇటీవల వరుసగా విడుదల తేదీల్ని వాయిదా వేసుకున్న చిత్రాలివి. కుటుంబ కథలతో తెరకెక్కడం.. వాటి లక్ష్యమైన కేటగిరీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితులు కనిపించకపోవడం వల్ల విడుదల తేదీల్ని వాయిదా వేసుకున్నాయి ఆయా చిత్రబృందాలు. పరిస్థితులు చూస్తుంటే ఆ జాబితాలోకి మరిన్ని చేరేలా కనిపిస్తున్నాయి. మే నెలలో విడుదల కావడమే లక్ష్యంగా పలువురు అగ్ర కథానాయకుల చిత్రాలు సిద్ధమవుతున్నాయి.
చిరంజీవి 'ఆచార్య', వెంకటేష్ 'నారప్ప', బాలకృష్ణ 'అఖండ', రవితేజ 'ఖిలాడి', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాలు మే నెలలోనే విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. కరోనా ఉద్ధృతి ఆగలేదంటే ఆ చిత్రాల విడుదల అనుమానమే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఉగాది సందర్భంగా బయటికొచ్చిన పలు చిత్రాల పోస్టర్లలో విడుదల తేదీలు కనిపించకపోవడం గమనార్హం.
ఆ చిత్రాలకు ఇంకా కష్టం
తెలుగు చిత్రసీమ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. 'బాహుబలి', 'కేజీఎఫ్' చిత్రాలు సాధించిన విజయాల తర్వాత తెలుగులో అగ్ర కథానాయకుల చిత్రాలు దాదాపుగా పాన్ ఇండియా స్థాయి లక్ష్యంతోనే పట్టాలెక్కుతున్నాయి. నాలుగైదు భాషల్లో ఒకేసారి విడుదలకావల్సిన చిత్రాలవి. ఒకవేళ మన దగ్గర విడుదలకు అనుకూలత ఉన్నా.. ఇతర భాషల్లో వాతావరణమూ కీలకమే. అందుకే పాన్ ఇండియా చిత్రాల్లో ఎప్పుడు ఏది విడుదల తేదీను వాయిదా వేస్తుందో చెప్పలేని పరిస్థితి.