తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2021, 4:08 PM IST

ETV Bharat / sitara

బాక్సాఫీస్ సందడి.. ఫిబ్రవరిలో బొమ్మ హిట్టేనా​?

ఫిబ్రవరిని టాలీవుడ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈనెలలో విడుదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో దాదాపు విజయం సాధించాయి. మరి వాటిలో హిట్​గా నిలిచినవి ఏంటి?

Tollywood movies february review
బాక్సాఫీస్ కళకళ.. ఫిబ్రవరిలో బొమ్మ హిట్టేనా​?

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ నుంచి తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన 'క్రాక్‌' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా అధిక మొత్తంలో వసూళ్లను రాబట్టడం వల్ల దర్శక నిర్మాతల్లో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అంగీకారం తెలపడం వల్ల చిత్రపరిశ్రమలో ఆనందం అంబరాన్ని తాకింది. దీంతో ఫిబ్రవరి నెలలో పలు చిత్రాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. వాటిల్లో 'ఉప్పెన' భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇంతకీ ఈ నెలలో విడుదలైన సినిమాలు ఏంటి? వాటిలో హిట్​గా నిలిచాయా?

సరికొత్త జానర్‌..

హాలీవుడ్‌లో జాంబి జానర్‌ చిత్రాలు తరచూ వస్తుంటాయి. తెలుగుకు మాత్రం కొత్త‌. ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తూ సాగే ఈ క‌థ‌ల్లో కావ‌ల్సినంత థ్రిల్ ఉంటుంది. అందుకే ఆ జాన‌ర్ విజ‌య‌వంత‌మైంది. తెలుగు ప్రేక్షకులకు జాంబి జానర్‌ను పరిచయం చేస్తూ ప్రశాంతవర్మ దర్శకత్వం వహించిన చిత్రం 'జాంబీరెడ్డి'. బాలనటుడిగా తెలిసిన తేజ సజ్జా.. ఈ సినిమాతో హీరోగా మారారు. ఫిబ్రవరి 5న విడుదలైన 'జాంబీరెడ్డి' ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

జాంబీరెడ్డి మూవీ

కామెడీ + భావోద్వేగం..

టైటిల్‌తోనే సినీప్రియుల్ని ఆకర్షించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శకుడు. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రామ్ కార్తీక్ - అమ్ము అభిరామి జంట‌గా కనిపించారు. బేబీ స‌హ‌శ్రిత కీలక పాత్ర పోషించింది. కామెడీతోపాటు భావోద్వేగాలు కూడా సమానంగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

జగపతిబాబు ఎఫ్​సీయూకే మూవీ

ఉప్పెనంత విజయం

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి నటీనటులుగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మించింది. ‘ప్రేమంటే పట్టుకోవడం నాన్నా. వదిలేయడం కాదు’, ‘నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ’... ఇలాంటి డైలాగులతో ట్రైలర్‌లోనే ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా ఫిబ్రవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఘన విజయాన్ని నమోదు చేసుకుని భారీ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.

వైష్ణవ్ తేజ్,కృతిశెట్టి ఉప్పెన మూవీ

థ్రిల్‌ మిస్‌..

థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కి కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన ‘కావలుధారి’ని తెలుగులోకి ‘కపటధారి’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రదీప్ కృష్ణ‌మూర్తి దర్శకత్వంలో సుమంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలైంది. కథలో ఎన్నో మలుపులు ఉన్నప్పటికీ థ్రిల్‌ మిస్‌ కావడం వల్ల సాధారణ టాక్‌కే ఇది పరిమితమైంది.

సుమంత్ కపటధారి మూవీ

బ్లాక్‌బస్టర్‌ జస్టిస్‌..

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కథానాయకుడు నరేష్‌ను ‘నాంది’ రూపంలో విజయం వరించింది. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు. భార‌తీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 211 గురించి అవగాహన కలిగించేలా రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదలై హిట్‌ టాక్‌ను అందుకుంది.

అల్లరి నరేష్ నాంది మూవీ

ప్రతీకార కథతో అక్షర

బి. చిన్నికృష్ణ డైరెక్షన్‌లో నందితాశ్వేత కీలకపాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. నేటి విద్యా వ్యవ‌స్థ తీరునీ... ర్యాంకుల కోసం కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల జీవితాలతో చెల‌గాట‌మాడుతున్న వైనాన్నీ స్పృశిస్తూ సాగే క‌థ ఇది. అయితే విద్యావ్యవ‌స్థలోని మంచి చెడుల కంటే కూడా... ఓ యువ‌తి ప్రతీకార క‌థే హైలైట్ అయ్యింది. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరుగా అలరిస్తోంది.

నందితా శ్వేత అక్షర మూవీ

'చెక్‌'

'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు' లాంటి విభిన్నకథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘చెక్‌’. నితిన్‌ కథానాయకుడు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగ్రవాదిగా ముద్రపడిన ఓ ఖైదీ బయటకు ఎలా వస్తాడు?అతనికి క్షమాభిక్ష దొరికిందా?లేదా? అనే ఉత్కంఠకు గురి చేసే కథతో తెరకెక్కిన ‘చెక్‌’ మంచి టాక్‌ అందుకుంది.

నితిన్ చెక్ మూవీ

ఇవి మాత్రమే కాకుండా ఉదయ్‌ శంకర్‌ 'క్షణక్షణం', విశాల్‌ 'చక్ర' చిత్రాలు థియేటర్లలో విడుదలై ఫర్వాలేదనిపించాయి. వీటితోపాటు ఓటీటీ వేదికగా విడుదలైన 'మిడ్‌నైట్‌ మర్డర్స్‌', 'దృశ్యం 2'.. థ్రిల్లర్‌ కథాంశాలతో ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details