చిత్రీకరణ ఆపకూడదన్న పట్టుదల.. సినిమా పూర్తి చేయాలన్న తపనుంటే.. ఆ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నిలువెల్ల జాగ్రత్త.. అనుక్షణం అప్రమత్తత.. ఆయుధాలుగా కరోనా మహమ్మారిని దరిచేరనీయకుండా లక్ష్యం నెరవేర్చుకుంటున్నాయి సినీ బృందాలు. కష్టకాలంలో పలువురికి ఉపాధి చూపుతున్నాయి. కరోనా భయపెడుతున్నా చిత్రీకరణలో బాలకృష్ణ గర్జన కొనసాగుతోంది. అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అంటున్నాడు. మరి కొద్దిమంది యువ హీరోలదీ అదే మాటే. సీనియర్ హీరో రజనీకాంత్ అదే ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దాంతో టాలీవుడ్‌లో సినిమాల చిత్రీకరణలతో కొంచెం సందడి కనిపిస్తోంది.
కరోనా భయాలు లేకపోయుంటే తెలుగులో అసలు సిసలు వేసవి సీజన్ మొదలైపోయేది. రూ.వందల కోట్ల వ్యాపార లావాదేవీలు ఊపందుకునేవి. పరిస్థితులు తలకిందులైపోయాయి. ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియని పరిస్థితి. అందుకే షెడ్యూళ్లు ఆగిపోయాయి. చిత్రీకరణలకు తాత్కాలిక విరామం ప్రకటించేసి పరిస్థితుల్ని అంచనా వేసే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. కొన్ని చిత్రబృందాలు మాత్రం 'ముందు పని పూర్తి చేసేద్దాం' అంటూ రంగంలోకి దిగాయి. చిత్రీకరణల్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాయి.
* అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రీకరణ కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లోనే ప్రతినాయకుడిగా నటిస్తున్న ఫాహద్ ఫాజిల్, అనసూయ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా చిత్రబృందం శ్రమిస్తోంది.
* బాలకృష్ణ 'అఖండ' చిత్రీకరణ రెండు వారాలుగా వికారాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు.