Tollywood Mass movies of 2022: మాస్ అనే మాటకి ఒక్కో చోట ఒక్కో నిర్వచనం ఉంటుంది. మన దగ్గర మాస్ అంటే వాణిజ్య సూత్రం. బాక్సాఫీసు మురిపెం. తెలుగులో మాస్ సినిమాకి ప్రత్యేకమైన కొలతలు ఉంటాయి. వీరోచితమైన ఫైట్లు... ఊపు తెప్పించే పాటలతోపాటు... కథానాయకుడు నీటుగా కాకుండా నాటుగా కనిపిస్తూ, నాటు పనులు చేస్తూ ప్రేక్షకులకు వినోదాలు పంచుతుండాలి. గతంలో ఇలాంటి చిత్రాల హవా నడిచింది. కథా ప్రాధాన్యంతో కూడిన సినిమాలు అలవాటయ్యాక... కొత్తతరం కథల జోరు పెరిగాక మార్పు వచ్చింది. మాస్ కథల జోరు తగ్గింది. అగ్ర హీరోలు కథా ప్రాధాన్య సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలాగని మాస్ కథలకి కాలం చెల్లిందని కాదు. టెంప్లేట్ కథైనా, ఫార్ములా అయినా కొత్తగా ఉంటే చాలు... ఇప్పటికీ ఆ సినిమాలకి బ్రహ్మరథం పడుతుంటారు ప్రేక్షకులు. ఆ విషయం ఎప్పటికప్పుడు ఏదో ఒక చిత్రం రుజువు చేస్తూనే ఉంది. గతేడాది వచ్చిన ‘క్రాక్’, ఈమధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ మాస్ పవర్ ఏమిటో మరోసారి బాక్సాఫీస్‌కి రుచి చూపించాయి. అందుకే సీనియర్లతోపాటు, యువతరం హీరోలు ఎంత కొత్త రకమైన సినిమాలు చేసినా మధ్యలో ఓ మాస్ కథపై కన్నేస్తుంటారు.
Suriya ET movie: 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలు చేసిన సూర్య... ఆ వెంటనే వాటికి పూర్తి భిన్నమైన 'ఈటీ' చేశారు. ‘జై భీమ్’ తరహాలోనే ‘ఈటీ’లో న్యాయవాదిగానే కనిపించారు, నల్లకోటు వేసుకునే పోరాటం చేశారు. అయితే ఇందులో పోరాటం వేరు, ఈ కథ వేరు. పూర్తిస్థాయి మాస్ కొలతలతో రూపొందింది. ప్రేక్షకులు ఈల కొట్టి గోల చేస్తూ ఆస్వాదించేలా వాణిజ్యాంశాల్ని జోడించారు. అలా తెలుగు కథానాయకులూ క్రమం తప్పకుండా మాస్ మంత్రం జపిస్తుంటారు. అగ్ర హీరోలు ఏ సినిమా చేసినా వాటిలో మాస్ అంశాలు కొన్ని తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడూ కొత్త రకమైన సినిమాలు చేసే కుర్రహీరోలూ ఇప్పుడు మాస్ కథలపై గురి పెడుతున్నారు.
Rampotineni Boyapati movie:రామ్ పోతినేని ‘ది వారియర్’ అంటూ ఖాకీ చొక్కా ధరించారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. తదుపరి బోయపాటి దర్శకత్వంలో సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. బోయపాటి అంటే ఇక మాస్‌కి పెట్టింది పేరు. ఈ చిత్రమూ అలాంటి అంశాలతోనే ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
Nithin Macharla movie: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అంటూ కాస్త పొలిటికల్ టచ్ ఇస్తూనే మరోసారి మాస్ మంత్రం జపిస్తున్నారు. నాని ‘దసరా’ అంటూ నాటు అవతారం ఎత్తనున్నారు.