తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ కన్నుమూత - సినీగేయ రచయిత కందికొండ కన్నుమూత

tollywood lyricist kandikonda is no more
ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ కన్నుమూత

By

Published : Mar 12, 2022, 5:06 PM IST

Updated : Mar 12, 2022, 5:36 PM IST

17:03 March 12

tollywood lyricist kandikonda is no more

కందికొండ యాదగిరి కన్నుమూత

Tollywood Lyricist Kandikonda: ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆ వ్యాధిని జయించినా, ఆ వ్యాధి ప్రభావం వెన్నెముకపై పడటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నా, పూర్తి స్థాయిలో కోలుకోలేదు.

kandikonda Yadagiri

హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన కందికొండ.. చక్రి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు రాశారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.

Kandikonda Passed Away

20ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాశారు. మొదట్లో జానపద గీతాలను రాసిన కందికొండ, సినీ సంగీత దర్శకుడు చక్రి ప్రోత్సాహంతో సినిమా పాటలు రాశారు. సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసి పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా జనం నోట మార్మోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయడంలోనూ కందికొండ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలు, పల్లెబతుకు చిత్రాలను కథలుగా రచించి కథకుడిగానూ విశేష ఆదరణ పొందారు.

క్యాన్సర్‌ పోరాడి గెలిచిన తర్వాత కందికొండను వెన్నెముక సమస్య ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఆయన ఆస్పత్రి పాలవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో కందికొండ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగా ఉన్నా, ఇటీవల క్షీణించడంతో శనివారం కందికొండ తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు.

Last Updated : Mar 12, 2022, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details