Tollywood Hit pairs upcoming movies: హిట్ పెయిర్- ఈ మాటకి చిత్రసీమలో చాలా విలువ. ఇందులో విజయం ఉండటమే అందుకు కారణం! ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందిందంటే అందులోని నాయకానాయికల్ని మరోసారి కొనసాగించడానికి ఇష్టపడుతుంటారు దర్శకనిర్మాతలు. ఆ జోడీ చుట్టూ ప్రత్యేకమైన మార్కెట్ లెక్కలు ఆవిష్కృతం అవుతుంటాయి. కొన్నిసార్లు సినిమా విజయం సాధించకపోయినా... అందులో జోడీ బాగుంది, మంచి కెమిస్ట్రీ పండిందనే పేరొచ్చిందంటే ఆ ఇద్దరిపైనా మంచి అంచనాలే ఏర్పడుతుంటాయి. అలాంటి జోడీలు మళ్లీ మళ్లీ తెరపై దర్శనమిస్తుంటాయి. అలా ఇప్పుడు రెండోసారి జట్టు కట్టిన జంటలు చాలానే ఉన్నాయి. ఆ కథేమిటో చదివేయండి.
పాత రోజుల్లో శ్రీదేవి, విజయశాంతి, రాధ, రాధిక, సౌందర్య, సిమ్రన్ తదితర కథానాయికలు ఏ హీరోతో కలిసి ఆడిపాడినా జోడీ అదిరింది అనిపించేవారు. శ్రియ, త్రిష, అనుష్క, సమంత, తమన్నా, కాజల్ తదితర భామలూ కథానాయకులతో కెమిస్ట్రీ పండించడంలో తమకి తామే సాటి అని నిరూపించారు. హీరోలతో కలిసి మళ్లీ మళ్లీ తెరపై కనిపిస్తూ మార్కెట్‌ని ప్రభావితం చేసేవారు. నయా భామలు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు.
Mahesh babu pooja hegdey movie: పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే అల్లు అర్జున్‌తో కలిసి ‘దువ్వాడ జగన్నాథం’లో ఆడిపాడింది. ఆ జోడీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరోసారి సందడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆమె ఇదివరకు మహేష్‌బాబుతో ‘మహర్షి’లో ఆడిపాడింది. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నటించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ జోడీతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.
కీర్తిసురేష్ - నాని జోడీ ‘నేను లోకల్’తో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి ‘దసరా’ కోసం ఆ ఇద్దరూ కలిశారు. వీరి జంట మళ్లీ ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని భావిస్తున్నారు.