తెలుగు చిత్రసీమలో కథ కంటే.. కలయిక (కాంబినేషన్)లకే ఎక్కువ ప్రాధాన్యం అనే మాట తరచూ వినిపించేదే. హీరో - హీరోయిన్, హీరో - దర్శకుడు... ఇలా ఏ ఇద్దరు కలిస్తే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి వెళతాయో, అలాంటి కలయికలు ఎక్కువగానే కుదురుతుంటాయి. ఇక విజయాలు అందుకున్న కాంబినేషన్‌లో సినిమా అంటే సరే సరి! క్లాప్ కొట్టకముందే వాటిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆత్రుత కనిపిస్తుంటుంది. ముందుస్తు వ్యాపార లావాదేవీల్లోనూ ఆ చిత్రాలు జోరుని ప్రదర్శిస్తుంటాయి. ఈ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకునే... ఓ మంచి కలయికని సెట్ చేద్దాం అంటూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు నిర్మాతలు. అలా సెట్ అయ్యిందంటే చాలు... సగం విజయం చేతికందినట్టుగానే భావిస్తుంటారు. తెలుగులో విజయవంతమైన కలయికల్లో సినిమాలు తరచూ రూపొందుతుంటాయి. ఆ దిశగా ఇటీవల మరికొన్ని ప్రాజెక్టులు ఖాయం అయ్యాయి.
ఇది కాంబినేషన్ ఫార్ములా
బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల.. అఖండ, అల్లు అర్జున్ - సుకుమార్‌ల.. పుష్ప, వెంకటేష్ - వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి ఎఫ్3... ఇలా విజయవంతమైన కలయికల్లో రూపొందుతున్న సినిమాలన్నీ ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నవే. పవన్‌కల్యాణ్ - హరీష్‌శంకర్ కలయికలోనూ మరో సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. గబ్బర్‌సింగ్ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న ఆ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లనేలేదు. అప్పుడే అభిమానులు ఆ సినిమా గురించి ప్రత్యేకమైన ఆసక్తితో మాట్లాడుకుంటున్నారు. ఆ కాంబినేషన్లకి ఉన్న బలం అలాంటిది. అందుకే దర్శకులు, హీరోలు మంచి కథ కుదిరిందంటే మళ్లీ మళ్లీ కలిసి పని చేసేందుకు రెడీ అవుతుంటారు. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత ఆ కలయికలో బంగార్రాజు కోసం ఎప్పట్నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. మనం తర్వాత నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ మరోసారి కలిసి థ్యాంక్ యూ చిత్రం చేస్తున్నారు. నారప్ప, టక్ జగదీష్, ఖిలాడి తదితర చిత్రాలూ ఇదివరకు పునరావృతమైన జట్లతో రూపొందుతున్నవే.