కరోనా కారణంగా వచ్చిన గ్యాప్‌ను కవర్ చేసేందుకు మన తెలుగు హీరోలు సిద్ధమయ్యారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా తారలంతా తెరపై వాలిపోతున్నారు. వరుస సినిమాలు విడుదలవుతున్నా ఇప్పటి వరకూ అగ్రహీరోల నుంచి ఒక్క సినిమా కూడా రాలేదనే నిరాశ మాత్రం ఉంది. దానికి చెక్ పెడుతూ.. స్టార్ హీరోలంతా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ.. మన అభిమాన హీరోల రానున్న సినిమాలు.. వాళ్లు చేస్తున్న సినిమాలు.. చేతిలో ఉన్న సినిమాలేంటో తెలుసా..?
రేసులో చిరు టాపర్
వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్నారు చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. దీని తర్వాత మోహన్‌రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' పట్టాలెక్కనుంది.
తమిళ 'వేదాళం'కు తెలుగు రీమేక్‌లోనూ చిరు ప్రధానపాత్ర పోషించనున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా.. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్ననట్లు చిరంజీవి గతంలోనే ప్రకటించారు. మరోవైపు.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇటీవల ప్రకటించిన 'అన్నం' చిత్రం కోసం చిరును సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఖరారు అయితే.. చిరు నుంచి అభిమానులు ఐదు సినిమాలు ఆశించవచ్చు. టాలీవుడ్‌లో మరే హీరో చేతిలో ఇన్ని సినిమాలు లేవు మరి.!
వెంకీ మామ జోరు
వెంకీమామ కూడా మంచి జోష్‌లో కనిపిస్తున్నారు. ఆయన నటించిన 'నారప్ప' మే 14న విడుదల కానుంది. తమిళంలో వచ్చి హిట్టు కొట్టిన 'అసురన్'కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్ నటిస్తున్న మరో చిత్రం 'ఎఫ్3' కూడా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా.. మరో రీమేక్‌కు వెంకీమామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఓటీటీలో విడుదలై అందర్నీ ఆకట్టుకుంటున్న మలయాళ చిత్రం 'దృశ్యం2' ఇప్పటికే పట్టాలెక్కింది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నాగ్ మూడు చిత్రాలు..
బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తున్న అక్కినేని నాగార్జున ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చారు. ఆ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు నాగార్జున నటించిన 'వైల్డ్‌డాగ్' కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో పాటు 'బంగార్రాజు' పేరుతో నాగార్జున హీరోగా ఒక సినిమా రాబోతోంది. తనయుడు అఖిల్‌తో కలిసి ఒక మల్టీస్టారర్‌లో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే నాగార్జునకు కథ వినిపించినట్లు సమాచారం. అయితే.. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
నెమ్మదించిన బాలయ్య
తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ మరో సినిమా చేస్తున్నారు. 'బీబీ3' పేరుతో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. 'గాడ్ ఫాదర్' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహ', 'లెజెండ్' సినిమాలు ఎంతలా అలరించాయి.
ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే.. 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో దర్శకత్వంలో బాలయ్యబాబు ఓ సినిమా చేయనున్నారు. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల సినిమాల విషయంలో బాలకృష్ణ కాస్త నెమ్మదిగా ఉన్నారు.
పవన్ కల్యాణ్ మెరుపులు..
పవన్‌కల్యాణ్‌కు రీఎంట్రీ చిత్రం 'వకీల్‌సాబ్'. దీనిపై భారీ అంచనాలున్నాయి. వేణుశ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే.. పవన్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో రానాతో కలిసి నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాకు 'బిల్లా రంగా', 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్‌ను ఆలోచిస్తున్నారట.