జయాపజయాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి రంగంలో సర్వ సాధారణమైన అంశాలే. కానీ, చిత్ర పరిశ్రమకివి మరింత ప్రత్యేకం. కచ్చితంగా చెప్పాలంటే రంగుల తెరపై కాంతులీనేందుకు విజయాలే అతి పెద్ద కొలమానం. ఇక్కడ ఒక్క హిట్టుతో ఆకాశమంత ఎత్తుకెదిగినా.. ఒక ఫ్లాప్ ఎదురైతే మళ్లీ తొలి మెట్టు నుంచే సినీ ప్రయాణం మొదలు పెట్టినట్లే లెక్క. మరో విజయంతో తమని తాము నిరూపించేకునేంత వరకు నిరాశ నిస్పృహలు వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఓటమెరుగని ప్రయాణం అన్ని వేళలా సాధ్యం కాదు. "ఓటమిని అంగీకరించే ధైర్యం ఉన్నవాడికే గెలిచే హక్కుంది" అన్నట్లు ఇక్కడ ఫ్లాపుల్ని తట్టుకుని నిలబడగలిగిన వాళ్లకే స్టార్‌డమ్‌ను అందుకునే అర్హత ఉంటుంది. వెండితెరపై స్టార్లుగా వెలిగిపోతున్న కథానాయకుల్లో కొందరు తమ సినీ జీవితంలో ఎదురయ్యే జయాపజయాల్ని ఎలా స్వీకరిస్తుంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
ఫలితమేదైనా... ప్రయాణంలోనే కిక్
"నా దృష్టిలో ప్రతి చిత్రం ఓ గొప్ప ప్రయాణమే. కొన్నిసార్లు సినిమా కోసం చేసిన ప్రయాణం బాగుంటుంది. ఫలితం సరిగా ఉండదు. కొన్నిసార్లు ప్రయాణాలు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఫలితం బాగుంటుంది. అందుకే నాకు సినిమా ఫలితం కంటే, ఆ చిత్రం కోసం చేసిన ప్రయాణంలోనే కిక్ ఉంటుంది. ఇలాంటి ప్రయాణాలు నాకెన్నో పాఠాలు నేర్పించాయి. 'టెంపర్' లాంటి కథ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 'నాన్నకు ప్రేమతో', 'జై లవకుశ'.. ఇవన్నీ నా తరహా కథలు కాదు. కానీ, నా ప్రయోగాలు ఫలించాయి. ఎన్టీఆర్ ఇలాంటి చిత్రాలు చెయ్యగలడా అనే షాకింగ్ వాల్యూ నాకు కావాలి. దాని కోసమే నా ఎదురు చూపులు". - ఎన్టీఆర్
పరాజయాలకు నాదే బాధ్యత
"ఒక్కో చిత్రం ఒక్కో అనుభవాన్ని పంచుతుంది. ప్రతి సినిమానీ ఒక తపనతో చేస్తా. కానీ, ఎంత కష్టపడినా కొన్నిసార్లు కోరుకున్న ఫలితం రాకపోవచ్చు. నా పరాజయాలకు నేనే బాధ్యత తీసుకుంటా. క్రికెట్ టీమ్‌లో కెప్టెన్ ఎలా బాధ్యత తీసుకుంటాడో, సినిమా విషయంలో హీరో అంతే. నేను చూసిన ప్రతి పరాజయం నాకు కొత్త పాఠాన్ని నేర్పింది. జాగ్రత్తగా ఆలోచించి ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియజేసింది." - సాయితేజ్
ఫ్లాప్ ఓ మేల్కొలుపు
"ప్రతి చిత్రానికీ ఒకేలా కష్టపడతాం. అన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. 'జగడం', 'ఎందుకంటే ప్రేమంట' సినిమా ఫలితాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే ఆ రెండు చిత్రాల్ని చాలా ప్రేమించా. ఫ్లాప్ అంటే.. అదో మేల్కొలుపు. 'ఎక్కడో తప్పు జరుగుతోంది, చూసుకో' అని చెప్పడమే" - రామ్